-అందరి నోటా ఒకటే మాట -కొత్త రెవెన్యూ విధానంపై సర్వత్రా హర్షం -తరాల తగువులు, సమస్యలు ఇకపై సాగవు -సామాన్యుడికి చుట్టంలా కొత్త రెవెన్యూ చట్టం

రైతుకు మట్టి వాసననిచ్చిన నేల.. మధ్యతరగతి జీవికి వెలుగు బతుకైన నేల.. మనిషికి బతుకుతనాన్నిచ్చిన ఈ నేలకు.. శతాబ్దాలుగా పడిన సంకెళ్లను తెంచడానికి భూమి పుత్రుడు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సాహసోపేతంగా వేసిన అడుగు నూతన రెవెన్యూ చట్టం తెలంగాణమంతటా ఆకాశమంత సంబురాన్ని తెచ్చింది. ఎప్పటికీ పరిష్కారం కావనుకున్నవాటికి పరిష్కారం చూపడం అందరికీ అద్భుతంగా కనిపిస్తున్నది. ఎప్పటికీ అంతంకాదనుకున్న అవినీతి అంతం కావడం విస్మయాన్ని కలిగిస్తున్నది. మున్సిపాలిటీల నుంచి తండాల దాకా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. ఏ నోట విన్నా ఇదేమాట.. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న మున్సిపల్ చట్టం అపూర్వమని. నిరుపమానమని.
పొలం దగ్గర, చెల్కల వద్ద పల్లెల్లో, పట్నాల్లో.. ఎక్కడ చూసినా కొత్త రెవెన్యూ చట్టం గురించే ముచ్చట. రైతన్న, ప్రభుత్వ ఉద్యోగి, ప్రైవేటు ఉద్యోగి, వ్యాపారి, రియల్టర్, బిల్డర్ ఇలా భూ మి ఉన్నవారు, భూమితో వ్యవహారం నడిచే ప్రతి ఒక్కరి దగ్గర దీనిపైనే చర్చ. యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్.. అన్నింట్లోనూ ట్రెండింగ్ ఇదే. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకొచ్చిన ఈ చట్టం ఇప్పుడు ఓ విప్లవం. ఈ నూత న రెవెన్యూచట్టానికి అన్ని వర్గాల నుంచి ఆమో దం లభిస్తున్నది. రైతుల నుంచి రెవెన్యూ నిపుణుల వరకు అందరూ హర్షం వ్యక్తంచేస్తున్నా రు. తరాల భూముల తగువులకు ముగింపు పలికేలా, కొత్త తరాలకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా కొత్త చట్టం ఉన్నదని అభిప్రాయపడుతున్నారు. ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తిచేసేలా ఉన్న కొత్త నిబంధనను వేనోళ్ల మెచ్చుకుంటున్నారు. వారసత్వ భూముల విషయంలో కుటుంబసభ్యుల వివరాలను పాసుపుస్తకాల్లో నమోదుచేయటం వల్ల ఆస్తుల గొడవలుండవని అంటున్నారు. భూముల రికార్డు ల్లో భూమి అప్పులు, తనఖా వివరాలు ఉం డటం వల్ల క్రయవిక్రయాల్లో మోసాలు జరగవని చెప్తున్నారు. మొత్తంగా చట్టంపై లోతైన అధ్యయనం జరిగిందని పేర్కొంటున్నారు.