Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగాంశాలు

భారత స్వాతంత్ర్య దినోత్సవం 15వ ఆగస్టు 2014-08-14 గోల్కొండ కోట హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం

ముఖ్యమంత్రి గారి ప్రసంగాంశాలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

భారతదేశానికి స్వాతంత్ర్యం సముపార్జించడం కోసం ఉద్యమించిన ఎందరో త్యాగధనులను భారత జాతీయోద్యమ చరిత్రను భారతీయులందరూ ఘనంగా స్మరించుకోవాల్సిన సందర్భం ఇది. అహింసా మార్గంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మాగాంధిని ప్రస్తుతిస్తూ బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి విలియం హగ్, బ్రిటన్ పార్లమెంటు స్వ్కేర్ లో మహాత్ముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఏ బ్రిటిష్ పరిపాలకుల వలస పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ పోరాడినారో ఆ బ్రిటిష్ పరిపాలకులే గాంధీజిని గౌరవిస్తూ తమ పార్లమెంటు స్వ్కేర్ వద్ద విగ్రహం ప్రతిష్టించడం భారత జాతికి గర్వకారణం.

మహాత్ముడి అడుగుజాడలో శాంతియుత పంథాలో, అహింసామార్గంలో తెలంగాణ ప్రజలు ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. సాధించుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ జాతి చరిత్రను సమున్నతంగా చాటిచెప్పే గోల్కొండ కోట వేదికగా తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుతున్నందుకు యావత్ తెలంగాణ ప్రజలు నేడెంతగానో ఆనంద పడుతున్నారు.

దక్షిణాపథంలో సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్నది ఈ గోల్కొండ కోట. ఫతే దర్వాజ దగ్గర చప్పట్లు కొడితే బాలా హిస్సార్ దర్వాజ దగ్గర ప్రతిధ్వనించే ధ్వని శాస్త్ర విజ్జానానికి, వాస్తుకళా కౌశలానికి నిదర్శనంగా నిలిచింది ఈ గోల్కొండ కోట.

తానీషా ప్రభువుకు శ్రీరామ లక్ష్మణులు సాక్షాత్కరించింది ఈ గోల్కొండ కోటలోనే. భక్త రామదాసు నోట వెలువడిన సుప్రసిద్ధ కీర్తనలెన్నో ప్రతిధ్వనించింది ఈ కోటలోనే. భద్రాద్రి రామయ్యకు ప్రతీ ఏటా ముత్యాల తలంబ్రాలు స్వయంగా మోసుకెళ్లే సత్సాంప్రదాయాన్ని ప్రారంభించింది ఈ గోల్కొండ పరిపాలకులే. అక్కన్న మాదన్నలు తమ పరిపానల చాతుర్యాన్ని ప్రదర్శించింది ఈ గోల్కొండ కోటలోనే. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి అచ్చతెలుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ రచించిన పొన్నెగంటి తెలగనార్యుడు ఈ గోల్కొండ ఆస్థానకవే.

తెలుగులో మొట్టమొదటి యక్షగానం ‘సుగ్రీవ విజయం’ కందుకూరి రుద్రకవి కలం నుంచి జాలువారింది ఈ గోల్కొండ కోటలోనే.

అద్దంకి గంగాధర కవి తాను రచించిన తపతీ సంవరణోపాఖ్యానం అనే ప్రబంధాన్ని మాలిక్ ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితమిచ్చింది ఈ కోటలోనే. కవి పండితులెందరో మాలిక్ ఇబ్రహీం కుతుబ్ షాకు మల్కిభరాముడిగా బిరుదిచ్చి ప్రస్తుతించింది ఈ గోల్కొండ కోటలోనే.

ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూరు, దరియా ఉఎ- నూర్, దహోప్ తదితర వజ్రాలకు ఆలవాలంగా విలసిల్లింది మన గోల్కొండ కోట. చరిత్రలో ఆనాడే అతర్జాతీయ ఖ్యాతిని పొందింది. రోమ్, ఇంగ్లాండ్ టర్కీ దేశాల నుంచి వచ్చిన వర్తకులు ఇక్కడ వజ్రాల వ్యాపారం కొనసాగించినందు వల్లనే కార్వాన్ ఏర్పడింది.

నేడు మనందరం సంతోషంగా, సగర్వంగా నివసిస్తున్న మన రాజధాని మహానగరం హైదరాబాద్ నిర్మాణానికి పునాదిరాయి వేయాలనే ఆలోచన ఈ గోల్కొండ కోటలోనే పురుడుపోసుకున్నది.

12 శతాబ్దం నుంచి నేటి వరకు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ర్టంలో ప్రజలందరూ సంతోషంగా సంబురంగా జరుపుకునే బోనాల పండుగ ఈ గోల్కొండ కోట నుంచే ప్రారంభమవుతుంది.

తెలంగాణ చరిత్రకు హైదరాబాద్ నగరం మకుటాయమానమయితే, తెలంగాణ పరిపాలనా అస్తిత్వం వారసత్వ వైభవం ఎగరేసిన జెండా గోల్కొండ కోట.

తెలంగాణ జాతి చరితకు నాటి నుంచి నేటిదాకా చెరగని ఆనవాలుగా తెలంగాణ జాతి ప్రశస్తిని ప్రపంచానికి సమున్నతంగా చాటుతున్నది ఈ గోల్కొండ కోటనే. అందుకనే గోల్కొండ కోట మీద స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే సముచిత నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది.

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకానికి గోల్కొండ వేదికగా శ్రీకారం చుడుతున్నాం. ఈ పథకాన్ని జిల్లాల్లో ఇవాళ మంత్రులు కూడా ప్రారంభిస్తున్నారు.

నిరుపేద, మధ్య తరగతి నిరుద్యోగ యువకులు పొట్ట నింపుకోవడం కోసం ఆటోలు నడుపుతూ జీవిస్తున్నారు. వారు రోజు సంపాదించే సంపాదన వారి కడుపుకు కూడా సరిపోదు. అలాంటిది మళ్లీ పన్నులు చెల్లించాలంటే మోయలేని భారమవుతోంది. ఆటో రిక్షాలపై విధిస్తున్న రవాణా పన్నును రద్దు చేశారు. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లపై కూడా రవాణా పన్ను మినహాయించారు. గతంలో ఉన్న 76 కోట్ల రూపాయల బకాయిలను కూడా రద్దు చేశాము.

నిరుపేద, మధ్య తరగతి నిరుద్యోగ యువకులు పొట్ట నింపుకోవడం కోసం ఆటోలు నడుపుతూ జీవిస్తున్నారు. వారు రోజు సంపాదించే సంపాదన వారి కడుపుకు కూడా సరిపోదు. అలాంటిది మళ్లీ పన్నులు చెల్లించాలంటే మోయలేని భారమవుతోంది. దీన్ని గమనించిన ప్రభుత్వం ఆటో రిక్షాలపై విధిస్తున్న రవాణా పన్నును రద్దు చేసింది. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లపై కూడా రవాణా పన్ను మినహాయించాం. గతంలో ఉన్న 76 కోట్ల రూపాయల బకాయిలను కూడా రద్దు చేశాము.

నిజమాబాద్ జిల్లాలోని లక్షలాది మంది ఎర్రజొన్న రైతులు వారికి రావాల్సిన బకాయిల కోసం ఆందోళన చేస్తున్నారు. గత ఐదారు సంవత్సరాలుగా ప్రభుత్వాలు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి అమలులో నిర్లక్ష్యం వహించాయి. రైతుల ఆందోళన మీద ఫైరింగ్ జరపడంతో రైతులు గాయాల పాలయిన పరిస్థితి. రైతులు కళ్లు కాయలు కాచే విధంగా ఎదురు చూసినా ఏ ప్రభుత్వమూ బకాయిలు చెల్లించలేదు. కానీ మా ప్రభుత్వం ఎర్రజొన్న రైతుల బకాయిల చెల్లింపుల కోసం పదకొండు కోట్లు మంజూరు చేసింది. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో చెక్కుల పంపిణీ ప్రారంభించబడుతున్నది.

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసింది. వడగండ్లు, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని గత ప్రభుత్వాలను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు. తెలంగాణ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో వడగండ్లు, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కూడా అందివ్వాలని నిర్ణయించుకుంది మా ప్రభుత్వం. ఇందుకోసం ఇప్పటికే 482 కోట్ల రూపాయలను విడుదల చేశాము. రైతుల ఎకౌంట్లోకే నేరుగా ఈ డబ్బులు చేరుతాయి.

పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు వారికున్న రుణాలను కుటుంబానికి లక్ష రూపాయల చొప్పును వరకు మాఫీ చేయాని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఐదున్నర కోట్ల రూపాయలు విడుదల చేశాము.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, సకల జనుల సమ్మెలాంటి అద్భుత పోరాటాలు చేసిన ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని మాట ఇచ్చాం. దాని ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేశాము.

రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందిస్తుంది. క్రీడాకారులు ఒలంపిక్స్, కామన్వెల్త్, ఏసియన్ గేమ్స్ లో పాల్గొనే వారికి మూడు లక్షల రూపాయలు ఖర్చుల కోసం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన వారికి 50 లక్షల రూపాయలు, రజత పతకం సాధించిన వారికి 25 లక్షల రూపాయలు, కాంస్య పతకం సాధించిన వారికి 15 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని విధాన పరమైన నిర్ణయం తీసుకున్నాం. పతకాలు సాధించిన క్రీడాకారుల కోచ్ లకు కూడా క్రీడాకారులతో సమానంగా నగదు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించాం.

అతిపిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరం అధిరోహించి తెలంగాణ రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన గిరిజన, దళిత బిడ్డలు మాలావత్ పూర్ణ, ఆనంద్ లకు చెరో 25 లక్షల నగదు ప్రోత్సాహం కూడా ప్రభుత్వం ఈరోజే అందిస్తున్నది.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజి పెంచడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు సుఖంగా, ప్రశాంతంగా జీవనం గడిపేందుకు, ఇక్కడ ఉద్యోగులు, మహిళలు ఎలాంటి భయాలు లేకుండా విధులు నిర్వర్తించేందుకు శాంతి, భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. హైదరాబాద్లో పోలీస్ వ్యవస్థను పటిష్ట పరిచేందుకు, ఆధునీకరించేందుకు ఖర్చుకు వెనకాడకుండా చర్యలు తీసుకున్నాం. జిపిఎస్, ఇంటర్నెట్ తో కూడిన ల్యాప్ టాప్, ఇతర ఆధునిక సౌకర్యాలతో నగరంలో కొత్త వాహనాల కొనుగోలుకు 340 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. నిన్ననే ఈ అధునాతన పోలీసు వాహనాలను నేనే జెండా ఊపి ప్రారంభించడం కూడా జరిగింది. 3,600 మంది ఉద్యోగుల నియామకానికి కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది.

హైదరాబాద్ నగరాన్ని వైఫై నగరంగా మార్చేందుకు ప్రైవేటు కంపెనీలతో కలిసి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. త్వరలేనే హైదరాబాద్ నగరం 4 జి వైఫై నగరంగా మారుతుంది. హైదరాబాద్ ను ఐటి ఇంక్యుబేటర్ గా మార్చడానికి శరవేగంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

తెలంగాణ సంస్కృతికి తలమానికమైన బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది.

తెలంగాణ కళా ప్రదర్శనలకు, సాహితీ సభలకు వేదికగా భాసిల్లుతున్న రవీంద్రభారతిని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. రవీంద్రభారతిని గొప్పగా తీర్చిదిద్దడానికి కోటి రూపాయలు విడుదల చేశాము.

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్జించిన తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల పేరిట ప్రతీ ఏడాది ఒక ఉత్తమ కవికి 1,01,116ల నగదు పురస్కారం అందించాలని ఉత్తర్వులు జారీ చేశాము.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయితీలుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నాం. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించడానికి అవసరమయ్యే నివేదికను సమర్పించడానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసే ప్రక్రియ జరుగుతున్నది.

ముస్లిం మైనారిటీ సోదరులకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందుకోసం హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. మైనారిటీ కమిషన్ కు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాం. వచ్చే వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలు కల్పిస్తున్నాం.

క్రైస్తవ మతస్తుల సమస్యల పట్ల ప్రభుత్వం సంపూర్ణ అవగాహన కలిగి ఉంది. దళిత, క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుంది. క్రైస్తవులు చర్చిలు నిర్మించాలంటే ఇప్పుడు కలెక్టర్ అనుమతి పొందవలసి ఉంది. చర్చిల నిర్మాణానికి గ్రామ పంచాయితీల పరిధిలోనే అనుమతి పొందే విధంగా వెసులుబాటు కల్పించబడుతుంది.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపొంది పట్టణ మేయర్ గా ఒక సిక్కు మతానికి చెందిన పౌరుడు ఎన్నిక కావడం తెలంగాణలోని మత సామరస్యానికి కాస్మొపాలిటన్ కల్చర్ కు ప్రతీకగా బావిస్తున్నాం. ఇందుకు గర్విస్తున్నాం.

బలహీన వర్గాలు, బిసి కులాల ప్రజల పట్ల మా ప్రభుత్వం పరిపూర్ణ సానుభూతితో ఉంది. ముఖ్యంగా ఎంబిసిల కోసం ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది.

వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదని, దాన్ని పెంచాలని గతంలో టిఆర్ఎస్ డిమాండ్ చేసింది. కానీ ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. అందుకే టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. దరసా కానుకగా దసరా, దీపావళి మధ్య ఈ పెన్షన్లను అందచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

ఆడపిల్ల పుట్టిందనగానే కన్న వారు వారి పెళ్లి ఎలా చేయాలా అని రంది పడే రోజులివి. ముఖ్యంగా దళిత, గిరిజన కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్ళిళ్లు చేయలేక, పుట్టగానే ఆడపిల్లను చంపేసే దుర్భర పరిస్థితులున్నాయి. అందుకే దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్లికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించి, కళ్యాణలక్ష్మి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదు. ఇంతటి గొప్ప కార్యక్రమం తెలంగాణలోనే అమలవుతుండడం మనందరికి గర్వకారణం. ముఖ్యంగా నిరుపేద దళిత, గిరిజన కుటుంబాల ఆడపిల్లల పెళ్లిల్లలో ఆర్థిక భారం తగ్గుతుంది. దసరా పండుగ నుంచి ఈ పథకం అమలవుతుంది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మా ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల వరకు పంటరుణ మాఫీ చేస్తోంది. దీనివల్ల సుమారు 40 లక్షల రైతు కుటుంబాలు రుణమాఫీ పొందుతాయి. ప్రభుత్వానికి 18 వేల కోట్ల భారం పడినా రైతు కుటుంబాల క్షేమం దృష్టిలో పెట్టుకుని, రైతుల కష్టాలు స్వయంగా తెలిసిన వారిగా ఈ నిర్ణయం తీసుకున్నాం. సంబధిత శాఖలు అమలు విషయంలో నిమగ్నమయ్యాయి.

ప్రభుత్వ కార్యక్రమాలు హైదరాబాద్లో కూర్చుని తయారు చేయడం వల్ల అనుకున్న ఫలితాలు రావటంలేదు. అందుకే ఎవరి ఊరి ప్రణాళిక వారు తయారు చేయాలని, ఎవరి మండలం ఎలా ఉండాలో ఆ మండలం వారే నిర్ణయించుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచన. అందుకే రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమం నిర్వహించాం. అందులో వచ్చిన ప్రణాళికలు, సూచనల ప్రకారమే నిధుల విడుదల, రాష్ట్ర ప్రణాళిక తయారీ ఉంటుంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించడం దేశంలో ఇది మొదటిసారి.

స్థానిక సంస్థలకు అధికారాలు, బాధ్యతలు అప్పగించడం ద్వారా ఈ సంస్థలలో జవాబుదారీ తనాన్ని పెంపొందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రక్రియలో ప్రజల క్రియాశీల భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడానికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్ కు, తెలంగాణకు పరుగులు పెట్టే విధంగా దేశంలో మరెక్కడా లేనటువంటి అద్భుత పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. పరిశ్రమలకు అనుమతులిచ్చేందుకు పూర్తి పారదర్శక, సరళమైన, అవినీతి రహితమైన విధానాలను ప్రభుత్వం అనుసరిస్తుంది. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులిస్తుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోనే స్పెషల్ ఛేజింగ్ సెల్ ఏర్పాటు అవుతుంది. పారిశ్రామిక వేత్తలు అనుమతుల కోసం కార్యాలయాలకు తిరగకుండా, వారికి కావాల్సిన భూమి, నీరు, కరెంటు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ సిద్ధం చేసి, అనుమతులు కూడా టిఎస్ఐఐసి ద్వార తీసుకుని పరిశ్రమలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వమే చేస్తుంది. తెలంగాణలో దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని టిఎస్ఐఐసికి కేటాయించి, పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తాము.

హైదరాబాద్ కు నలుదిశలా ఫార్మాసిటీ, స్పోర్ట్స్ సిటీ, సినిమా సిటీ, మాన్యుఫాక్చరింగ్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, హెల్త్ సిటీల వంటి హబ్ లు, శాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభించింది.

జంటనగరాలకు అంతర్జాతీయ స్థాయిలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జంట నగరాలకు నలువైపులా కొత్త బస్ టర్మినల్స్, కొత్త ట్రెయిన్ టర్మినల్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని జీతంతో వెట్టి చాకిరీ చేస్తూ, అవమానాలు ఎదుర్కుంటూ కూడా ప్రభుత్వ సర్వీసు చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీనిచ్చాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, కొందరు కావాలని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదు. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిర్ణయించింది.

లిక్కర్ మాఫియా వత్తిళ్లకు తలొగ్గి, గత ప్రభుత్వాలు కల్లుగీత కార్మికులపై కక్ష కట్టాయి. హైదరాబాద్లో వేలాది మందికి ఉపాధి కల్పించే కల్లు దుకాణాలను బంద్ చేయించింది ప్రభుత్వం. గీత కార్మికులు ఎన్నిసార్లు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మేం ఎన్నికల సమయంలో చెప్పాం. దాని ప్రకారమే హైదరాబాద్లో కల్లు దుకాణాలను మళ్లీ తెరిపిస్తాం. దసరా నాడే ప్రారంభిస్తాం. దీనివల్ల నగరంలో దాదాపు 60 వేల మంది కల్లుగీత కార్మికులకు ఉపాధి దొరకుతుంది. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు, నగరం చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో రేషన్ కేటాయిస్తాం. దీనివల్ల చుట్టుపక్కల కల్లుగీత కార్మికులకు ఉపాధి దొరకుతుంది.

పర్యావరణ, వాతావరణ సమతుల్యాన్ని పరిరక్షించే బాధ్యతను ప్రభుత్వం, ప్రజలు ఒక సవాల్ గా స్వీకరించి విజయం సాధించాలి. ఇందుకోసం తెలంగాణకు హరితహారం అనే పేరుతో 230 కోట్ల మొక్కలు నాటి పెంచాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. సాగునీరు, తాగునీరు, బలహీన వర్గాలకు గృహ నిర్మాణం, విద్యుత్, వ్యవసాయ విధానాలకు సంబంధించి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియచేస్తున్నాను.

ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేకపోవడం వల్లే ప్రభుత్వ పథకాలు దుర్వినియోగమవుతున్నాయి. రేషన్ కార్డులు, గృహ నిర్మాణం, పెన్షన్లు ఇంకా ఇతర పథకాల్లో గతంలో జరిగిన అవినీతికి సంబంధించిన సత్యాలు బయటపడ్డాయి. ఈ రకమైన పరిస్థితులు తలెత్తకుండా అర్హులైన వారు మాత్రమే లబ్ది పొందాలనే సదుద్దేశంతో ఈనెల 19న ఇంటింటి సర్వే చేపడుతున్నాం. ఒకే రోజు తెలంగాణ అంతటా సర్వే జరుగుతోంది. దీనికోసం విస్త్రృతంగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు కూడా సహకరించాలి. 19న సెలవు దినంగా ప్రకటించాం. అందరూ ఇళ్లలోనే ఉండి సరైన సమాచారం అందించాలని కోరుతున్నాను. దీనిపైన కొందరు అనవసరమైన అపోహలను ప్రచారంలో పెడుతున్నారు. వాటిని విశ్వసించకూడదని కోరుతున్నాను.

భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పివి నర్సింహారావు గారి జయంతి ఉత్సవాలను ఇటీవల ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. స్వర్గీయ శ్రీ పివి నర్సింహరావుగారి పేరిట ఓ వెటర్నరీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిషలు అలుపెరగని పోరాటం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని సగర్వంగా ప్రకటిస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడిందని, ఈ సంస్థ త్వరలోనే తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలియ చేస్తున్నాను.

తెలంగాణలోని ప్రతీ పల్లెలోనూ, ప్రతీ పట్టణంలోనూ ప్రతి ఇంటికి పరిశుభ్రమైన మంచినీరు అందించాలనే సత్సంకల్పంతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ప్రజలే కేంద్ర బిందువుగా ప్రజా సమస్యలే ఇతి వృత్తంగా అవినీతి రహిత పరిపాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో పురోగమింప చేయడానికి అవసరమైన వ్యూహాలను, పథకాలను, ప్రణాళికలను రూపొందించి అమలు పరుస్తామని ఈ శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు మనస్పూర్తిగా హామీ ఇస్తున్నాను.

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖబాగ్భవేత్ అందరూ సుఖంగా ఉండాలి. అందరూ ప్రశాంతగా జీవించాలి. ఎవరికీ దుఃఖం కలగకుండుగాక. జై హింద్ జై తెలంగాణ

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.