-మే నాటికి మొదటి దశ పూర్తి కావాలి -9వేల చెరువుల పునరుద్ధరణకు రూ.4,500 కోట్లు -ఆన్‌లైన్ ద్వారానే టెండర్లు.. రైతులకే పూడికతీత పనులు -ఎన్నారైలు ఆర్థిక సాయం చేస్తే..చెరువులకు వారి కుటుంబసభ్యుల పేర్లు -చెరువుల పునరుద్ధరణపై సమీక్షలో సీఎం

కృష్ణా, గోదావరి నదీజలాల్లో 265 టీఎంసీల నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి అనువుగా రాష్ట్రంలోని గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరణ కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంలా చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. చెరువులకు గతంలో 265 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నా, సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల నదీ జలాలను వినియోగించుకోలేకపోయామన్నారు. ఆదివారం సచివాలయంలో చెరువుల పునరుద్ధరణపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం డిసెంబర్‌లో ప్రారంభించి, మేలో పూర్తి చేయాలన్నారు. పనుల్లో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. తొలి విడతలో 9వేల చెరువుల పునరుద్ధరణకు సుమారు రూ.4,500 కోట్లు ఖర్చవుతుందని అధికారులు వివరించారు. వచ్చే వర్షాకాలంలో చెరువుల్లో పూర్తిస్థాయిలో నీరు నిలిచేలా చూడాలన్నారు. టెండర్లను పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయిలో రూ.50 లక్షల వరకు, ఎస్‌ఈలకు రూ.కోటి వరకు, ఆ పైన వ్యయమయ్యే చెరువులకు ఇంజినీర్ -ఇన్-చీఫ్ స్థాయి అధికారులు టెండర్లు పిలువాలని నిర్ణయించారు. కృష్ణా, గోదావరి బేసిన్లకు ఒక్కో ఈఎన్‌సీని నియమించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. చెరువుల పూడికతీత పనులను స్థానిక రైతులకే అప్పగించాలని సూచించారు.
ప్రతీ నియోజకవర్గంలో ఒక పెద్ద చెరువును గుర్తించి ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని, చెరువుల్లో నీటినిల్వతో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య కూడా తీరుతుందన్నారు. ఎన్నారైలు ఆర్థిక సాయం చేస్తే చెరువులకు వారి కుటుంబసభ్యుల పేర్లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పా రు. సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి వీ నాగిరెడ్డి, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు పాల్గొన్నారు.