– నూతన పారిశ్రామిక విధానం ఆ తరహాలో ఉంటుంది – రాష్ట్రంలో హాస్పిటల్స్ స్థాపనకు సంపూర్ణ సహకారం – అపోలో హాస్పిటల్స్ 26వ వార్షికోత్సవంలో సీఎం కేసీఆర్
రాష్ట్రంలో చేపట్టబోయే నూతన పారిశ్రామిక విధానం ప్రపంచంలోని ఏ సంస్థ అయినా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పరుగెత్తుకు వచ్చేలా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పాలన అందించడం ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. సుపరిపాలన ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు క్యూకడతాయన్నారు. అపోలో ఆస్పత్రుల 26వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మారుమూల గ్రామాలకు అత్యుత్తమ వైద్య సేవలను అందించేందుకు వీలుగా అపోలో యాజమాన్యం నూతనంగా రూపొందించిన ఈ యాక్సెస్‌ను విధానాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా పేరొందిన అపోలో ఆస్పత్రి హైదరాబాద్‌లో ఉండటం గర్వకారణమన్నారు. నేనేం పొగడ్త కోసం ఈ మాట చెప్పడంలేదు. ఓసారి ఢిల్లీ వెళ్లినప్పుడు ఓ మిత్రుడు మాటల సందర్భంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి ఆరా తీసిండు. తెలంగాణ వస్తే క్యాపిటల్ ఏమైతది అని అడిగిండు. తెలంగాణ స్టేట్‌కు హైదరాబాదే క్యాపిటల్ అయితదని చెప్పిన. అయితే ఆయన హైదరాబాద్ చాలా బాగుంటుందని అన్నడు. తాను వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో దవాఖానాలో నెల రోజులు ఉన్ననని చెప్పిండు. ఢిల్లీలో గిన్ని దవాఖాలు ఉంటే, ఆడికే ఎందుకు వచ్చినవ్? అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏందో తెలుసా? హైదరాబాద్‌లోని అపోలో దవాఖానా ది బెస్టు అని చెప్పిండు అని సీఎం కేసీఆర్ చెప్పటంతో కిక్కిరిసిన ఆడిటోరియం చప్పట్లతో మారుమోగింది. ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా చెన్నై, బెంగళూరుకంటే హైదరాబాద్ పెద్ద నగరంగా అవతరించిందని సీఎం తెలిపారు.
హైదరాబాద్‌లో రెండు అపోలో దవాఖానా ఉన్నాయని యాజమాన్యం చెప్పిందని, అయితే తెలంగాణలోని ప్రతి జిల్లాలో అపోలో దవాఖానాలు ఏర్పాటు చేయాలని తాను ఆ యాజమాన్యాన్ని కోరుతున్నానన్నారు. హైదరాబాద్ హెల్త్ టూరిజం సెంటర్‌గా మారటంలో అపోలో పాత్ర కూడా ఉందన్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో ఎక్కడైనా దవాఖానాలు ఏర్పాటు చేయదలిస్తే, అందుకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఇటీవలే అపోలోలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారిని చూడటానికి వెళ్లినప్పుడు, అక్కడ విదేశీ వైద్యులు కూడా కనిపించారు. వాళ్లెందుకు ఉన్నరు? అని అడిగితే 150 దేశాల నుంచి పేషెంట్స్ వచ్చి అక్కడ చికిత్స చేయించుకుంటారని, వారి కోసం వచ్చారని తెలిపారు. అపోలో హాస్పిటల్స్ గ్రూపు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి పుట్టినిల్లు వేరే అయినా, మెట్టినిల్లు తెలంగాణ. ఇప్పుడు ఆమె తెలంగాణ బిడ్డ అన్నారు.
ఏజెన్సీలో ఉదయం ఈగలు.. సాయంత్రం దోమలతో సంసారం: రాజయ్య ఏజెన్సీ ఏరియాలో ప్రజలకు ఆరోగ్యంపై కనీస అవగాహన ఉండటంలేదని, ఉదయం ఈగలతో.. సాయంత్రం దోమలతో సంసారం చేస్తున్నారని డిఫ్యూటీ సీఎం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఏజెన్సీల్లో మలేరియాకు సరైన వైద్యం అందటంలేదని, ఈ నేపథ్యంలో సీఎం మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమంతో ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కడియం శ్రీహరి, విశ్వేశ్వరరెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూపు చైర్మన్ సీ ప్రతాప్‌రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, సీఈవో హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.