– మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష – బడ్జెట్ అంచనా రూ.85 వేల కోట్లు! – సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసే అవకాశం
రాష్ట్రంలో తొలి బడ్జెట్ రూపకల్పన తుదిదశకు వచ్చింది. ఇప్పటికే అధికారులు, ఆర్థికమంత్రి సమక్షంలో వివిధ స్థాయిలో జరిగిన చర్చలు, సమీక్షలతో ముసాయిదా తయారు కాగా, మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో మరోసారి కసరత్తు జరిగింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్ద పీటవేస్తూ ప్రజల అవసరాలను తీర్చే విధంగా బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. నీటి పారుదల ప్రాజెక్టులకు, సంక్షేమ కార్యక్రమాలకు అధిక మొత్తాలను కేటాయించనున్నారు.
మొత్తంగా బడ్జెట్ రూ. 85 వేల కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రులు, అధికారులతో మంగళవారం సమావేశమై బడ్జెట్‌పై చర్చించారు. సెప్టెంబర్ 10 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో బడ్జెట్ రూపకల్పనపై దృష్టిసారించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రభుత్వ వ్యయాలను పరిశీలించుకొని ప్రణాళికా, ప్రణాళికేతర వ్యయాలను ఖరారు చేయనున్నారు. తొలి క్యాబినెట్‌లో తీసుకున్న 43 నిర్ణయాలను అమలుచేసే దిశగా ప్రభుత్వ బడ్జెట్ ఉండబోతున్నది. విద్యుత్ కొనుగోలుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వ్యవసాయ, నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దళితులకు మూడు ఎకరాల భూపంపిణీ, ఫీజుల కోసం ఫాస్ట్ పథకం అమలు, దళిత, గిరిజన, మైనార్టీ యువతుల వివాహాల కోసం ఆర్థిక సహాయానికి నిధుల కేటాయించనున్నారు. నీటి పారుదలశాఖకు సుమారు రూ. 6500 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖకు సుమారు రూ.4500 కోట్లు, ఎక్సైజ్‌శాఖకు రూ.100 కోట్లు, సమాచార పౌరసంబంధాలశాఖకు సుమారు రూ.120 కోట్లు కేటాయించే అవకాశం ఉంది.
మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా గ్రామాలు, మండలాలు, జిల్లా వారీగా చేసిన సర్వే ఆధారంగా వచ్చిన సమాచారంతో ఏయే శాఖకు ఎంత కేటాయించాలనే దానిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత అరవై ఏండ్లుగా జరగని సమగ్ర భూ సర్వేకోసం కూడా ప్రభుత్వం నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, రాజయ్య, మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, సలహాదారులు, ఆర్థికశాఖకు చెందిన ఇతర కార్యదర్శులు పాల్గొన్నారు.