Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కారు.. పదహారు

-గులాబీ సైనికులను గెలిపించి ఢిల్లీని శాసిద్దాం -అప్పుడే ఐదేండ్లలో రాష్ర్టానికి అదనంగా లక్ష కోట్లు -దేశవ్యాప్తంగా పడిపోతున్న ప్రధాని నరేంద్రమోదీ గ్రాఫ్ -కాంగ్రెస్ నేతలకు ఎండాకాలంలోనూ చలిజ్వరం -యావత్‌దేశం చూపు ఇప్పుడు తెలంగాణవైపే -సంపద పెంచి.. పేదలకు పంచడమే సీఎం ఎజెండా -టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు -టీఆర్‌ఎస్‌లో చేరిన ఆలేరు, అందోల్ నియోజకవర్గ స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు

రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి, ఢిల్లీని శాసిద్దామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో కీలకపాత్ర పోషించే శక్తి ఉంటే రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు రాబోయే ఐదేండ్లలో లక్ష కోట్లు అదనంగా తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు నినాదంతో లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని చెప్పారు. ఎర్రకోట మీద ఎవరు జాతీయజెండా ఎగురవేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి రావాలన్నారు. ఆలేరు, అందోల్ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మంగళవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ సమక్షంలో పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతున్నదని చెప్పారు. గత ఎన్నికల్లో మోదీ ఏదో చేస్తాడని ప్రజలు నమ్మి ఏకపక్ష మెజార్టీ కట్టబెట్టారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వివరించారు. ఎన్టీయేకు 150-160 సీట్లు మించి రావని, యూపీఏకు 100 వరకు వచ్చే అవకాశముందని చెప్పారు.

ఓట్లతో సద్దికట్టిన తెలంగాణ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మా పెద్ద కొడుకు అంటూ పెద్దమ్మలు, పెద్దయ్యలు ఓటువేశారని, పెండ్లికాని ఆడపిల్లలు కేసీఆర్‌ను తమ మేనమామగా భావించి ఓట్లేశారని చెప్పారు. ఇలా మొత్తం తెలంగాణ సమాజం ఓట్లతో సద్దికట్టి.. 50% ఓట్లు, 75% సీట్లతో కేసీఆర్‌ను తిరిగి సీఎంగా కూర్చోబెట్టిందని అన్నారు. అయినా.. ఇప్పుడు కూడా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నారని కేటీఆర్ చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తమాటల కుమార్‌రెడ్డి అని తెలింది. భట్టి విక్రమార్క వట్టిమాటల విక్రమార్క అని తెలిసిపోయింది. కాంగ్రెస్ కకావికలమైపోయింది. ఆ పార్టీ పెద్ద నేతలు ఓటమిపాలై బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఎండాకాలంలో కూడా కాంగ్రెస్ నాయకులకు చలిజ్వరం పట్టుకున్నది. ఎన్నికలు వస్తున్నాయంటే ప్రజల దగ్గరకు పోవడానికి భయపడుతున్నారు అని కేటీఆర్ ఎద్దేవాచేశారు. వారు కొత్తగా చెప్పడానికి ఏమీలేదని, అందుకే రాబోయేవి ఢిల్లీ ఎన్నికలు.. వీటికి కేసీఆర్‌కు సంబంధంలేదు.. పోటీ రాహుల్, మోదీ మధ్యలోనే అంటూ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత దేశంలోని ప్రాంతీయపార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు కలిసొచ్చే అవకాశముందని, ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగురవేయాలో నిర్ణయించే పరిస్థితిలో మనమే ఉంటామని విశ్వాసం వ్యక్తంచేశారు.

16 మంది గులాబీ సైనికులను ఢిల్లీకి ఎందుకు పంపించాలో క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలను నీతిఆయోగ్ ప్రశంసించి, తెలంగాణకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేస్తే.. 24 పైసలు కూడా ఇవ్వలేదని కేటీఆర్ చెప్పారు. మహారాష్ట్రవాళ్లు అడుగకపోయినా.. మెట్రోరైలు నిర్మాణానికి రూ.17వేల కోట్లు ఇచ్చారని చెప్తూ.. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టే వారికి నిధులు దక్కాయన్నారు. రైల్వేమంత్రిగా మమతాబెనర్జీ ఉన్నప్పుడు సొంత రాష్ట్రమైన బెంగాల్‌కు రైళ్లు తరలించుకున్నారని, లాలూప్రసాద్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అత్తగారి ఊరికి సైతం రైలు వెళ్లిందని చెప్పారు. గుజరాత్‌కు చెందిన మోదీ ప్రధానిగా ఉన్నందునే బుల్లెట్ రైలు ఢిల్లీ నుంచి గుజరాత్ మీదుగా ముంబైకి పోతున్నదన్నారు. రేపు 16 మంది ఎంపీలతో నిర్ణయాత్మక పాత్రలో ఉంటే రూ.24వేల కోట్లు తన్నుకుంటూ రావా? అని ప్రశ్నించారు. ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా అడిగితే కేంద్రం ఇవ్వలేదన్న కేటీఆర్.. 16 మంది ఎంపీలు పార్లమెంట్‌లో ఉంటే జాతీయ హోదా తన్నుకుంటూ రాదా? యాదాద్రికి ఎంఎంటీఎస్ వేగంగా రాదా? ఆలేరు గంధమల్ల పూర్తికాదా? బునాదిగాని కాల్వ పూర్తికాదా? అని ప్రశ్నించారు.

ఆలేరు నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతామని చెప్పారు. ఢిల్లీ నుంచి ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్లు అదనంగా తెచ్చుకోవాలంటే టీఆర్‌ఎస్ ఎంపీలు కీలకమన్నారు. ఎట్టికైనా.. మట్టికైనా మనోడు ఉండాలన్న సామెతను కేటీఆర్ గుర్తుచేశారు. ఢిల్లీలో సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. ఢిల్లీ దర్బారులో గులాంలు వాళ్లు. రాహుల్ ఉస్కో అంటే ఉస్కో.. డిస్కో అంటే డిస్కో అంటూ కాంగ్రెస్ నాయకులను ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటంచేసే కేసీఆర్ సైనికులు, పేగులు తెగేదాకా కొట్లాడే సత్తా ఉన్న గులాబీ బిడ్డలు కావాల్నా? ఢిల్లీకి గులాంలు కావాల్నా? తెలంగాణ సమాజం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

అనేక రాష్ట్రాలు మన పథకాలను కాపీ కొట్టాయి కేసీఆర్ తరహాలో సంక్షేమ సర్కారు నడిపిన నాయకుడు ఇన్నేండ్లలో ఒక్కరైనా ఉన్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెల్లారి లేస్తే ఒంటికాలుపై లేచే చంద్రబాబు.. ఒకప్పుడు వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు మన రైతుబంధును కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ అంటున్నారంటే అది సీఎం కేసీఆర్ పుణ్యమేనని చెప్పారు. ప్రధాని మోదీ సైతం రైతుబంధు కాపీకొట్టి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అని పేరు మార్చి.. కోట్లమంది రైతులకు డబ్బులు ఇస్తున్నారంటే అది మన ఘనత కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ వల్లే దేశవ్యాప్తంగా రైతులకు లాభం జరుగుతున్నదన్న కేటీఆర్.. యావత్ దేశం ఇప్పుడు తెలంగాణవైపు చూస్తున్నదని చెప్పారు.

యాదాద్రిని పట్టించుకోలేదు యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని గతంలో కాంగ్రెస్, టీడీపీ పట్టించుకోలేదని, కానీ సీఎం కేసీఆర్ ఇప్పటికే సుమారు 20సార్లు సందర్శించి.. రూ.2వేల కోట్లతో ఆ ప్రాంత రూపురేఖలు మార్చేస్తున్నారని చెప్పారు. లక్ష్మీనర్సింహస్వామి అక్కడున్నంతవరకు కేసీఆర్ పేరు ఉంటుందన్నారు. గంధమల్లకు, బస్వాపూర్ మధ్యలో బోట్స్ క్లబ్, బృందావన్ గార్డెన్స్ నిర్మాణం చేసుకుందామని చెప్పారు. లక్ష ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. ఎంపీ నర్సయ్యగౌడ్ వేయి కోట్లతో ఎయిమ్స్ తీసుకొచ్చారని చెప్పారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుచేసుకొని, భువనగిరి, ఆలేరు, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్‌లో పరిశ్రమలు నెలకొల్పుకొందామన్నారు. దండుమల్కాపురంలో పారిశ్రామికపార్క్, దాసరిపల్లిలో మరో పార్క్ ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా చెప్పే అందోల్‌లో ప్రజలు 2014 నుంచి టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్ర సంపద పెంచాలి.. దానిని పేదలకు పంచాలన్నదే కేసీఆర్ లక్ష్యమని స్పష్టంచేశారు. గోదావరి, కృష్ణ నదుల్లోని నీటిని ఉపయోగించుకొని తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా తయారుచేసేందుకు సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారని తెలిపారు.

మన సత్తా చాటుదాం: మంత్రి జగదీశ్‌రెడ్డి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్ సత్తా చాటాల్సి అవసరమున్నదని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని 40 గ్రామాల ప్రజలు, కర్ణాటకలో కొన్ని గ్రామాల ప్రజలు వాళ్ల ఊళ్లను తెలంగాణలో కలుపాలని తీర్మానాలు చేస్తున్నారన్న ఆయ న.. ఇదే కేసీఆర్ పాలనకు నిదర్శనమని చెప్పారు. ప్రజలందరు ఏకం కావాలని, దేశానికి కొత్త దశ దిశను చూపించాల్సి ఉందని చెప్పారు. ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ ఎన్నికలంటే ప్రతిపక్షపార్టీలకు వెన్నులో వణుకు పుడుతున్నదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏనాడూ ఎయిమ్స్ గురించి ఆలోచించలేదని విమర్శించారు. భువనగిరికి కేంద్రీ య విద్యాలయం, పాస్‌పోర్ట్ సేవాకేంద్రం ఏర్పాటు చేయించామని గుర్తుచేశారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ పార్టీలో కొత్త పాత అనేది లేకుండా అందరూ కలిసిపోవాలని చెప్పా రు. అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న పథకాలకు అకర్షితులై వివిధ పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందుకొస్తున్నారని అన్నారు.

కార్యక్రమంలో ఎంపీ లింగయ్యయాదవ్, గొంగిడి మహేందర్‌రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గం నుంచి 24 మంది సర్పంచ్‌లు, కాంగ్రెస్ జిల్లా నాయకులు వస్పరి శంకరయ్య, ఇల్లెందుల మల్లేశ్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ ప్రతికంఠం పూర్ణచందర్‌రాజు, మాజీ ఎంపీపీ ప్రతికంఠం హేమలతరాజు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అందోల్ నియోజకవర్గం నుంచి జెడ్పీటీసీ సభ్యులు ముక్తార్, ఎంపీపీలు వెంకట్‌రావు, ఈశ్వరమ్మ, విజయ్‌కుమార్, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పార్టీలో చేరారు.

సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు నినాదంతో లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి. ఎర్రకోట మీద ఎవరు జాతీయజెండా ఎగురవేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి రావాలి. – కేటీఆర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.