-ఏకగ్రీవంగా ఎనిమిదోసారి.. – కేసీఆర్ ఎన్నికను ప్రకటించిన నాయిని ముంచెత్తిన గులాబీ పూలవాన.. హర్షధ్వానాలతో హోరెత్తిన ప్రాంగణం

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 8వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీలో పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ నాయిని నర్సింహారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ ప్రకటనతో సమావేశ ప్రాంగణం హర్షధ్వానాలతో హోరెత్తింది. ప్రతినిధులపై గులాబీ పూల వాన కురిసింది. టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి కేసీఆర్ పేరిట ఐదు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని నాయిని తెలిపారు. మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. ఈ రోజు చాలా గర్వంగా ఉంది. కల నిజమైంది. తెలంగాణ తల్లికి బంధ విముక్తి జరిగింది. 2001లో అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ పంట పండించారు. 14 సంవత్సరాల ఎడతెరపి లేని ఉద్యమాన్ని నిరాటంకంగా కొనసాగించి, కష్టాలు,నష్టాలను భరించి ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ చివరకు తెలంగాణ కలను సాకారం చేశారు అని చెప్పారు. ఎనిమిదోసారి కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తన చేతుల మీదుగా ప్రకటించడంతో తన జన్య ధన్యమైందన్నారు. కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ప్రకటించగానే.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ సభలో నినాదాలు మారుమోగాయి. కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ ఈలలు, చప్పట్లతో హర్షాన్ని వ్యక్తంచేశారు.
అనంతరం వేదికపై ఉన్న మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. అంతకు ముందు స్వాగతోపన్యాసం చేసిన స్టీరింగ్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన ఎందరో త్యాగధనుల ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. పద్నాలుగేండ్లక్రితం జలదృశ్యంలో ఏప్రిల్ 27, 2001న ప్రారంభమైన టీఆర్‌ఎస్ నేడు అధికారపక్షంగా మారి, తనను నమ్ముకున్న ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నదని చెప్పారు. కార్యకర్తలు అంకితభావంతో పనిచేశారని, ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ తెలంగాణ సాధించడం ద్వారా గమ్యాన్ని చేరుకున్నారని అన్నారు. కేసీఆర్ అజేయుడు, టీఆర్‌ఎస్ అజేయం అని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేసీఆర్ అనే మూడు అక్షరాలు మాత్రమే పలుకుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 50 లక్షలమంది పార్టీలో చేరారని, ఇందుకుగాను రూ.10కోట్లు సభ్యత్వ రుసుం ఖాతాలో జమ అయ్యిందని చెప్పారు.
కేసీఆర్ పాలకుడిగా రావడం చరిత్రాత్మకం టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ రావడం చరిత్రాత్మకమైతే.. కేసీఆర్ ఆ తెలంగాణకు పాలకుడిగా రావడం అంతకంటే చరిత్రాత్మకమని చెప్పారు. బంగారు తెలంగాణకోసం ప్రతి కార్యకర్త నడుంబిగించి పనిచేయాల్సిన అవసరం ఉందని కేకే తన తొలి పలుకుల్లో చెప్పారు. కేసీఆర్ నాయకత్వం అంటేనే తెలంగాణ.. టీఆర్‌ఎస్ అంటేనే తెలంగాణ.. తెలంగాణ అంటేనే టీఆర్‌ఎస్ అని ప్రజల్లో నాటుకుపోయిందన్నారు. తెలంగాణ రావడానికి కొద్ది రోజులు మందు సీఎం ఎవరన్న చర్చ జరిగితే మీరే ఉండాలని తామంతా కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చామని ఆయన చెప్పారు. ఇప్పడున్న పరిస్థితుల్లో రాష్ర్టాన్ని, సమాజాన్ని సరైన దిశలో నడిపించేందుకు మీ నాయకత్వం కావాలని, మీరే తెలంగాణకు కావల్సిన నాయకత్వాన్ని అందించగలరని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పామని వెల్లడించారు. దశాబ్దాలకాలంలో చేయలేని పనులను 10నెలల్లో చేసి చూపించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అసాధ్యం అన్న తెలంగాణను సుసాధ్యం చేశారు. ఇప్పుడు బంగారు తెలంగాణను కూడా కేసీఆర్ చేస్తారు. నవ తెలంగాణ సాధన యజ్ఞంలో ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలి అని కేకే పిలుపునిచ్చారు.