హైదరాబాద్ నగరంలోని చారిత్రక కట్టడాలు, ప్రార్థనామందిరాలకు ఎలాంటి నష్టం కలుగకుండా మెట్రో రైల్ నిర్మాణం కానుంది. మెట్రోరైల్ ప్రాజెక్ట్‌లో ప్రతిపాదిత మూడు అలైన్‌మెంట్ మార్పులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, ముస్లింల ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన చిహ్నాలకు ఎలాంటి విఘాతం కలుగకుండా చర్యలు చేపట్టి, ప్రాజెక్టు పూర్తి చేయడం ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

-ప్రార్థనా మందిరాలకు ఇబ్బందిలేకుండా మెట్రో రైల్ -మూడు మార్పులపై సీఎం సమీక్ష -నేడు అధికారికంగా ప్రతిపాదనలు -పాతబస్తీ అలైన్‌మెంట్‌పై నివేదిక ప్రస్తుత అలైన్‌మెంట్ ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే 7 హిందూ దేవాలయాలు, 28 ముస్లిం ప్రార్థనా మందిరాలు, ఒక వేయి నివాస గృహాలు దెబ్బతింటాయని అన్నారు. అంతేగాకుండా అక్కన్న మాదన్న దేవాలయం, జగదీశ్ టెంపుల్, బంగారు మైసమ్మగుడి, లక్ష్మీనరసింహ దేవాలయం, ఆజాఖానా జోవురా, ఆసుర్‌ఖానా నాల్ ముబారక్, ఇత్తేబార్ చౌక్ మసీదు, కోట్లా మసీదు తదితర కట్టడాలు ప్రస్తుత అలైన్‌మెంట్ ప్రకారం దెబ్బతినే అవకాశం ఉందన్నారు.
వీటిని దృష్టిలో ఉంచుకుని మెట్రోరైలు ప్రాజెక్టుకోసం మొదట్లో ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌లో మూడు మార్పులు సూచించామని సీఎం వెల్లడించారు. అసెంబ్లీ, అమరవీరుల స్థూపం పవిత్రతను కాపాడేందుకు అసెంబ్లీ వెనుకభాగంనుంచి మెట్రో రైలు మార్గం నిర్మించాలని చెప్పారు. సుల్తాన్‌బజార్‌వద్ద కూడా మార్పును కోరుతూ ప్రతిపాదనలు సిద్ధం చేశామని అన్నారు. ప్రస్తుతం ఉన్న అలైన్‌మెంట్‌కు బదులు బడీచౌడీనుంచి ఉమెన్స్‌కాలేజ్ వెనుక భాగంద్వారా ఇమ్లిబన్ చేరే విధంగా కొత్త రూటు మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
ఇటీవల ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఏఎం నాయక్ ముఖ్యమంత్రితో సమావేశమైన సందర్భంగా అలైన్‌మెంట్ మార్పులపై చర్చ జరిగింది. మార్పులకు ఎల్‌అండ్‌టీ అంగీకరించిన నేపథ్యంలో అధికారికంగా మార్పులు సూచించేందుకు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అధికారికంగా బుధవారం ఎల్‌అండ్‌టీ కంపెనీకి అందించనుంది.
కాగా పాతబస్తీలో అలైన్‌మెంట్ మార్పుల ప్రతిపాదనలతో కూడిన లేఖను ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి అందజేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, మెట్రోరైలు ప్రాజెక్టు ఎండీ, ఎన్‌వీఎస్ రెడ్డి, మెట్రో రైలు ప్రాజెక్టు సీఈ జియావుద్దీన్ పాల్గొన్నారు.