ప్రజలు ఒకసారి ఆలోచించాలి. 2014 జూన్ 2కు ముందు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో గుర్తు తెచ్చుకోవాలి. నాడు పల్లెటూరులో ఎవరైనా చనిపోతే సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేసి 20 నిమిషాలు కరెంట్ ఇయ్యమని బతిమాలాడాల్సిన పరిస్థితి ఉండేది. ప్రతి ఇంటిలో ఇన్వర్టర్లు ఉండేవి. అప్పుడు అర్ధరాత్రి వచ్చే కరెంట్‌కు మోటర్లు పెట్టేందుకు వెళ్లి కరెంట్ షాక్‌కు గురై వేల మంది రైతన్నలు అసువులు బాశారు. వారి ఉసురు తగిలే కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది.
-మంత్రి కేటీఆర్
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ప్రజలంతా రాష్ట్ర పరిస్థితిని ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్‌ఎస్‌కు మరోసారి పట్టం కట్టాలని కోరారు. గతంలో కరెంట్ లేక, సాగు, తాగునీరు అందక రైతులు, ప్రజలు అరిగోస పడ్డారని గుర్తుచేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, వలిగొండ, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, ఎల్బీనగర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి మద్దతుగా సోమవారం మంత్రి కేటీఆర్ రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ.. 3 గంటల కరెంట్ చాలని, 10 హెచ్‌పీ మోటర్లు వాడితే సరిపోతుందని రేవంత్ మాట్లాడుతున్నారని, ఎవరికైనా 10 హెచ్‌పీ మోటర్లు ఉన్నాయా? అని అక్కడున్న రైతులను ప్రశ్నించారు. 3 గంటల కరెంట్ కావాలా.. 24 గంటల విద్యుత్తు కావాలా ఆలోచన చేయాలని సూచించారు.
11 సార్లు చాన్సిస్తే ఏంచేశారు?
కాంగ్రెస్ పేదల నేస్తం కాదని, వారిపాలిట భస్మాసుర హస్తం అని కేటీఆర్ ధ్వజమెత్తారు. హస్తం దరిద్రానికి నేస్తమని.. కాంగ్రెస్‌కు, రాహుల్‌కు ఎద్దు, ఎవుసం తెలియదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ దరిద్రం తెచ్చుకున్నట్టేనని ప్రజలను హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని, ఆ పార్టీకి 11 సార్లు అవకాశమిస్తే ఏమీ చేయలేదని.. ఇప్పుడిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని.. ఉత్తమ్, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క కోసం బస్సులు ఏర్పాటు చేస్తామని, వలిగొండ, యాదగిరిగుట్టలో కరెంటు వైర్లను ముట్టుకుంటే తెలుస్తుందని, రాష్ర్టానికి పట్టిన దరిద్రం పోతుందని ఘాటుగా విమర్శించారు.
గాడిదకు గడ్డేసి.. ఆవుకు పాలు పిండుతరా?
వచ్చే నెల 3 తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక బ్రహ్మాండమైన పథకాలు అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు 200 పింఛన్ ఇవ్వలేని కాంగ్రెస్, ఇప్పుడు 4 వేలు ఇస్తామని డబ్బా కొడుతున్నారని మండిపడ్డారు. గాడిదకు గడ్డేసి.. ఆవుకు పాలు పిండితే వస్తాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలవి నరం లేని నాలుకలని, రైతుబంధు గురించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
అధికారంలోకి రాగానే రైతుబంధు సాయం ఏటా రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతామని చెప్పారు. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలు, కోడళ్లకు ప్రతినెలా రూ.3 వేల సాయం అందిస్తామని స్పష్టంచేశారు. అవ్వా తాతల ఆసరా పింఛన్ రూ.2016 నుంచి రూ.5 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ బండ రూ.400కు ఇప్పిస్తామని, మిగతా రూ.800 ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. తెల్లరేషన్ కార్డు ఉన్నోళ్లందరికీ సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. భూమిలేనోళ్లకు కూడా రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికలు అనగానే ఆగం కావొద్దని, ఆలోచనతో ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు గంటలకొద్దీ బారులు దీరేవారని, తెలంగాణ వచ్చిన తరువాత ఆ పరిస్థితి పోయిందని స్పష్టంచేశారు. వారి పాలనలో తాగు, సాగు నీరు, కరెంట్ ఇవ్వని కాంగ్రెస్ సన్నాసులు.. ఈ రోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. 55 ఏండ్లు పాలించిన కాంగ్రెసోళ్లకు రైతులకు రైతుబంధు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
ధరణి పోర్టల్ ఎత్తివేస్తానని, పట్వారీ విధానం తెస్తానని భట్టి విక్రమార్క పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మళ్లీ పట్వారీ వ్యవస్థ కావాలా? అని ప్రజలను అడిగారు. వద్దని ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. అన్ని సంక్షేమ పథకాలు యథావిధిగా అందాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థులు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనతో తక్షణమే జాబ్ క్యాలెండర్
కొంత మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది అఘాయిత్యాలతో ఉద్యోగ నియామాలకు ఆటంకం కలిగిందని, టీఎస్‌పీఎస్సీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసి తక్షణమే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఉప్పల్, ఎల్బీనగర్ పరిధిలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. అనంతరం ఉప్పల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో పాల్గొని బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. తొమ్మిదిన్నరేండ్లలో తాగునీరు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలతోపాటు, మూసీ సుందరీకరణ, స్కై వాక్‌లను ఏర్పా టు చేశామని వెల్లడించారు.
హైదరాబాద్ నగర వా సుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యం గా బీఆర్‌ఎస్ కృషి చేస్తున్నదని స్పష్టంచేశారు. ఐటీ కంపెనీలు నగరం నలువైపులా విస్తరించాలంటే బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు మాటలను జనాలు మో సపోవద్దన్నారు. మెరుగైన వసతులు, స్థిరమైన ప్రభుత్వంతోనే హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసుకోగలుగుతున్నామని, ఉచిత మంచి నీరు, అన్నపూర్ణ సెంటర్లు, బస్తీ దవాఖానా లు, మెరుగైన శాంతి భద్రతలు అన్ని కూడా ప్రజల కళ్ల ముందర కనిపించే అభివృద్ధికి సూచికలని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌తో మళ్లీ కల్లోలాలు, కరెంట్ కోతలు వస్తాయని, హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతుందని, ఆ పార్టీకి ఓటేసి మోసపోవదన్నారు. సుధీర్‌రెడ్డి లాంటి మంచి వ్యక్తులు ఎమ్మెల్యేగా ఉండగా, బఫూన్ లాంటి లీడర్లను ఓటేయవద్దని కోరారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, భిక్షమయ్యగౌడ్, రామచంద్రారెడ్డి, అమరేందర్‌రెడ్డి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
చేసింది చెప్పుకోలేని, చేసేది చెప్పుకొనే ధైర్యం లేని కాంగ్రెస్ నాయకులకు ఓటేయడం కంటే జనాల్లో ఉండే బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి. హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేస్తామో తెలియని బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఓటేయడం కంటే తొమ్మిదిన్నరేళ్లలో అన్ని వసతులు కల్పించిన కేసీఆర్‌ను గెలిపించుకోవాలి. గత రెండు ఎన్నికలల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. విద్యావంతులే ఓట్లు వేయడం లేదు. కాలనీలు, అపార్టుమెంట్లలో ఉండే జనాలు ముందుకు వచ్చి ప్రజల పక్షాన నిలిచే బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలి.
-మంత్రి కేటీఆర్