-ఏఈఈ, ఏఈ పోస్టుల్లో రిటైర్డు ఇంజినీర్లు -ఈఎన్‌సీ నేతృత్వంలో క్వాలిటీ కంట్రోల్ టీమ్ -ప్రతివారం జిల్లాల్లో పర్యటిస్తా: మంత్రి హరీశ్‌రావు -మిషన్ కాకతీయ పథకంపై అధికారులతో సమీక్ష

చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంతో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగేలా ఇంజినీర్లు కృషి చేయాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, లోపాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించి ప్రజలకు ఒక మార్పును అనుభవంలోకి తీసుకురావాలని సూచించారు. కొత్తగా నియమితులైన ఎస్‌ఈలు, ఈఈలతో మంత్రి హరీశ్‌రావు జలసౌధలో మంగళవారం మిషన్ కాకతీయ పథకంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని చెప్పారు. ఇంజినీర్లు అందరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఎస్‌ఈలు, ఈఈలు ప్రతి రోజు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి పనులను పర్యవేక్షిస్తూ, ప్రతి రోజు ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు. ఫీడర్ చానల్స్‌లో ఆక్రమణలను తొలగించే విషయంలో, చెరువు శిఖం పూడిక తొలగించే సమయంలో పట్టదారుల నుంచి ఎదురయ్యే సమస్యలను కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎమ్మార్వోలకు నివేదించి వారి సహాయం తీసుకోవాలని సూచించారు. చెరువు ఎఫ్టీఎల్ బయట మొక్కల పెంపకంపై అటవీశాఖతో సమన్వయం చేసుకుని సిల్వర్‌ఓక్ మొక్కల పెంపకం చేపట్టాలని మంత్రి అన్నారు.
పూడిక మట్టి తరలింపుపై రైతులను ప్రోత్సహించడానికి గ్రామ, మండలస్థాయి ప్రజా ప్రతినిధులతో సంప్రదించి ప్రచార కార్యక్రమం చేపట్టాలని సూచించారు. తాను ప్రతీ వారం జిల్లా పర్యటనలను చేపడతానని హరీశ్‌రావు తెలిపారు. డిసెంబర్ 4న మహబూబ్‌నగర్, 5న నిజామాబాద్, 10న మెదక్, 11న వరంగల్ జిల్లాల్లో పర్యటించి జిల్లా పరిషత్ సమావేశాల్లో సమీక్షలు నిర్వహించి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నానని మంత్రి తెలిపారు. పూడిక మట్టి సారాన్ని పరీక్షించడానికి వ్యవసాయశాఖ మొబైల్ ల్యాబ్‌లను వినియోగించాలని, వాటి ఫలితాలను ప్రజలకు పత్రికల ద్వారా, లోకల్ కేబుల్ టీవీ చానల్స్ ద్వారా ప్రచారం చేయాలని సూచించారు.
మిషన్ కాకతీయ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు -టెండర్ల ప్రక్రియను వికేంద్రీకరించినట్లుగానే టెండర్లు వేయడానికి రిజిస్టర్డ్ క్లాస్ 4,5 కాంట్రాక్టర్ల అర్హతను రూ.10 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంచాలని ఇంజినీర్లు సూచించారు. ఎస్టిమేట్లు దాదాపు 85 శాతం ఈఈల పరిధిలోనివి కావడంతో, ఈ పరిధి పెంచడం అనివార్యమన్నారు. లేనిపక్షంలో టెండర్ల ప్రక్రియ పూర్తి కావడం కష్టమని ఇంజినీర్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ మేరకు ఫైల్ తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని ఈఎన్‌సీని మంత్రి ఆదేశించారు. అలాగే కాంట్రాక్టు రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని ఈఈలకు రూ. 50 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. -సర్కిల్‌లో ఉండే ఏఈఈ లేదా ఏఈ పోస్టుల్లో 20 శాతం పోస్టులు రిటైర్డు ఇంజినీర్లతో భర్తీచేయాలని నిర్ణయించారు. 115 పోస్టుల నియామకానికి సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. కొత్త నియామకాలు జరిగే వరకు ఈ వ్యవస్థను కొనసాగిస్తారు. -డిసెంబర్ 15 నాటికి 20 శాతం చెరువుల సర్వే, ఎస్టిమేట్ల తయారీ పూర్తిచేయాలి. డిసెంబరు చివరికి అన్ని చెరువుల టెండర్లను ప్రకటించాలి. -చెరువుల పనుల పురోగతిని పర్యవేక్షించడానికి స్థానిక జిల్లా చీఫ్ ఇంజినీర్లకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్‌కు మధుసూదనరావును, ఆదిలాబాద్‌కు శంకర్‌ను, కరీంనగర్‌కు అనిల్‌కుమార్‌ను, వరంగల్‌కు విజయ్ ప్రకాశ్‌ను, మెదక్‌కు కృష్ణారావును, నల్లగొండకు పురుషోత్తమరాజును, మహబూబ్‌నగర్‌కు ఖగేందర్‌ను, రంగారెడ్డికి నాగేందర్‌ను, హైదరాబాద్‌కు శ్రీదేవిని, ఖమ్మంకు శంకర్‌నాయక్ ఇన్‌చార్జిలుగా నియమించారు. ఈ అధికారులు జిల్లాల్లో పనుల ప్రణాళికను, పురోగతిని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యవేక్షించాలి. వారానికి కనీసం 10 చెరువులనైనా సందర్శించాలి. -పనుల నాణ్యతను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేకమైన క్వాలిటీ కంట్రోల్ టీంలను ఈఎన్‌సీ (ఇరిగేషన్) పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తారు. వీరు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నేరుగా ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తారు.