– 2014 ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు – 2019కి బలపడుతామనడం మూర్ఖత్వమే – మూడేండ్లలో పూర్తిస్థాయి విద్యుత్ సరఫరా: ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలంగాణ ప్రాంత ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంగళవారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో అభినందన సభ, ఎర్రుపాలెంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ సభలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికలనాటికి రాష్ట్రంలో టీడీపీలో బలపడుతుందని చం ద్రబాబు జోస్యం చెప్పడం హాస్యాస్పదమన్నారు.
కాదు, 2014 ఎన్నికల్లోనే తెలంగాణలో పచ్చజెండాలకు చోటులేదని ప్రజలు తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. ఇంకా బుద్ధిలేకుండా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే తెలంగాణ దెబ్బ ఎలా ఉందో చంద్రబాబుకు తెలిసిపోయిందన్నారు. అయినా హైదరాబాద్‌లో ఉండి ఇంకా చక్రం తిప్పుతాననడం మూర్ఖత్వమేనన్నారు. నీ ఆటలు తెలంగాణలో చెల్లవ్ బిడ్డ.. జాగ్రత్త.. తెలంగాణ ప్రజల జోలికి వస్తే సహించేది లేదు అని హెచ్చరించారు. సమైక్యరాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పాలనలో కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని బొగ్గు, నీటి వనరులతో ఆంధ్రరాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో జెన్‌కో ఆధ్వర్యంలో 3 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 2017నాటికి రాష్ట్రంలో అన్ని గ్రామాలకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా కల్పిస్తామన్నారు.
సమైక్యాంధ్రప్రదేశ్‌లో నాగార్జునసాగర్ ఎడమ కాల్వను ఎండబెట్టి, కుడి కాల్వకు నీరిచ్చుకున్న ఘనత కాంగ్రెస్, టీడీపీలదేనన్నారు. మరికొద్ది రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరందించే బృహత్తర కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పారు. ఎడమ కాల్వపై లిఫ్టుల నిర్వహణ బాధ్యతను కూడా ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. సమైక్యరాష్ట్రం లో అప్పటి కాంగ్రెస్ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ సాగునీటి రంగానికి రూ.17వేల కోట్లు కేటాయించి, రూ.12 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోయే తొలిబడ్జెట్‌లో అంతకు మూడు రెట్లు అధికంగా కేటాయిచి హరిత తెలంగాణ నిర్మిస్తామన్నారు.
ప్రభుత్వ పథకాలను చూసి ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమాల్లో కొత్తగూడెం ఎమ్మె ల్యే జలగం వెంకట్రావ్, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి నూకల నరేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, ఖమ్మం, మధిర నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఆర్‌జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌బీ బేగ్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, పొలిట్‌బ్యూరో సభ్యుడు తవిడిశెట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు.