– అవినీతి, అక్రమాలు బయటపెడుతున్నందునే సర్కారుపై విమర్శలు – సీఎం దిష్టిబొమ్మలు తగులబెట్టడంలో అర్థం లేదు: హోంమంత్రి నాయిని – హాస్యాస్పదంగా పొన్నాల మాటలు: విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
కరెంట్ విషయంలో తప్పిదమంతా కాంగ్రెస్, టీడీపీ చేసి, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రుద్దడం దురదృష్టకరం. కేసీఆర్ దిష్టిబొమ్మల దహనం చేయడం సరికాదు. ఈ పరిస్థితులకు కారణమైన సోనియా,మోడీ, చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేయాలి అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. సోమవారం నల్లగొండ లో విలేకరుల సమావేశంలో విద్యాశాఖమంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. చంద్రబాబు కాలంలో కరెంట్ లేక తీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి శరవేగంగా అభివృద్ధిలో ముందుకు పోతుందన్నారు.
దాంతో కాంగ్రెస్ నేతల అవినీతి, అక్రమాలను కూడా బయటపెట్టే పనులు మొదలవడంతో..తట్టుకోలేక ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జానారెడ్డి ఏనాడూ నల్లగొండ జిల్లాలో ప్రధానమైన ఫ్లోరైడ్ సమస్యపై మాట్లాడలేదు.. కనీసం పట్టించుకున్న పాపానపోలేదని ధ్వజమెత్తారు. విద్యుత్ సంక్షోభానికి మీరు కారకులై రైతులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. పోలీసులు కూడా ఈ విషయంలో సంయమనం పాటించాలని ఆదేశించారు. టీఆర్‌ఎస్ ప్రజా ప్రభుత్వమని, సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గతంలో పోలీసుస్టేషన్లకు రావాలంటే ప్రజలు భయపడేవారని, ఆ పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంలో ఉండదన్నారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి 17 సెప్టెంబర్ సందర్భంగా జెండా ఎగురవేస్తామంటున్నారని, ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారని ప్రశ్నించారు.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా రుణ మాఫీచేస్తాం: జగదీశ్‌రెడ్డి విద్యుత్ సమస్య గత పాలకుల పాపమేనని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకే క్యాబినెట్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు చెప్పారు.ఎన్ని ఇబ్బందులు వచ్చినా రుణ మాఫీచేసి తీరుతామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు మూడేండ్లపాటు విద్యుత్ కోతలు తప్పవని చెప్పారని, గత పాలకుల పాపం తమపై పడిందన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ ప్రాజెక్టులను ఆంధ్రలోనే నిర్మించారని, ఈ విషయాన్ని సీఎం దాచి పెట్టకుండా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేత పొన్నాల మాటలు హాస్యాస్పదంగా ఉన్నా యని, ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ర్టాన్ని నాశనం చేయడమేగాక సీఎంని విమర్శించడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఏడు మండలాలు ఆంధ్రాలో కలిసినప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గి మోడీ తప్పు చేస్తే తమను బద్‌నాం చేయడం సరికాదన్నారు. రైతులను ఆదుకునేందుకు కృషిచేస్తున్నామన్నారు. ప్రతిపక్షాల కుయుక్తులను పట్టించుకోవద్దని రైతులకు సూచించారు.