-మూడు జిల్లాలతో అవినాభావ సంబంధం

ఒక జిల్లా జన్మనిస్తే.. మరో జిల్లా అక్షరజ్ఞానాన్ని ప్రసాదించింది.. ఇంకో జిల్లా విద్యా నిలయాలతో అనుబంధం పెంచడంతోపాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలోనూ భాగస్వామిగా మార్చింది. ఇలా మూడు జిల్లాలతో అనుబంధం పెనవేసుకున్న విద్యావేత్త పల్లా రాజేశ్వర్‌రెడ్డి. ప్రగతిశీల భావాలతో కూడిన రాజకీయనేతగా ఆయనకు మూడు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీచేసే భాగ్యం దక్కింది. విద్యాసంస్థల ఏర్పాటుతో యువతలో మంచి పట్టు కలిగి ఉండటం, ఇటీవల టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును రికార్డుస్థాయిలో విజయవంతం చేయడం ఆయనకు అదనంగా కలిసొచ్చే అంశాలు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం శోడిషపల్లి గ్రామంలో 1963 నవంబర్ 4న జన్మించిన పల్లా.. అదే గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మౌంట్ ఫోర్ట్ హైస్కూల్‌లో పదో తరగతి చదివారు. హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసిన పల్లా.. ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆపై ఉస్మానియా వర్సిటీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ చేశారు. అనురాగ్ విద్యాసంస్థల ఏర్పాటుతో నల్లగొండ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఏర్పరుచుకున్నారు. నల్లగొండ నుంచి రంగారెడ్డి జిల్లా మీదుగా హైదరాబాద్ వరకు ఆయన విద్యాసంస్థలు విస్తరించాయి.
చదువులో చురుకుదనం.. విద్యార్థిదశ నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి చదువుల్లోనూ చురుకైన విద్యార్థే. ఎస్‌ఎఫ్‌ఐ ఖమ్మం పట్టణ కార్యదర్శిగా, ఉస్మానియా వర్సిటీ కార్యదర్శిగా, తర్వాత సంఘం హైదరాబాద్ నగర కార్యదర్శిగా పనిచేశారు. 1980-88 మధ్య సాగిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమంలో రిజర్వేషన్ అనుకూల శ్రేణులకు అండగా నిలిచారు. విద్యార్థి సంఘం నేతగా ఉన్నా.. ఎమ్మెస్సీ భౌతికశాస్త్రంలో చురుకైన విద్యార్థిగా అధ్యాపకుల అభిమానాన్ని చూరగొన్నారు. 1986లో యూజీసీ ఫెలోషిప్ అందుకున్న ఏకైక విద్యార్థిగా రికార్డు నెలకొల్పారు.
పలు జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించారు. 1991లో మేగ్నెటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆయన సమర్పించిన ఒక విశిష్ట పత్రానికి డాక్టర్ తమహంకర్ మెమోరియల్ బహుమతి లభించింది. వీటితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో బాణామతి, మూఢ నమ్మకాలను తొలగింపుకు కూడా కృషిచేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ పల్లా భాగస్వాములయ్యారు. పలు ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గొన్న పల్లాపై 11 కేసులు నమోదయ్యాయి. పదిరోజులు చంచల్‌గూడ జైలు జీవితాన్ని కూడా గడిపారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నల్లగొండ ఎంపీ స్థానానికి పోటీచేసి ఓడినా.. క్రమశిక్షణగల కార్యకర్తగా పార్టీకోసం పనిచేస్తున్నారు.
విద్యార్థులతో నిత్య సంబంధాలు విద్యాసంస్థల నిర్వహణతో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి విద్యార్థులతో నిత్య సంబంధాలు ఏర్పడ్డాయి. నల్లగొండ నుంచి హైదరాబాద్ వరకు విస్తరించి ఉన్న అతి పెద్ద ఇంజినీరింగ్ కళాశాలల గ్రూపులో 17,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల వారే అధికం. వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులతో రాజేశ్వర్‌రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. దీనితో పాటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల సంక్షోభం నుంచి 700 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలను గట్టెక్కించడంలో కీలకపాత్ర పోషించారు. సుమారు పది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడకుండా కాపాడారు. ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీ అకడమిక్ సెనేట్ మెంబర్‌గా, ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాల కన్సార్టియం ప్రధాన కార్యదర్శిగా, ఉస్మానియా విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ కళాశాలల సంఘం అధ్యక్షుడిగా అందరికీ తలలో నాలుకలా వ్యవహరిస్తున్నారు. ఇక పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా కూడా సేవలందిస్తున్నారు.