-కవుల్లో ఆయన శిఖర సమానుడు.. ఒక విద్యాసంస్థకు ఆయన పేరు -మహాకవిని చిరస్మరణీయం చేసేలా విగ్రహం.. ఆయన కుమారుడికి ఉద్యోగం -తెలంగాణ వైభవాన్ని పునరుద్ధరించేందుకు ఒక కార్యకర్తగా పనిచేస్తా -దాశరథి 89వ జయంత్యుత్సవాల్లో సీఎం కేసీఆర్
మహాకవి దాశరథి పేరిట ప్రత్యేక సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో రూ.లక్షా నూటపదహార్ల నగదుతో త్వరలోనే దాశరథి పురస్కారాన్ని నెలకొల్పుతామని చెప్పారు. మంగళవారం రవీంద్రభారతిలో మహాకవి దాశరథి 89వ జయంత్యుత్సవాల్లో ఆయన మాట్లాడుతూ కవుల్లో శిఖర సమానుడైన దాశరథి కీర్తిని చిరస్మరణీయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దాశరథి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయానికి లేదా విద్యాసంస్థకు దాశరథి పేరు పెడతామని, హిమాలయమంత ఉన్నతమైన దాశరథి కీర్తిని ప్రతిబింబించేలా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
చరిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాట కాలంలో దాశరథి పద్యాలతోనే సభలు ప్రారంభమయ్యేవని, తెలంగాణ సాహిత్య చరిత్ర ఉన్నంతవరకు ఆయన ఉన్నతంగా నిలిచి ఉంటారని సీఎం కీర్తించారు. సీమాంధ్ర వలస పాలకులు దాశరథి విషయంలో కర్కశంగా వ్యవహరించారని, ఆయనను ఆస్థాన కవి పదవి నుంచి తొలగించి అగౌరవపరచారని విమర్శించారు. జాతీయ కళావేదికగా భాసిల్లుతున్న రవీంద్రభారతి నిర్వహణ కోసం ప్రస్తుతం అందచేస్తున్న రూ.30లక్షల గ్రాంటును రూ.కోటికి పెంచుతామని తెలిపారు. ఈ హామీలన్నింటికి సంబంధించిన జీవోలను వెంటనే ఇవ్వాల్సిందిగా వేదికమీద ఉన్న రాష్ట్ర సాంస్కృతికశాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్యను ఆదేశించారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని పూర్తిస్థాయిలో సంస్కరించి ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే విశ్వవిద్యాలయాన్ని తనికీ చేస్తానని అన్నారు. సకల కళలకు పుట్టినిల్లయిన తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పి తెలంగాణ భాషా, సాహిత్య, సాంస్కృతిక, జానపద కళావైభవాన్ని తెలియచేసేలా వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతామని సీఎం తెలిపారు. తెలంగాణ యాసను శ్వాసించిన మహాకవులు దాశరథి, కాళోజీ, వట్టికోట ఆళ్వారుస్వామి, పీవీ నరసింహారావు, ఒద్దిరాజు సోదరులు, మరింగంటి సోదరులను నిరంతరం గుర్తుపెట్టుకునేలా వారందరి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

విద్వత్‌కవులు, బహుభాషా కోవిదులు, విలక్షణ సాహితీవేత్తలు నడయాడిన గొప్ప నేల తెలంగాణ అన్నారు. తిరుమల శ్రీనివాసాచార్య, మృత్యుంజయశర్మ వంటి గురువులు తనను తీర్చిదిద్దారని, వారి నుంచే సంస్కారాన్ని నేర్చుకున్నానని తెలిపారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్‌ను ప్రశంసిస్తూ తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక కళావైభవాన్ని వెక్కిరించటానికి ప్రయత్నిస్తే మా దగ్గర రాళ్లబండి ఉన్నదన్న విషయాన్ని మర్చిపోవద్దు అని చమత్కరించారు. భాషా సాంసృతికశాఖ సలహాదారు కేవీ రమణాచారి, ప్రముఖ కవులు దేశపతి శ్రీనివాస్, తిరుమల శ్రీనివాసాచార్యులు, నందిని సిద్దారెడ్డి దాశరథి సాహిత్య ఔన్నత్యాన్ని వివరించారు. కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎల్లూరి శివారెడ్డి, దాశరథి కుమారుడు దాశరథి లక్ష్మణ్‌తోపాటు దాశరథి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.