కాంగ్రెసోళ్లు ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తరట. ఈ ధరణిని భూ భారతిని చేస్తమని హైదరాబాద్‌లో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఈ భూభారతిని 30 -40 ఏండ్ల క్రితమే తెచ్చారు. దానితో ఏం కాలె.. మళ్లీ పాత కథలే. అదే పైరవీకారులు, అదే లంచాలు, దందాలు, అదే దళారులు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా ఎట్లా రావాలె? ధాన్యం కొన్న డబ్బులు తారుమారైతయి. వాటిని కాపాడేటోళ్లు కావాల్నా? కిందిమీద చేసేటోళ్లు కావాల్నా?
– సీఎం కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తమని మ్యానిఫెస్టోలో పెట్టిండ్రు.. అదే జరిగితే మళ్లీ పైరవీకారులు, లంచగొండులు, దళారుల దందా మొదలవుతుదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలను హెచ్చరించారు. ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతుబీమా ఎట్లా రావాలే.. ధాన్యం కొన్న డబ్బులు తారుమారైతయి.. వాటిని కాపాడేటోళ్లు కావాల్నా.. కిందమీద చేసేటోళ్లు కావాల్నా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని, లేదంటే పదేండ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని తెలిపారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాలలో శుక్రవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణలో మునుపు సాగునీళ్లు ఎట్లుండె? ఎంత సాగయ్యింది? ఇప్పుడు ఎంత సాగవుతున్నది? ఇవాళ తెలంగాణ 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నది. చిన్నచిన్న ప్రాజెక్టులు కూడా పూర్తయితే 4 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తది. రాబోయే రోజుల్లో మరెంతో మంచి జరుగుతుంది. ఇది ఆలోచించి వచ్చే ఎన్నికల్లో ఓటేయండి. లేదంటే పదేండ్లు బీఆర్‌ఎస్ పడ్డ కష్టం బూడిదిలో పోసిన పన్నీరైతది. మళ్లీ మొదటికొస్తది. పాలిచ్చే బర్రెను అమ్ముకొని దున్నపోతును తెచ్చుకున్నట్టు అయితది’ అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. గోల్‌మాల్ కావొద్దని.. నిజమేదో, అబద్ధమేదో గమనించాలని సూచించారు. అభ్యర్థుల గుణగణాలతోపాటు వారి వెనక ఉన్న పార్టీల గురించి ఆలోచన చేయాలని కోరారు. రైతులు, పేదల గురించి పార్టీల దృక్పథం ఏమిటి? ఆలోచన విధానం ఎలా ఉన్నది? ఎటు తీసుకుపోతుంది? గతంలో అవకాశమిస్తే ఏం చేశారు? రేపు ఏం చేస్తారు? అనేది ఆలోచించాలని, గుడ్డిగా ఓటు వేయవద్దని సూచించారు.
కాంగ్రెస్, బీజేపీలకు ఓటెందుకెయ్యాలి?
కాంగ్రెస్ అంటేనే దోఖాబాజీ పార్టీని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి, 58 ఏండ్లు ఏడిపించిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు, సాగునీళ్లు లేవని, చేనేత కార్మికులు, రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని, ప్రజలు వలసపోవాల్సిన దుస్థితి వచ్చిందని గుర్తుచేశారు. ‘కాంగ్రెస్ హయాంలో దళారులు, పైరవీకారులు, లంచగొండులదే రాజ్యం. ఇప్పుడు వాళ్లు మళ్లా రైతుబంధు వేస్ట్ అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు 24 గంటల కరెంటు వద్దు, 3 గంటలు సరిపోతది అని దుర్మార్గంగా ప్రకటిస్తున్నారు. బీజేపీకి మత పిచ్చి తప్ప మరొకటి ఏదీ రాదు. ఒక పార్టీ తెలంగాణను ముంచింది. మరోపార్టీ నిధుల కోత పెడుతున్నది. మరి ఆ పార్టీలకు ఓటెందుకు వేయాలి? బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒక్క ఓటు కూడా వేయొద్దు’ అని పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్‌తో గుణాత్మక మార్పులు
బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో అద్భుతమైన ప్రగతిని సాధించామని సీఎం కేసీఆర్ తెలిపారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానానికి చేరుకొన్నదని వివరించారు. ఆర్థిక క్రమశిక్షణ వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సామాజిక, ప్రభుత్వ బాధ్యతగా వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితరులకు పెన్షన్లను రూ.200 నుంచి రూ.2000కు పెంచామని, దేశంలో ఇంత పెద్ద మొత్తం పెన్షన్ ఇస్తున్న ఘనత బీఆర్‌ఎస్‌దేనని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పెన్షన్‌ను రూ.5000కు పెంచుతామని ప్రకటించారు. ‘కంటి వెలుగు ద్వారా 80 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశాం. అమ్మఓడి, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి కింద ఆర్థికసాయం చేస్తున్నాం. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్నాం. విప్లవాత్మక రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నాం. నష్టాన్ని కూడా భరించి రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. భూముల భద్రతకు ధరణి పోర్టల్ తీసుకొచ్చాం. రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్ఠం చేస్తున్నాం. పట్టణాలు, నగరాలు, గ్రామాలు అప్పుడు ఎట్లుండె? ఇప్పుడు ఎట్ల ఉన్నయో ఆలోచించాలి. అభివృద్ధిలో అన్ని వర్గాలను కలుపుకుపోతున్నాం. మైనార్టీల అభివృద్ధికి పదేండ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చుచేశాం. కాంగ్రెస్ పాలనలో కర్ఫ్యూలు, పేలుళ్లు, మతకల్లోలాలు తప్ప ఏమీ లేవు. ఇప్పుడు పొరపాటు చేస్తే పదేండ్లుగా బీఆర్‌ఎస్ పడ్డ కష్టం మొత్తం బూడిదిలో పోసిన పన్నీరైతది. మళ్లీ మొదటికొస్తది’ అని హెచ్చరించారు.
24 గంటల పాటు నల్లా నీళ్లు
‘ఆడబిడ్డ బిందె పట్టుకుని బజార్ల కనపడితే ఆ ప్రాంత ఎమ్మెల్యే రాజీనామా చేయాలని కఠిన నిబంధనలు పెట్టుకున్నం. మిషన్ భగీరథను పూర్తిచేసినం. నీళ్ల తిప్పలు, పీడలు బంద్ అయినవి. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లను ఇస్తున్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే పొద్దున సాయంత్రం కాకుండా 24 గంటలపాటు నల్లా నీళ్లు వచ్చేటట్టు ప్రయత్నాలు చేస్తున్నం. ఆ దిశగా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ విధానం పలు చోట్ల విజయవంతమైంది. గతంలో ఏ ప్రభుత్వమైనా ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చిందా? ఇప్పుడు పబ్లిక్ నల్లాలు ఉన్నాయా? బిందెలు పట్టుకుని ఎవరైనా బయటకు వస్తున్నారా? ఇది అభివృద్ధి కాదా?’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎవరెన్ని మొత్తుకున్నా మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. ప్రజలతో మనం, మనతో ప్రజలు ఉన్నారని, ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పురోగమిద్దామని తెలిపారు. రైతుబంధును రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతామని, రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి మొత్తంగా ఇప్పటికే 1019 గురుకులాలు ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకులాలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.
అద్భుత విజయాలు అందించిన గడ్డ కరీంనగర్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2001 మే 17 కరీంనగర్ ఎస్సారార్ కాలేజీ మైదానం వేదికగానే మొట్టమొదటి సింహగర్జన సభ నిర్వహించుకున్నామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. దళితబంధు, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక కార్యక్రమాలను కరీంనగర్ వేదికగా ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు, వ్యక్తిగతంగా ఉద్యమనాయకుడిగా తనకు అనేక విజయాలను అందించిన కరీంనగర్ గడ్డకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని ప్రకటించారు. కేసీఆర్ శవయాత్రనో, తెలంగాణ జైత్రయాత్రనో అని పిలుపునిచ్చి ఆమరణ దీక్షకు శ్రీకారం చుట్టింది కూడా కరీంనగర్ నుంచేనని, అలా అనేక ఉద్యమ ఘట్టాల్లో ప్రథమ స్థానంలో ఉండేది కరీంనగర్ గడ్డ అని సీఎం కేసీఆర్ కొనియాడారు.
దివ్యధామంగా కొండగట్టు..
చొప్పదండి నియోజకవర్గంలో కొలువైన కొండగట్టు అంజన్న ఆలయాన్ని దివ్యదామంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాంటారు, కొండలతో కూడుకున్నది కావడంతోప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. అవసరమైతే రూ.వెయ్యికోట్లు ఖర్చుచేసి బ్రహ్మండంగా అభివృద్ధిచేస్తామని హామీ ఇచ్చారు. కొండగట్టు అంజన్న చల్లటి దీవెనలు అందరి మీద ఉండాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. ‘కాంగ్రెసోళ్లు ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తరట. ధరణిని భూమాత చేస్తమని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. భూ భారతి అని 30 -40 ఏండ్ల క్రితమే తెచ్చారు. దానితో ఏం కా లె. మళ్లీ పాత కథలే. అదే పైరవీకారులు, అదే లంచాలు, దందాలు, అదే దళారులు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా ఎట్ల రావాలె? ధాన్యం కొన్న డబ్బులు తారుమారైతయ్. వాటిని కాపాడేటోళ్లు కావాల్నా? కిందిమీద చేసేటోళ్లు కావాల్నా?’ అని ప్రశ్నించారు.
పరకాల అభివృద్ధి బాధ్యత నాది
పరకాలలో గతంలో అనేక ఇబ్బందులుండేవని, అందుకే ప్రజలను ఆదుకోవాలని సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్ ఇకడకు రావడం చాలా సంతోషం. వస్త్ర పరిశ్రమ కొలువుదీరడం హర్షణీయం. ఈ పరిశ్రమ రాకతో మా పిల్లలకు ఉద్యోగాలొస్తున్నాయని చెబుతుండ్రు. పరకాలకు అడిషనల్ కోర్టు అవసరమున్నదని ఎమ్మెల్యే ధర్మారెడ్డి కోరారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో మాట్లాడి కోర్టును మంజూరు చేయిస్తా. ధర్మారెడ్డి మంచి మనిషి. ఎప్పుడొచ్చినా నియోజకవర్గం పనే అడిగారు. అలాంటి మంచి అభ్యర్థిని గెలిపించాలి. పరకాల అభివృద్ధికి ఏం కావాలంటే అది చేసిపెట్టే బాధ్యత నాది’ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ధర్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సుంకె రవిశంకర్‌ను దీవించండి
రాష్ట్రంలో ఇప్పటికే 57 సభల్లో పాల్గొన్నానని, వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడికిపోయినా జనం అంచనాలకు మించి వచ్చి జయజయధ్వానాల పలుకుతున్నారని, భుజం తట్టి ముందుకెళ్లమని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఇదే తరహాలో చొప్పదండి ప్రజల దీవెన ఉండాలని కోరారు. ప్రజలంతా బీఆర్‌ఎస్ పార్టీకే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. ‘ఒకనాడు చొప్పదండి నియోజకవర్గంలో సాగునీళ్లకు కరువుండె. రైతులు బోర్లువేసి నీళ్లు పడక ఆత్మహత్యలు చేసుకునేటోళ్లు. ఇదే నియోజకవర్గంలో రామచంద్రాపురం సర్పంచ్ తిరుపతి బోర్లు వేసివేసి నీళ్లు పడక.. చివరికి బోరు దగ్గరే ప్రాణం ఇడిసిండు. ఇప్పుడా పరిస్థితి లేదు. బ్రహ్మండంగా పంటలు పండుతున్నయ్. ఇదంతా ప్రజల ముందే ఉన్నది’ అని గుర్తుచేశారు. చొప్పదండిలో నేడు 1.25 లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయని తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ కొట్లాడి 100 పడకల దవాఖాన తీసుకొచ్చారని, మంచి వైద్యం అందుబాటులోకి వస్తుందని, వాటిని ఆలోచించి ఓటువేయాలని కోరారు. ఎమ్మెల్యే రవిశంకర్ విజ్ఞప్తి మేరకు గోపాల్‌రావుపేట, గర్షకుర్తి మండలాలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీనిచ్చారు.
అభివృద్ధిలో అన్ని వర్గాలను కలుపుకుపోతున్నాం. మైనార్టీల అభివృద్ధికి పదేండ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చుచేశాం. కాంగ్రెస్ పాలనలో కర్ఫ్యూలు, పేలుళ్లు, మతకల్లోలాలు తప్ప ఏమీ లేవు. ఇప్పుడు పొరపాటు చేస్తే పదేండ్లుగా బీఆర్‌ఎస్ పడ్డ కష్టం బూడిదిలో పోసిన పన్నీరైతది. మళ్లీ మొదటికొస్తది
– సీఎం కేసీఆర్
గంగుల కమలాకర్ మొండిమనిషి
కరీంనగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ చాలా మొండిమనిషి అని, పట్టుబడితే విడవబోరని సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. కరీంనగర్‌లో నేడు మొత్తం సీసీ రోడ్లే ఉన్నాయని, నగరం అని పిలిచే స్థాయికి కరీంనగర్ పట్టణాన్ని సుందరీకరించారని అభినందించారు. గత ప్రభుత్వాలు ఇంత అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజల పట్ల అభిమానం ఉండి పనిచేసే కమలాకర్ లాంటి నేతలు ఉంటేనే ఇలాంటి అభివృద్ధి సాధ్యమైతదని తెలిపారు. 410 కోట్లతో చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనులు పూర్తయితే కరీంనగర్ బ్రహ్మండమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తీగల వంతెనపై కొంచెం డాంబర్ కరిగితే రాద్ధాంతం చేస్తూ కూలగొట్టాలని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తారమైన అడవి ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అడవినంతా అమ్మేసి కరగ నాకితే.. నేడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం హరితహారం ద్వారా మొక్కలు నాటుతూ అటవీ విస్తీర్ణాన్ని పెంచుతున్నదని తెలిపారు.
బండి, ఈటలపై కేసీఆర్ ధ్వజం
కరీంనగర్, హుజూరాబాద్ ప్రజా ఆశీర్వాదసభల్లో ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘వినోద్ ఎంపీగా ఉన్నప్పుడు పట్టుబట్టి, కేంద్రం వెంటపడి కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా పెట్టించారు. ఇప్పుడు స్మార్ట్ లేదు నా బోట్ లేదు. ప్రజలు లేరు. ఏం లేదు. వట్టిదే బొబ్బ. మసీదులు తవ్వుదామా? గుళ్లు తవ్వుదామా? అంటుండ్రు. ఇదా సిపాయితనం? సంస్కారవంతులు చేసే పని ఇదేనా? ఇదా దేశానికి కావాల్సింది? లంగ తాకులాటలు, పంచాయితీలు కావాల్నా? ప్రగతిశీల పద్ధతిలో ర్సత్రాన్ని రాష్ట్రాన్ని తీసుకుపోతున్నది ఎవరో? రాష్ట్ర విచ్చిత్తి కోసం పాకులాడుతున్నదెవరో ఆలోచించాలి. ఈసారి బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. లేదంటే మేం ఇవ్వకున్నా పిచ్చోళ్లు మాకే ఓటు వేస్తరు అని వాళ్లు అనుకుంటరు’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
హుజూరాబాద్‌కు ఏం తక్కువ చేసిన?
హుజూరాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి ఉత్సాహవంతుడని, ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశమివ్వాలని సీఎం కోరారు. ‘హుజూరాబాద్ నియోజకవర్గంలోని మేధావులు, ఉద్యోగులు ఆలోచించాలి. బీజేపీ గెలిస్తే ఏమొస్తది? మొన్న ఏమొచ్చింది? రెండేండ్లు అయ్యింది.. ఏకాణ పని జరగలేదు. అయినా ఇక్కడున్న బీజేపీ నాయకులు పెద్దగ నీల్గుతరు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వకున్నా వీళ్లు గెలిచి పొడిచేందేంది? బీజేపీకి ఓట్లేస్తే మోరీల ఏసినట్టే. హుజూరాబాద్‌కు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు? కాలువ నిండ నీళ్లు వస్తలేవా? మీ దగ్గర ధాన్యం కొంటలేరా? మీకు రైతుబంధు వస్తలేదా? మీదగ్గర అన్నిండ్లకు దళితబంధు రాలేదా? ఇన్ని చేసిన కేసీఆర్‌ను కాదని ఎవరినో ఎత్తుకుంటే వచ్చేది ఏముంటది?, మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే. హుజురాబాద్ ప్రజలు ఆలోచించి ఓటేయాలి. బీఆర్‌ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డికి ఒకసారి అవకాశమివ్వండి. కౌశిక్‌రెడ్డి నా కొడుకులాంటివాడు. కౌశిక్‌రెడ్డిని గెలిపిస్తే హుజూరాబాద్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అన్నివిధాలుగా అండగా ఉంటా’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.