-లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రబలమైన శక్తిగా గులాబీ పార్టీ -దేశగతిని మార్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనున్న టీఆర్‌ఎస్ -ఫెడరల్ ఫ్రంట్‌వైపు కారు పయనం
తెలంగాణ గడ్డ మరో ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నది. దేశ రాజకీయాల్లో బలమైన ప్రాంతీయ పార్టీగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటడం ద్వారా దేశ రాజకీయాల్లో తన పాత్రను తనదైన శైలిలో లిఖించబోతున్నది. ఆదివారం ఎన్నికల నగారా మోగడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చ భవిష్యత్ ఫెడరల్ ఫ్రంట్‌పైనే. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. శాసనసభ ఎన్నికల్లో 119 స్థానాలకుగాను 88 నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ స్థానాలకుగాను 16 నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు సన్నద్ధమైంది. అత్యంత సునాయసంగా టీఆర్‌ఎస్ 16 స్థానాలను గెల్చుకోనున్నది.
మిగిలిన ఒక్క స్థానాన్ని కూడా మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం గెల్చుకోనున్నది. దీంతో టీఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు పూర్తిస్థాయిలో మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషించనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలతో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే చర్చలు జరిపారు. అనేక మంది హేమాహేమీ నేతలు సీఎం కేసీఆర్ ఆలోచనలతో ఏకీభవించారు. కలిసివచ్చేందుకు ఆసక్తిచూపారు.

వ్యూహాత్మకంగా ముందుకు.. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్‌ఎస్.. అదే జోరుతో ముందుకు సాగుతున్నది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలు సైతం గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయించిన విషయం తెల్సిందే. సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలకు అండగా ఉండాలని స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఇక టీఆర్‌ఎస్ తన లోక్‌సభ ఎన్నికల లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకున్నది. 16 లోక్‌సభ స్థానాలను గెల్చుకోవడానికి ఇప్పటికే వ్యూహాన్ని రచించింది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనకు శ్రీకారంచుట్టారు. పార్లమెంట్ నియోజకవర్గాలస్థాయి సన్నాహక సమావేశాలను ఏర్పాటుచేశారు.
ఈ సమావేశాలకు పార్టీ శ్రేణుల నుంచి అనూహ్యస్పందన వస్తున్నది. ఒక్కొక్క నియోజకవర్గంలో 30 వేలకు తక్కువ కాకుండా కార్యకర్తలు హాజరవుతున్నారు. ఇక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై సీఎం కేసీఆర్ పూర్తిగా దృష్టిసారించారు. ఇప్పటికే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఒకట్రెండు రోజుల్లోనే అన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. పాతకొత్తల మేలుకలయికగా టీఆర్‌ఎస్ లోక్‌సభ జాబితా ఉండే అవకాశం ఉన్నది. గతంలో ఎంపీలుగా పనిచేసిన బాల్క సుమన్, చామకూర మల్లారెడ్డి వంటివారు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఏర్పడ్డ ఖాళీలను కొత్తవారితో నింపనున్నారు.
మెజార్టీనే లక్ష్యం.. టీఆర్‌ఎస్‌కు 16 స్థానాలను గెల్చుకోవడం నల్లేరుపై నడకే. అందుకే ఈసారి నియోజకవర్గాలవారీగా మెజార్టీ పెంచుకోవడంపై దృష్టిసారించారు. అన్ని నియోజకవర్గాల్లో మెజార్టీని పెంచుకోవడం, ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు గల్లంతు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు.