-చెరువుల పునరుద్ధరణకు రూ.27,500 కోట్లు -విద్యుత్ కేటాయింపులో చంద్రబాబు తొండాట: మంత్రి హరీశ్‌రావు -వికారాబాద్‌లో పలు అభివృద్ధిపనులకు శంకుస్థాపన

ఊరు బాగుండాలంటే చెరువు బాగుండాలే. ఊర్లు బాగుపడితే దేశమే బాగుపడుతది అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ధారూరు మండలం సర్పన్‌పల్లి ప్రాజెక్టు వద్ద రూ.4.45 కోట్లతో చేపట్టనున్న కాల్వ మరమ్మతులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అదేవిధంగా వికారాబాద్ పట్టణంలో రూ.25 లక్షలతో చేపట్టనున్న స్త్రీశక్తి భవన నిర్మాణానికి, రూ.6 కోట్లతో చేపట్టనున్న ఆర్‌అండ్‌బీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. 25వ వార్డులో రూ.32 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.55 లక్షలతో నిర్మించిన రైతుబజార్‌లను ప్రారంభించారు. వికారాబాద్ సమీపంలోని సర్పన్‌పల్లి చెరువు కింద 3,286 ఎకరాల ఆయకట్టు ఉండగా, ప్రస్తుతం 2,126 ఎకరాలు మాత్రమే సాగులో ఉంది. చెరువు పునరుద్ధరణ ద్వారా మిగిలిన 1160 ఎకరాలను కూడా సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. సర్పన్‌పల్లి ఎడమ కాలువ 7 కిమీ, కుడి కాలువ 10 కిలోమీటర్లు ఉంది. దీని పరిధిలో గొట్టిముక్కల, గ్యాచారం, ఆనంతారం, మాదారం, నాగచాన్‌పల్లి, సర్పన్‌పల్లి, తరిగొట్టల గ్రామాల్లోని 3,286 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ..
గ్రామంలో సాగు, తాగునీరందాలంటే చెరువులో నిండుగా నీరుండాలన్నారు. అలా నీరుండాలంటే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క రోజూ చెరువుల మరమ్మతు పనులు చేసిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తంచేశారు. వేల ఎకరాలకు సాగు నీరందించే ప్రాజెక్టులు వంద ఎకరాలకు సాగునీరందించలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాంకాలంలో ఏర్పాటు చేసిన కోట్‌పల్లి, ఘనాపూర్ ప్రాజెక్టులే జిల్లాలో దర్శనమిస్తాయని, సమైక్య పాలనలో రంగారెడ్డి జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టూ చేపట్టలేదని విమర్శించారు. ఇదివరకు నాలుగు జిల్లాలకు కలిపి మహబూబ్‌నగర్‌లో ఎస్‌ఈ కార్యాలయం ఉందని, ఇక నుంచి ప్రతి జిల్లాకు ఎస్‌ఈ కార్యాలయం ఉంటుందన్నారు. రైతులు, వినియోగదారులకు లాభదాయకంగా ఉండేందుకు వికారాబాద్‌లో రైతు బజార్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరెంటు కష్టాలు ఉన్నాయని, రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఒక మాట ప్రస్తుతం ఒక మాట మాట్లాడి ఆంధ్రా సీఎం చంద్రబాబు తొండాట ఆడుతున్నాడని మండిపడ్డారు.
త్వరలో వెయ్యి మెగావాట్లతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేస్తున్నామని, రెండేండ్లలో కరెంటు కష్టాలు తీరతాయని అప్పటివరకు రైతులు సంయమనం పాటించాలన్నారు. రైతులకు త్వరలో 50 శాతం సబ్సిడీపై ఐదువేల సోలార్ పంపుసెట్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతు క్షేమం కోసమే పని చేస్తుందని, దానిలో భాగంగానే రైతులకు 420 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవరావు, యాదయ్య, సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, హరీశ్వర్‌రెడ్డి, కలెక్టర్ ఎన్ శ్రీధర్, వికారాబాద్ సబ్‌కలెక్టర్ హరినారాయణ్, ఇరిగేషన్ ఈఈ వెంకటేశం, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, వికారాబాద్ జెడ్పీటీసీ ముతహర్‌షరీఫ్, ఎంపీపీ సామల భాగ్యలక్ష్మి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.