-మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ది చారిత్రాత్మక విజయం -పదవి కోసమే ఇష్టారీతిన లక్ష్మణ్ మాటలు: విప్ బాల్క సుమన్ -రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి

మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్, బీజేపీలకు కండ్లు బైర్లు కమ్మి మైండ్ బ్లాక్ అయిందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో రానివిధంగా మున్సిపాలిటీల్లో చారిత్రాత్మక విజయాన్ని ప్రజలు టీఆర్‌ఎస్‌కు అందించారని అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే అద్భుతమైన మెజార్టీని అందించారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నమ్మకంతో అఖండమైన విశ్వాసంతో గెలిపించారని చెప్పారు. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో 122 టీఆర్‌ఎస్‌కు అందించారని తెలిపారు.
ఈ తీర్పుతో విపక్షాల కండ్లు బైర్లు కమ్మి, మైండ్ బ్లాక్ అయి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేరేడుచర్లలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు చెరో ఏడు స్థానాలు కైవసం చేసుకున్నాయని, ఎక్స్‌అఫీషియో ఓటు ద్వారా ఆ మున్సిపాలిటీని టీఆర్‌ఎస్ గెలుచుకున్నదని పేర్కొన్నారు. రాజ్యసభసభ్యులైన సీఎం రమేశ్- దేవేందర్‌గౌడ్, కేవీపీ రాంచందర్‌రావు- కే కేశవరావు పరస్పరం రాష్ట్రాలు మార్చుకున్నారని, దీనిని రాజ్యసభ చైర్మన్ అంగీకరించి 2014 డిసెంబర్‌లో బులెటిన్ ఇచ్చారని గుర్తుచేశారు. దీంతో కేవీపీ ఏపీ సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల సంఘంపై ఉత్తమ్ వత్తిడి తెచ్చి కేవీపీని ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు చేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2019 మున్సిపల్ చట్టాన్ని కాంగ్రెస్ నాయకులు చదువుకొని మాట్లాడాలని హితవుపలికారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఆంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగే అలవాటు ఇంకా పోలేదని చురకలంటించారు. కుట్రదారు కేవీపీని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా చేసుకోవాలని ఎద్దేవాచేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కుమ్మైక్కె మక్తల్, మణికొండ సహా పలు మున్సిపాలిటీలను గెలుచుకున్నారని తప్పుబట్టారు.
కాంగ్రెస్‌వి గావుకేకలు: బాల్క సుమన్ ఉత్తమ్ వీధి నాటకాలను, అన్ని వ్యవస్థలను తప్పుపడుతున్న ఆయన తీరును ప్రజలు గమనిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఆత్మవిమర్శలు చేసుకోవాల్సింది పోయి గావుకేకలు పెడుతున్నారని మండిపడ్డారు. తమవి ఉద్యమ గొంతుకలని, ఉత్తమ్ కంటే ఎక్కువగా తాము కూడా అరవగలమని హెచ్చరించారు. బీజేపీ లక్ష్మణ్ పదవి కోసమే ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. లోక్‌సభ ఎన్నికల్లో గాలివాటంతో బీజేపీ నాలుగుచోట్ల గెలిచిందని పేర్కొన్నారు.