Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

టాప్‌గేర్‌లో కారు

-సొంతబలంతోనే ప్రభుత్వంలోకి .. 63 స్థానాల్లో అఖండ విజయం.. 11 ఎంపీ సీట్లలో విజయకేతనం.. కారు స్పీడ్‌లో కొట్టుకుపోయిన అధికార, ప్రతిపక్ష పార్టీలు.. ఉత్తర దక్షిణాల హద్దులు చెరిపేసిన విజయాలు -భారీ ఆధిక్యతలను సాధించిన అభ్యర్థులు.. అన్నీ తానై నడిపించిన కేసీఆర్.. తారకమంత్రమైన మ్యానిఫెస్టో

తెలంగాణలో కారు టాప్‌గేర్‌లో దూసుకుపోయింది. గులాబీ పార్టీ గుబాళించింది. కేసీఆర్ మాటే మంత్రమైంది. మన రాష్ట్రంలో మనదే పాలన అన్న నినాదం తారకమంత్రమైంది. ఓటరు స్థిర నిశ్చయంతో కులం, మతం, వర్గం, ప్రాంతం అన్నీ విస్మరించి గులాబీ పార్టీని గుండెలకు హత్తుకున్నాడు. ఫలితంగా జిల్లాల ఎల్లలను తుత్తునియలు చేసి తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. టీఆర్‌ఎస్ తుఫాన్‌లో మహామహులంతా మట్టి కరిచారు.

TRS Party Symbol (CAR)

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, బస్వరాజు సారయ్య, శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, విప్ ఆరెపల్లి మోహన్, అనిల్‌ సీనియర్‌నేత షబ్బీర్ అలీ తదితరులంతా పరాజయం పాలయ్యారు. 14 సంవత్సరాలు మొక్కవోని దీక్షతో సాగించిన తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా, తెలంగాణ సాకారానికి కృతజ్ఞతగా, రేపటి తెలంగాణను బంగారు తెలంగాణగా రూపొందించే పార్టీగా టీఆర్‌ఎస్‌ను తెలంగాణ విశ్వసించింది. ఫలితంగా 119 సీట్ల శాసనసభలో టీఆర్‌ఎస్ 63 స్థానాలు దక్కాయి. 17 పార్లమెంటు స్థానాల్లో 11 సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలో ఇతర పార్టీల ప్రమేయం లేకుండా సర్కారు ఏర్పాటు చేయబోతున్నది. పార్టీ అధినేత కేసీఆర్ మెదక్ ఎంపీ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాలు రెండింటా ఘన విజయం సాధించారు.

పార్టీ సీనియర్ నేతలు కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్, హరీష్‌రావు, పోచారంశ్రీనివాసరెడ్డి, కే తారకరామారావు, జితేందర్‌రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితలతో పాటు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, కళాకారుడు రసమయి బాల్‌కిషన్, విద్యార్థి నాయకుడు బాల్కసుమన్, డాక్టర్ల జేఏసీ అధ్యక్షుడు బూర నర్సయ్యగౌడ్, ప్రొ సీతారాం నాయక్‌లతో పాటు కేవీ రంగారెడ్డి మనవడు విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు గెలిచిన వారిలో ఉన్నారు.

అన్ని జిల్లాల్లోనూ విజయాల పరంపర.. జిల్లాల వారీగా చూస్తే నిజామాబాద్ జిల్లాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు, ఒక పార్లమెంట్ సీటును కైవసం చేసుకుంది. అదిలాబాద్ జిల్లాలో ఎంపీ సీటుతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో ఏడింటిలో విజయదుందుభి మోగించింది. కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్ సీట్లు ఉండగా రెండు పార్లమెంట్ సీట్లనూ టీఆర్‌ఎస్ పార్టీనే కైవసం చేసుకుంది. జగిత్యాల మినహా మిగిలిన 12 సీట్లలో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ సీట్లు ఉండగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించింది.

ఇక్కడ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని టీఆర్‌ఎస్ అభ్యర్థి జితేందర్‌రెడ్డి ఓడించారు. 14 అసెంబ్లీ సీట్లు ఉండగా ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. వరంగల్ జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లలో 8 సీట్లలో టీఆర్‌ఎస్ విజయబావుటా ఎగురవేసింది. ఈ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ రెండు పార్లమెంట్ సీట్లు కైవసం చేసుకుంది. నల్గొండ జిల్లాలో కూడా అనూహ్యంగా టీఆర్‌ఎస్ పార్టీ ఆరు అసెంబ్లీ స్థానాలతో పాటు భువనగిరి పార్లమెంట్ సీటును కూడా కైవసం చేసుకుంది. మెదక్ జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్ మినహా మిగిలిన 8 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ సీట్లను కూడా టీఆర్‌ఎస్ పార్టీనే దక్కించుకుంది. ఖమ్మంలో కొత్తగూడెం సీటును దక్కించుకున్న టీఆర్‌ఎస్ మొదటిసారిగా ఖాతా తెరిచింది. రంగారెడ్డిలో మేడ్చల్, తాండూరు, వికారాబాద్, మల్కాజిగిరి సీట్లను కైవసం చేసుకుంది. ఇక హైదరాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసిన టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు 15 వేల మెజార్టీతో విజయం సాధించారు.

ఉత్తర దక్షిణాల గుబాళింపు టీఆర్‌ఎస్ ఉత్తర తెలంగాణ అందునా మూడునాలుగు జిల్లాల పార్టీయే అన్న అపప్రథను మట్టికరిపిస్తూ ఈసారి ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ తేడాలు లేకుండా గులాబీ పార్టీ గుబాళించింది. దక్షిణ తెలంగాణలో టీఆర్‌ఎస్ అనూహ్య ఫలితాలు సాధించింది. గతంలో మెదక్ జిల్లాలో రెండు, మూడు సీట్లకే పరిమితమైన పార్టీ ఈ ఎన్నికల్లో జిల్లాలో 8 సీట్లు సాధించింది. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 సీట్లలో 7 స్థానాలు దక్కించుకుంది.

నల్గొండ జిల్లాలో పోటీ చేసిన 12 సీట్లలో ఆరు సీట్లను కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో నాలుగు సీట్లను దక్కించుకుంది. హైదరాబాద్‌లో ఈసారి భారీ ఓట్లు సాధించినా సికింద్రాబాద్ స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. సినీనటి జయసుధ పరాజయం పాలయ్యారు. ఇక ఉత్తర తెలంగాణలో పార్టీ స్వీప్ చేసింది. ఇక్కడ 54 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 37 స్థానాలను దక్కించుకుంది. దక్షిణ తెలంగాణలో 65 స్థానాలుంటే 26 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడున్న 10 పార్లమెంట్ స్థానాలకుగాను ఐదు స్థానాల్లో విజయం సాధించింది.

సొంత బలంతోనే అధికారంలోకి.. నూతన ప్రభుత్వం విషయంలో అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ ఇతరుల ప్రమేయం లేకుండానే సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన సంఖ్యాబలాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 60 సీట్లు అవసరం కాగా టీఆర్‌ఎస్ పార్టీ 63 అసెంబ్లీ సీట్లను గెలవడంతో ఆ పార్టీకి మరెవ్వరి మద్దతు అవసరం లేకుండానే అధికారంలోకి రానుంది. కారు స్పీడ్‌లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కనుమరుగయ్యాయి. టీఆర్‌ఎస్‌కు వచ్చిన సంఖ్యకు ఈ రెండు పార్టీలు చాలా దూరంలో ఉండటం విశేషం.

కేసీఆర్ వ్యూహ రచన… మలిదశ ఉద్యమం ప్రారంభం నుంచి 2014 లో అధికార పగ్గాలు చేపట్టే దాకా కేసీఆర్ వ్యూహాత్మకంగా కారును పరుగులు పెట్టించారు. ఈ సారి టికెట్ల కేటాయింపుల్లో చూపిన ఆయన ప్రదర్శించిన చాక చక్యం టీఆర్‌ఎస్‌ను గద్దెపై కూర్చోబెట్టాయి. పక్కా ప్రణాళికతో ఆయన ఈ వ్యవహారాన్ని నడిపించారు. ఒంటరి పోరు నిర్ణయమే సగం విజయాన్ని సాధించిపెట్టిందంటే అతిశయోక్తికాదు. తనదైన వాగ్దాటితో ఆయన టీఆర్‌ఎస్ అంటే ఇంటిపార్టీ అని ప్రజలతో అనిపించారు. కాంగ్రెస్‌లో విలీనం కావొద్దని తెలంగాణ ప్రజలే కోరుకున్నారంటే వారు పార్టీని ఏ మేరకు గుండెల్లో నిలుపుకున్నారో అర్థమవుతుంది.

చివరకు తెలంగాణ అపరిష్కత సమస్యలు పరిష్కారం కావాలంటే కేసీఆర్ ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలు ధృఢంగా విశ్వసించారు. అందుకే స్థిరంగా కారుగుర్తుకు ఓటేసి తమ కర్తవ్యం నిర్వహించామని భావించారు. తెలంగాణలోని అంగుళం అంగుళం మీద ఆయనకు ఉన్న అవగాహన, పాలనాపరమైన అంశాల మీద ఆయనకు ఉన్న పట్టు కేసీఆర్‌లో ఒక మంచి పాలకుడిని చూసే అవకాశం ప్రజలకు కలిగింది. నదులు,నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇలా ఏ విషయం మీదనైనా అనర్ఘళంగా మాట్లాడగల ఆయన నేర్పు ఇటు విద్యావంతులను అటు సామాన్యులను కూడా బాగా ఆకర్షించింది. అదే ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది.

హామీలు నమ్మారు… వెంట నడిచారు ఉమ్మడి రాష్ట్రంలో కోల్పోయిన ఆత్మగౌరవాన్ని, బంగారు భవిష్యత్తును తిరిగి తెస్తారన్న నమ్మకమే టీఆర్‌ఎస్ పార్టీని గెలుపు మెట్లు ఎక్కించింది. ప్రజల నాడి పట్టడంలో ఆరితేరిన కేసీఆర్ వారి సమస్యలు తెలుసుకుని వారి ఆశలు, ఆకాంక్షలనే ఎన్నికల మేనిఫెస్టోగా మార్చి ప్రజల్లోకి వెళ్లారు. ఆ మేనిఫెస్టోనే కేసీఆర్ పశుపతాస్త్రంగా ప్రయోగించారు. బలహీన వర్గాలకు రెండు బెడ్‌రూంల ఇల్లు పథకం ఆయన ప్రజలకు వివరించిన తీరు మరొకరికి సాధ్యమయ్యేది కాదు. ఆ పథకాన్ని ఆయన వివరించే తీరు వినడానికే మహిళలు తండోపతండాలుగా ఆయన సభలకు వచ్చేవారంటే దాని ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.

సాగునీరు లేని బీడు భూములకు నీరు అందించేలా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు, రైతు ఆత్మహత్యలకు కారణమైన రుణభారాన్ని రూపుమాపే లక్షలోపు వ్యవసాయ రుణాల మాఫీ, లక్షలాది ఆటోవాలాలకు భారంగా ఉన్న రవాణాపన్ను రద్దు, ఆర్టీఎ అధికారుల వేధింపులనుంచి విముక్తి ఆయన ఆయా సమస్యలపై స్పందించే విధానానికి నిదర్శనం. త్రిశంకు స్వర్గంలో విలవిలలాడుతున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ హామీ,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రప్రభుత్వ ఉద్యోగుల స్కేల్ వారి కళ్లముందు బంగారు భవిష్యత్తును ఆవిష్కరించింది. ఫలితంగా ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా టీఆర్‌ఎస్ వెంట నడిచారని తెలుస్తోంది.

ఇక డ్వాక్రా సంఘాలకు రుణాల పరిమితిని ఐదు లక్షల నుండి 10 లక్షలకు పెంచుతామనే హామీ మహిళల్లోకి వేగంగా దూసుకుపోయింది. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో ఉండేలా వేతనాలు ఇస్తామని కూడా ప్రజలకు హామీలు గుప్పించారు. ఈ హామీలకు తోడు ఉద్యమం గతంలో కూడా టీఆర్‌ఎస్‌ను విజయ తీరాలకు చేర్చాయి. రాష్ట్ర చరిత్రలో మరే ఇతర నాయకుడు చేయని సాహసం… పది రోజుల వ్యవధిలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టిరావడం. రోజుకు 10 సభల చొప్పున ఆయన జరిపిన సుడిగాలి పర్యటనలు ప్రత్యర్థులను విస్తుపోయేలా చేశాయి.

ప్రతి సభలోనూ ఏ అంశం మిస్ కాకుండా ప్రసంగాలకు ఆయన రూపొందించుకున్న సిలబస్ ప్రచార రాజకీయాలకు నిజంగానే కొత్త సిలబస్. తొలుత ఈ ఎన్నికల ప్రాధాన్యతను వివరించడం, తర్వాత టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను ఒకటొకటిగా వివరించడం, ఆ తర్వాత స్థానికసమస్యలను ప్రస్తావించి పాలకపార్టీలను కడిగి పారేయడం, టీఆర్‌ఎస్‌ను గెలిపించే అవసరాన్ని నొక్కి చెప్పడం ఇలా అంతా పద్దతి ప్రకారం ప్రతి సభలోనూ ఆయన ప్రసంగాలు సాగాయి. అవే అంశాలను ఎప్పటికప్పుడు కొత్తకొత్తగా చెప్పడం చమక్కులతో ఆకట్టు కోవడం అదననపు ఆకర్షణలు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.