-నగరంలో విహారయాత్ర -ఓరుగల్లు కోటలో సందడి.. -భద్రకాళి, వేయిస్తంభాల గుడిలో పూజలు వాగులు.. వంకలు..జలజల పారే సెలయేర్లు.. చుట్టూకొండలు.. గుట్టలు.. దట్టమైన అటవీప్రాంతంలో జీవించే చెంచుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. అటవీప్రాంతమే ప్రపంచంగా భావించే చెంచులు సోమవారం ఖిలావరంగల్ కోటలో సందడి చేశారు. శిల్ప కళా సౌందర్యాన్ని ప్రత్యక్షంగా చూసి వింత అనుభూతికి లోనయ్యా రు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి నేతృత్వంలో రేగొండ మండలం చెన్నాపురం గ్రామశివారులోని 57, చిట్యాల మండలం బావుసింగ్‌పల్లిలోని 24 చెంచు కుటుంబాలకు చెందిన పలువురు నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పర్యటించారు.

–చెంచులకు విద్యార్థుల స్వాగతం.. ఓరుగల్లు ఖిల్లాలో చెంచులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. స్పీకర్ మధసూదనాచారి ఆధ్వర్యంలో చెంచులు మొదటిసారిగా నగరాన్ని వీక్షించేందుకు వస్తున్నారని తెలుసుకున్న కోటలోని ఆరెళ్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, సాహితీ హైస్కూల్, ఆర్యబాలుర ప్రభుత్వ సహాయక పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు చెంచులకు ఘన స్వాగతం పలికారు. బస్సు దిగిన వెంటనే 500మంది విద్యార్థులు రోడ్డుకిరువైపులా వరుసక్రమంలో నిలబడి పూలను చల్లారు. అనంతరం ఖుష్‌మహాల్ ప్రాంగణంలో కలెక్టర్ జి.కిషన్, డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు, అడిషనల్‌ఎస్పీ ఎం.యాద య్య, వరంగల్ తహసీల్దార్ ఎన్.రవి చెంచులతోపాటు స్పీకర్ మధుసూదనాచారిని ఆహ్వానించారు.
-ఖుష్‌మహల్‌లో అల్పాహారం.. నాగరిక సమాజంలోకి మొదటిసారిగా వచ్చిన చెంచులకు ఖుష్‌మహల్ (షితాబ్‌ఖాన్ మహాల్) ప్రాంగణంలో అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అల్పాహారాన్ని ఆరగించిన చెంచులు బువ్వ బాగుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఖుష్‌మహల్ నిర్మాణంను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతపెద్ద బండరాళ్లను పైకెలా ఎత్తారో.. అంటూ కళ్లుపెద్దవి చేసుకొని చూసి మురిసిపోయారు.
-శిల్పసంపద మధ్య చెంచుల సందడి అనంతరం కాకతీయుల కీర్తి తోరణాల మధ్యనున్న శిల్పసంపద నడుమ చెంచులు సందడి చేశారు. కీర్తితోరణాల నిర్మాణం, ధ్వంసమైన విగ్రహాలను, రాతి స్తంభాలను చేతులతో తాకుతూ సంబురపడ్డారు. కాకతీయుల చరిత్రను, చారిత్రక కట్టడాలగురించి జిల్లా గైడ్ ఎండి.గౌస్‌పాషా చెంచులకు వివరించారు. కాకతీయుల అద్భుత శిల్పసంపదను సార్ (స్పీకర్ మధుసూదనాచారి) వల్ల చూడగలిగామని సంతోషం వ్యక్తం చేశారు.
-జీవన స్థితిగతులు నన్ను కలిచివేశాయి.. -స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి చెంచుల జీవన స్థితిగతులు నా మనస్సును కలిచివేశాయని రాష్ట్ర శాసన సభస్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. చెంచుల కుటుంబాలను చారిత్రక పర్యాటక ఖిల్లాకు తీసుకొచ్చిన ఆయన ఖుష్‌మహల్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. మూడేళ్ల క్రితం పల్లెనిద్రలో భాగంగా చెంచువాడలకు వెళ్లానన్నారు. అక్కడ వారి జీవన స్థితిగతుల తోపాటు ఆహార పద్ధతులు చూసి తన మనస్సు చలించిపోయిందన్నారు. నగరం అంటేనే తెలియదని, ఇప్ప టి వరకు చూడలేదని చెప్పడంతో ఆశ్చర్యంతోపాటు బాధ కలిగిందన్నారు. వీరిని సమాజానికి, నగరానికి పరిచయం చేలాని ఆనాడే నిర్ణయం తీసుకున్నానని, అది ఇప్పుడు సాధ్యమైందని తెలిపారు. తన నియోజకవర్గంలోని చెంచులను అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్వచ్ఛందసంస్థల సహకారం తీసుకుంటామన్నారు.
అలాగే ఇతర ఎమ్మెల్యేలు కూడా కలిసి వస్తే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న చెంచులకు కూడా మౌలిక వసతులు కల్పించేందుకు సహకరిస్తానన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ తూర్పు నియోజక వర్గం ఇన్‌చార్జి అచ్చ విద్యాసాగర్ ఏర్పాటు చేసిన విందులో స్పీకర్ మధుసూదనాచారితో పాటు టీఆర్‌ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, టీఆర్‌ఎస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మురహరి భాగ్యలక్ష్మి, టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మరుపల్ల రవి, డివిజన్ అధ్యక్షుడు సంగరబోయిన చందర్, టీఆర్‌ఎస్ నాయకులు బొ లుగొడ్డు శ్రీనివాస్, బిల్ల రవికుమార్, వనపర్తి కరుణాకర్, అర్సం రాంబాబు, బొలిశెట్టి అశోక్, బైరబోయిన దా మోదర్, అచ్చ వీరేశ్‌బాబు, యేసిరెడ్డి ఈశ్వరయ్య, కొత్తపెల్లి శ్రీనివాస్, అచ్చ వినోద్‌కుమార్, బొలుగొడ్డు ప్రభాకర్, బంగారు శ్రీను, మిద్దెపాక మైఖెల్, ఎండి.గౌస్, మంద శ్రీధర్‌రెడ్డి, మిరపెల్లి రాజు, మిట్టపెల్లి కట్టమల్లు, బైరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.