-కలిసే జీవించే వ్యూహం అనుసరించాలి.. భయంవద్దు.. -కోలుకున్నవారే ఎక్కువ.. మరణాలు 2.38 శాతమే -హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలోనే వైరస్ -రాష్ట్రంలో మరెక్కడా యాక్టివ్ కేసులు లేవు -కేంద్రం మార్గదర్శకాల తర్వాతే కార్యాచరణ -వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త -హైదరాబాద్‌లో మరో 45 బస్తీ దవాఖానలు -జూన్ 20 నుంచి హరితహారం: సీఎం

కరోనా వైరస్ ఎంతకాలం ఉంటుందో తెలియని నే పథ్యంలో దానితో కలిసి జీవించే వ్యూహాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. కొవిడ్-19పై భయపడాల్సిన అవసరం లేదని, వైరస్ సోకి కోలుకుంటున్నవారే ఎక్కువమంది ఉన్నారని చెప్పారు. తెలంగాణలో కరోనా వచ్చినవారిలో మరణించిన వారిశాతం 2.38 మాత్రమేనని, దేశసగటు 3.5 శాతంకన్నా తక్కువేనని చెప్పారు. హైదరాబాద్‌లోని నాలుగుజోన్లలో తప్ప, రాష్ట్రంలో మరెక్కడా కరోనా యాక్టివ్ కేసులు లేవని ప్రకటించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్ అమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యలపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులున్నాయని, ఆప్రాంతాల్లో నిబంధనల ను కఠినంగా అమలుచేస్తున్నామని చెప్పారు. యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో వలసకూలీలకే వైరస్ సోకిందని, వారు హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో శనివారం నుంచి ఏసీలు అమ్మేషాపులు, ఆటోమొబైల్‌షోరూంలు, స్పేర్‌పార్ట్స్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. మిగతా లాక్‌డౌన్ నిబంధనలు యథావిధిగా అమలవుతాయని చెప్పారు. ‘కేంద్రం విధించిన తాజా లాక్‌డౌన్ ఈ నెల 17తో ముగుస్తుంది. తర్వాత కేంద్రం మరికొన్ని మార్గదర్శకాలు జారీచేసే అవకాశం ఉన్నది. వాటిని పరిశీలించి, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించి తగిన వ్యూహం ఖరారు చేస్తాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. విమానాల ద్వారా హైదరాబాద్ చేరుకునే తెలంగాణవాసులకు పరీక్షలు నిర్వహించాలని, వైరస్ ఉంటే వెంటనే దవాఖానకు తరలించాలని అధికారులకు సూచించారు. పాజిటివ్ లేకుంటే హోంక్వారంటైన్‌లో ఉంచాలన్నారు. హైదరాబాద్‌లో దిగే ఇతర రాష్ర్టాలకు చెందిన వారిని విమానాశ్రయం నుంచే నేరుగా ప్రత్యేక బస్సుల ద్వారా వారి సొంతరాష్ర్టాలకు పంపించాలని సూచించారు. రైళ్ల ద్వారా చేరుకునే వలస కార్మికులకు పరీక్షలు నిర్వహించాలని అన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. మే చివరి నాటికి రెండుసార్లు, జూన్‌లో ఐదుసార్లు సోడియం హైపోక్లోరైట్ పిచికారి చేయాలని అన్నారు. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇది కరోనా వ్యాప్తి నివారణకు, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు క్రియాశీలంగా వ్యవహరించాలని సూచించారు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి పట్టణాలు, గ్రామాల పారిశుధ్య పనులపై ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేయాలని చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్థికపరిస్థితి బాగా లేకపోయినప్పటికీ గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య, ఇతర అత్యవసర పనులకు నిధుల కొరత లేకుండా చేస్తున్నామన్నారు. గ్రామీణ, పట్టణప్రాంతాలకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలకు నిధులను విడుదల చేశామని, జూన్ నిధుల విడుదలకు కూడా ఆదేశించామని చెప్పారు.
హైదరాబాద్‌లో మరో 45 బస్తీ దవాఖానలు హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలకు మంచి స్పందన వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం 123 బస్తీ దవాఖానలు నడుస్తున్నాయని మరో 45 బస్తీ దవాఖానలను వెంటనే ప్రారంభించాలని మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్‌ను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 20 నుంచి తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, పురపాలకశాఖ కమిషనర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ రఘునందర్‌రావు, సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్, పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్, మహేశ్‌భగవత్ తదితరులు పాల్గొన్నారు.