-ఉద్యమాలను అణచిన ఆర్‌ఎస్ ప్రవీణ్..
-ఇప్పుడు మరో ఉద్యమాన్ని నడిపిస్తావా?
-బీజేపీ రాజకీయ ఆటలో పావు మాజీ ఐపీఎస్
-టీఆర్‌ఎస్ ఎజెండానే తెలంగాణ స్వీయ అస్తిత్వం
-కులం పునాదులపై ఏర్పడే పార్టీలు మనలేవు
-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి, భాస్కర్‌రావు

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తిలేక బీజేపీ ప్రవీణ్‌ను పావుగా వాడుకొంటున్నది..తన ఎజెండా ఏమిటో ప్రజలకు స్పష్టం చేయకుండా కేవలం టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను విమర్శించటమే ఎజెండాగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాధికారం అంటే ఏమిటో మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు తెలుసా? ప్రగతిభవన్‌కు ఏనుగుమీదెక్కి పోతామని పేర్కొనటం హాస్యాస్పదం
– ఎమ్మెల్యే గాదరి కిశోర్
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రజల స్వీయ అస్తిత్వం పటిష్టంగా ఉంటుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ స్పష్టంచేశారు. ఆదివారం నల్లగొండ సభలో సీఎం కేసీఆర్‌పై బీఎస్పీకి చెందిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కమ్యూనిస్టు ఉద్యమాలను, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రలు చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇప్పుడు మరో ఉద్యమానికి నాయకత్వం వహిస్తామంటే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరని అన్నారు. రాజ్యాధికారం అంటే ఏమిటో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు తెలు సా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను తిట్టడమే ఆయన ఎజెండాగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్‌రావుతో కలిసి గాదరి కిశోర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తిలేక ప్రవీణ్‌ను బీజేపీ పావుగా వాడుకొంటున్నదని గాదరి కిశోర్ విమర్శించారు. తన ఎజెండా ఏమిటో ప్రజలకు స్పష్టం చేయకుండా కేవలం టీఆర్‌ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను విమర్శించటమే ఎజెండాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రగతిభవన్‌కు ఏనుగుమీదెక్కి పోతామని పేర్కొనటం హాస్యాస్పదంగా ఉన్నదని, నల్లగొండ సభకు ఏనుగుమీదే వెళ్లాడా? అని ప్రశ్నించారు. బీఎస్సీ సిద్ధాంతం ఏమిటో కూడా ఆయనకు తెలియదని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనపై కఠిన చర్యలకు సిద్ధపడిందన్న విషయం తెలుసుకొని ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారని ఆరోపించారు. బీజేపీ బెదిరింపులకు భయపడే మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఎద్దేవాచేశారు. గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ఉండాల్సిన స్థానంలో ఐపీఎస్ అయిన ప్రవీణ్‌కమార్‌కు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, ప్రభుత్వ అధికారిగా చేసిన సేవలకు తన వల్లే అంతా జరిగిందని ఆయన ఊహించుకోవటం తెలివితక్కువతనమని ఎద్దేవాచేశారు. ప్రగతిభవన్‌కు సుస్థిరంగా దర్జాగా వెళ్లేది కారు మాత్రమేనని, ఏనుగు ఎప్పటికీ వెళ్లలేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో దళితులు బాగుపడటం ప్రవీణ్‌కుమార్‌కు ఇష్టంలేకనే దళితబంధును వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ప్రవీణ్ భాష మార్చుకోకపోతే తాము కూడా తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఈ పథకాలు లేవెందుకు?
-ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
దళితబంధు పథకంతో భయపడుతున్న ప్రతిపక్ష పార్టీల నేతలు ఇష్టారీతిగా మాట్లాతున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రమంతా ఒకటే కులం, ఒకటే మతమని నమ్మి అణగారిన వర్గాల ప్రజలను అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లాలనే ఏకైక ఏజెండాతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సీఎం కేసీఆర్‌ను విమర్శించటం మాని తానేం చేస్తారో చెప్పాలని డిమాండ్‌చేశారు.
కులం పునాదులపై పార్టీలకు మనుగడ ఉండదు
-ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
మన దేశంలో కులం పునాదులమీద ఏర్పడే పార్టీలకు, వర్గాల ఆధిపత్యం కోసం పుట్టే పార్టీలకు మనుగడ ఉండదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బీజేపీ ఆడిస్తున్న నాటకంలో ఆర్‌ఎస్ ప్రవీణ్ పావుగా మారాడని ఆరోపించారు. దళితబంధుతో ఆ వర్గాలకు జరిగే ప్రయోజనాలను అడ్డుకోవటానికే ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు.
దళితబహుజనుల కోసం కార్యాచరణ ఏంటి?
-ఎమ్మెల్యే భాస్కర్‌రావు
దళితబహుజనుల కోసం తన కార్యాచరణ ప్రణాళిక ఏమిటో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు డిమాండ్‌చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజకీయాల్లోకి రాకూడదని తమ ఉద్దేశం కాదని, జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణకు ప్రజల్లో వచ్చిన ఆదరణ ఎంత? రేపు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు ఏ మేరకు వస్తుందో అంచనా వేస్తే తెలిసిపోతుందన్నారు.