Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

చంద్రబాబు మరో కుట్ర

తెలంగాణకు ప్రతి విషయంలోనూ అడ్డు తగులుతూ కుట్రలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు మరో కుట్రకు తెరతీశారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన విద్యుత్ ఇవ్వకుండా తెలంగాణ రైతుల ఆత్మహత్యలకు పరోక్షంగా కారణమైన చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులను కూడా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని మండిపడ్డారు.

-పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఏపీ సీఎం లేఖ -హైదరాబాద్‌కు తాగునీరు రాకుండాచేసే యత్నం -చంద్రబాబు కుట్రపై టీ టీడీపీ నేతలు నోరువిప్పాలి -మంత్రి హరీశ్‌రావు డిమాండ్ -బాబును నిలదీయాలని ప్రజలకు పిలుపు

Harish Rao Press Meet

బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచే ఆంధ్రలో పాలన సాగిస్తున్న చంద్రబాబు.. ఇక్కడి ప్రజలకు తాగునీరు రాకుండా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా బేసిన్‌లో ఉన్న హైదరాబాద్‌కు తాగునీరు ఇచ్చేందుకు చేపడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. పర్యాటకరంగంలో ప్రపంచంలోనే హైదరాబాద్‌కు రెండోస్థానం దక్కడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నడు. హైదరాబాద్‌కు తాగునీరు రాకుండా జనం ఇబ్బందులు పడాలని, పారిశ్రామికంగా ఇంకా ఎదగొద్దని, నగర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని విషం చిమ్ముతున్నడు.

ఒకవైపు హైదరాబాద్ అందరిదీ..తెలంగాణ, ఏపీ రెండు కళ్ల లాంటివి అంటూనే కుట్రలు పన్నుతున్నడు. బాబుది విష కౌగిలి. బయటికి చూసేందుకు కౌగిలించుకున్నట్లు కనబడుతది..కానీ వెన్నులో కత్తులు దించుతున్నడు అని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు, పాలకులు హైదరాబాద్‌కు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేయలేదు. మెదక్, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు ఇవ్వాల్సిన మంజీర నీళ్లను నగర అవసరాలకు వాడుతున్నం. అయినా నీటి అవసరాలు తీర్చలేకపోతున్నం. అందుకే కృష్ణా బేసిన్‌లో ఉన్న హైదరాబాద్‌కు కృష్ణానది నీళ్లిచ్చేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 30 టీఎంసీల నీటిని కేటాయించారు.

దీన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ఆ పథకాన్ని ఆపేయాలని కేంద్రానికి లేఖ రాసిండు. కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతి లేదంటున్నడు. మరి హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, ఎస్సార్బీసీ విస్తరణకు అనుమతులున్నాయా? అని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌కు తాగునీళ్లు రాకుండా అడ్డుకొంటున్న బాబుకు నగరంలో ఉండే హక్కులేదన్నారు. హైదరాబాద్‌లోని ప్రజలు, పారిశ్రామికవర్గాలు, ఐటీ ఉద్యోగులంతా చంద్రబాబును నిలదీయాలని పిలుపునిచ్చారు.

బాబు లేఖను టీ టీడీపీ నేతలు ఖండిస్తరా? ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని చంద్రబాబు లేఖ రాయడాన్ని తెలంగాణ టీడీపీ నేతలు ఖండిస్తారో.. సమర్ధిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చేతనైతే చంద్రబాబు నోరు మూయించాలని, లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఏ కోర్టులూ హక్కుదారులకు అన్యాయం చేయవు తెలంగాణ ప్రాజెక్టులకు కృష్ణా బోర్డు, అపెక్స్ కమిటీల అనుమతిలేదని చంద్రబాబు చెబుతున్నారని, ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసునని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఇచ్చిన జీవోల్లో కేటాయించినట్లే తెలంగాణ వాటా నీటిని సాధిస్తామని, ఆ ఉత్తర్వుల ఆధారంగానే తెలంగాణ, ఏపీ నీటి వాటాలను పునఃసమీక్షించాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదిస్తామన్నారు.

ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు ఉందని, న్యాయంగా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఇవ్వాలనే తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఏ న్యాయస్థానాలూ కృష్ణాబేసిన్‌లోని హక్కుదారులకు నీళ్లు ఇయ్యవద్దని చెప్పవన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, పుట్ట పురుషోత్తం, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.