– కేంద్ర ప్రభుత్వ అండతోనే చంద్రబాబు కుట్రలు – కరెంటు కష్టాలకు బాబు, మోడీలే కారకులు – రుణమాఫీపై ఆర్‌బీఐ కొర్రీల వెనుక మోడీ.. – సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు కిషన్‌రెడ్డికి లేదు – తూప్రాన్‌లో నిప్పులు చెరిన మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ సర్కారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరుతున్న తీరును చూసి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలకు మింగుడుపడడం లేదు. ఏదో ఒకరకంగా విమర్శలు చేయాలని సొల్లువాగుడు వాగుతున్నారు. కేంద్రప్రభుత్వం అండతో తెలంగాణ సర్కార్‌పై చంద్రబాబు చేస్తున్న దాదాగిరి నడవదు. ఆంధ్రా నుంచి మాకు కరెంటు రానివ్వడం లేదు.
రాష్ట్రంలో కరెంటు, సాగునీటి కష్టాలకు ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబే కారకులు అని భారీ నీటి పారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు. గురువారం మెదక్ జిల్లా తూప్రాన్ లో టీడీపీ, కాంగ్రెస్ నుంచి నాయకులు, కార్యకర్తలు హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పుడు మాటలు విని కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నదని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రం నుంచి రావాల్సిన తెలంగాణ వాటాను ప్రధాని మోడీ ఆంధ్రాకు అప్పగించారని, ఉద్యోగుల పంపిణీ ఫైలుపై సంతకం పెట్టకుండా ఆపుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్‌లో మొండి చేయి చూపించి, ఆంధ్రాలో బుల్లెట్ రైళ్లను నడిపిస్తారట. రైతు రుణాలు మాఫీచేస్తామంటే మోడీ తెరవెనుక ఉండి రిజర్వుబ్యాంకుతో కొర్రీలు పెట్టిస్తున్నారు అని నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రధానిని నిలువరించలేని జీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతికహక్కు లేదన్నారు.
తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే వీపు చూపించిన వ్వక్తి, మోడీ, అద్వానీ, వాజపేయిల బొమ్మనీడలో బతికేవారు.. తెలంగాణ సాధకుడిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే లోయర్ సీలేరు నుంచి రావాల్సిన కరెంటు వాటాను ఇస్పించాలని, బాబుకు మోడీ వత్తాసు పలకకుండా చూడాలని సూచించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామంటే బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని, గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు జరపడంపై కిషన్‌రెడ్డి సంకుచితత్వంతో మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. బీజేపీ పూర్తిగా మతతత్వపార్టీ అయితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం సర్వమతాల అభివృద్ధిని కోరుకునేదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూం రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, సర్పంచ్ శివ్వమ్మ పాల్గొన్నారు.