– ఆత్మీయస్వాగతం పలికిన డిఫ్యూటీ సీఎం
– విందులో గంటసేపు గడిపిన ముఖ్యమంత్రి
– హాజరైన మంత్రులు, సీఎస్, డీజీపీ
పవిత్ర రంజాన్ మాసం చివరిరోజు ఈదుల్ ఫిత్ పండుగ సందర్భంగా డిఫ్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం మహమూద్ అలీ ఇంటికి వచ్చిన కేసీఆర్‌కు డిఫ్యూటీ సీఎం ఎదురేగి పూలబొకేతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ కుటుంబ సభ్యులకు, ముస్లిం మతపెద్దలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. డిఫ్యూటీ సీఎం ఇంట్లో కేసీఆర్ గంటకు పైగా గడిపారు. రంజాన్ మాసంలో మహమూద్ అలీ ఇంట్లో ఇఫ్తార్ విందుకు కేసీఆర్ గత కొన్నేండ్లుగా హాజరవుతూ వస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా ఆయన అదే ఆనవాయితీని కొనసాగించారు. నిజామాబాద్ ఎంపీ కవిత తన భర్త, కుమారుడితో సహా విందుకు విచ్చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, జనవనరుల సంఘం మాజీ సభ్యుడు, రిటైర్డ్ ఇంజినీర్ విద్యాసాగర్‌రావు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, వివిధ ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యదర్శులు తదితరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

త్యాగానికి ప్రతీక రంజాన్: మహమూద్ అలీ రంజాన్ పండుగ త్యాగానికి ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఇస్లాం ప్రకారం ముస్లింలు తమ ఆస్తిలో పేదవారికి 2.5శాతం దానం చేయాలని తెలిపారు. హిందూ, ముస్లింలంతా ఐక్యతతో పండుగలు జరుపుకోవడం తెలంగాణలోనే సాధ్యమని అన్నారు. తెలంగాణ మహాత్మ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షిస్తూ నగరంలోని దాదాపు అన్ని మసీదుల్లో రంజాన్ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారని చెప్పారు.
నగరంలో ఘనంగా రంజాన్ వేడుకలు హైదరాబాద్‌లో ఈదుల్ ఫిత్ పండుగను ముస్లింలు మంగళవారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. నగరంలోని అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. పాతబస్తీలోని మీర్ ఆలం ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్ధనల్లో దాదాపు 40వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. చారిత్రక మక్కా మసీదులో మంగళవారం ఉదయం తొమ్మిదిన్నరకు ఈదుల్ ఫిత్ ప్రార్థనలు నిర్వహించారు.