ఆహారభద్రత కార్డులు, పెన్షన్ల జారీ ప్రక్రియకు ఎలాంటి గడువు విధించలేదు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. దరఖాస్తులను అధికారులు పరిశీలించి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతో ఉన్న కార్డులను తొలగించి, తెలంగాణ ప్రభుత్వం పేరుతో ఇవ్వడానికే ఈ ప్రక్రియ మొదలుపెట్టాం. రేషన్‌కార్డులు, పెన్షన్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకోనివారు వచ్చే నెలలో దరఖాస్తు చేసుకున్నా అర్హులందరికీ ఆహారభద్రత కార్డులు, పెన్షన్లు అందుతాయిఅని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మంత్రి హామీఇచ్చారు. -పెన్షన్లు, కార్డులు పోతాయని ప్రతిపక్షాల దుష్ప్రచారం -ఒక్కొక్కరికి 6 నుంచి 9 కిలోల బియ్యం ఇచ్చే ఆలోచన -రేషన్ కోటా, పెన్షన్లతో సర్కారుపై రూ.3 వేల కోట్ల భారం -జర్నలిస్టులు, అంగన్‌వాడీలు, వీఆర్‌ఎలకూ ఆహారభద్రతకార్డులు -సాగుకు 6 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం: మంత్రి హరీశ్‌రావు

సోమవారం మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలతో రెండుగంటలపాటు మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేంద్‌రెడ్డి, కలెక్టర్ రాహూల్ బొజ్జా, జేసీ శరత్‌లు పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారుల పరిశీలనలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇబ్బందులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఓ తల్లికి ఇద్దరు కొడుకులున్నారు. ఇద్దరూ తల్లి వద్ద ఉండడం లేదు. ఆమెకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలా..? వద్దా?అని తహశీల్దార్లు అనుమానం వ్యక్తం చేశారు. పెన్షన్ల జారీలో మానవతాదృక్పథంతో వ్యవహరించాలని ఆయన అధికారులకు సూచించారు. అర్హులదరికీ ఆహారభద్రత కార్డులు, పెన్షన్లు అందించాలని సూచించారు.
ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్లకు భయపడం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో పుట్టగతులుండవనే ఆందోళనతోనే ప్రతిపక్షపార్టీలు సర్కారును బద్‌నాం చేయడానికే అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్లకు భయపడబోమన్నా రు. గత ప్రభుత్వాల హయాంలో ఒక్కొక్కరికి 4కిలోల బియ్యం ఇచ్చారని, ఇప్పుడు 6 నుంచి 9 కిలోలు ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. కోటా పెంపుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నామన్నారు.
ఈ పెంపుతో ప్రభుత్వంపై రూ.2వేల కోట్లు, పెన్షన్లు రూ.వెయ్యి, రూ.1500కు పెంపుతో మరో రూ.వెయ్యికోట్ల భారం పడనున్నదని తెలిపారు. మీ ప్రభుత్వాల హయాంలో ఏనాడైనా పేదల కోసం ఆలోచించారా? అని ప్రతిపక్షాలను నిలదీశారు. మ్యానిఫెస్టోలో చేర్చకపోయినా కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ఆహార భద్రత కార్డుల జారీయే సర్కారు పనితీరుకు నిదర్శనమన్నారు. ఓడిపోయిన మూడునెలలకే కాంగ్రెస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవాచేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. రైతులకు కొత్త రుణాలపై బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని చెప్పారు.
ప్రభుత్వ లెక్కల్లోకిరాని అమరులు ఉంటే, అధారాలతో దరఖాస్తు చేసుకుంటే ఆర్థికసాయం అందిస్తామన్నారు. దళితులకు భూ పంపిణీ కోసం భూ సేకరణ కొనసాగుతున్నదని తెలిపారు. వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఇందులో అనుమానమే లేదన్నారు. ఆహార భద్రత కార్డుల విషయంలో విలేకరులను ప్రైవేట్ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు దృష్టికి వచ్చిందని, పత్రికలు, టీవీఛానళ్లలో పనిచేసే కొందరు విలేకరులకు పెద్దగా జీతాలు ఉండవన్నారు. వారికీ ఆహారభద్రత కార్డులు ఇవ్వాలని కలెక్టర్, తహశీల్దార్లను ఆదేశించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, వీఆర్‌ఎలకు కూడా కార్డులు ఇవ్వాలని సూచించారు.