Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

బీజేపీకి ఓటేస్తే..బతుకు భయమే

-అగ్గిమండే హైదరాబాద్‌ కావాలా.. ప్రశాంత నగరం కావాలా?
-శాంతియుతంగా ఉండటం వల్లనే హైదరాబాద్‌కు పెట్టుబడుల రాక
-రూ.67 వేల కోట్లతో మున్నెన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు
-నగరంలో ఎన్నడూ లేనంతగా వరద
-సాయం కోసం 550 కోట్లు ఇచ్చాం
-ఆ సాయాన్నీ అడ్డుకుంటారా?
-ఇదేమి దిక్కుమాలిన రాజకీయం?
-టీఆర్‌ఎస్‌ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే బతుకు భయంగా మారుతుందని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అగ్గిమండే హైదరాబాద్‌ కావాలా? అభివృద్ధి, ప్రశాంతమైన హైదరాబాద్‌ కావాలా అని ప్రజలను అడుగాలని పార్టీనేతలకు సూచించారు. ఏడేండ్లుగా హైదరాబాద్‌ అన్ని విధాలా ప్రశాంతంగా ఉన్నదని తెలిపారు. అందువల్లే అసాధారణ అభివృద్ధి సాధ్యపడిందని చెప్పారు. బుధవారం తెలంగాణభవన్‌లో పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీపార్టీ, కార్పొరేషన్ల చైర్మన్లు ఇతర నాయకులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. కొట్లాడి తెలంగాణ సాధించే క్రమంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. మనకు పోరాటాలు కొత్త కాదు. అనేక గెలుపోటములను చూశాం.

దేశంలో టీఆర్‌ఎస్‌ పోరాటాలకు స్ఫూర్తి, అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా. మనం రాష్ట్రంకోసం చేసిన పోరాటం.. రాష్ట్ర అభివృద్ధికోసం పడుతున్న ఆరాటాన్ని దేశం గుర్తించింది. ప్రజల్లో మనకున్న ఆదరణ, విశ్వసనీయత మరే ఇతర పార్టీకి లేదు. దీనికి నిదర్శనం వరుస ఎన్నికల్లో మనం గెలుస్తున్న తీరే. అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించినం. మున్సిపాలిటీ ఎన్నికల్లో 130 చైర్మన్లు/మేయర్లను గెలుచుకొన్నం. జెడ్పీచైర్మన్లు కూడా టీఆర్‌ఎస్‌ గెలిచింది. ఇదో అద్భుత ఘట్టం. ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్త టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయాలో విడమరిచి ఓటర్లకు చెప్పాలి. ప్రతి డివిజన్‌కు ఇంచార్జిలను నియమించాం. వీరంతా తొలుత మన పార్టీ స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయంచేసుకోవాలి. సంబంధిత డివిజన్‌లోని ప్రతి కార్యకర్తను ఇన్వాల్వ్‌చేసుకొని ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. ఏరేండ్లుగా మనంచేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరంగా చెప్పాలి.

ఫిబ్రవరిలో మరో ఆరేడు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ
టీఆర్‌ఎస్‌ అన్ని వర్గాలను సమదృష్టితోచూసే పార్టీ. ఇటీవల గవర్నర్‌ కోటాలో ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద గుప్తలను ఎమ్మెల్సీలుగా చేసుకొన్నాం. ఇంకా మన పార్టీలో చాలా మంది కష్టపడి పనిచేస్తున్నవారున్నారు. అందరికీ అవకాశం కల్పిస్తాం. తాడూరి శ్రీనివాస్‌ లాంటివాళ్లకు మనం గతంలో ఎంబీసీ చైర్మన్‌గా ఇవ్వడంతోపాటు ఎంబీసీల కోసం కార్యక్రమాలు చేపట్టాం. కుమ్మరి, పద్మశాలి, నాయీబ్రాహ్మణ.. వంటి కులాలకు కూడా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అక్కర ఉన్నది. వీటిని పరిశీలిస్తాం. పద్మశాలి పెద్ద కులం. వాళ్లకు ప్రతినిధి లేడు. గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ ఉండేవారు. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు.

టీఆర్‌ఎస్‌ పార్టీయే శ్రీరామ రక్ష..
ప్రజలే కేంద్రంగా ఇక్కడ పాలన తెలంగాణకు టీఆర్‌ఎస్‌ పార్టీయే శ్రీరామరక్ష. రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకొన్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నాం. రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. అన్నివర్గాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాం. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌. దీన్ని మనం ప్రజలకు వివరించాలి. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో మనం దేశంలో రెండో స్థానంలో ఉన్నాం. ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్‌ సంస్థలను కాపాడుకొన్నాం. రైతులు, పేదల సంక్షేమానికి అనేకచర్యలు తీసుకొన్నాం. దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలో అమలుచేస్తున్నాం. ప్రజలే కేంద్రంగా ఇక్కడ పాలన సాగుతున్నది. మాది ప్రజల ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం.

రెండు పార్టీలదీ దొందు దొందే
కాంగ్రెస్‌, బీజేపీ రెండూ దేశానికి చేసిన మంచిపనులేమీ లేవు. ఈ రెండు పార్టీల నుంచి దేశం విముక్తి కావాలి. కాంగ్రెస్‌ మంచిగ ఉంటే నక్సలిజం ఎందుకువచ్చేది? బీజేపీ అన్నీచేస్తే నక్సలిజం ఎందుకు పెరిగింది? తీవ్రవాదం ఎందుకు ఉన్నది? యువతలో నిస్పృహ ఎందుకున్నది? 1980 వరకు చైనా జీడీపీ మనకన్న తక్కువ. కానీ, ఇప్పుడు చైనా ప్రపచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగింది. అంటే రెండు పనికిమాలిన పార్టీలవల్లనే మన ప్రజలు నష్టపోయారన్నది కఠిన వాస్తవం. రెండు పార్టీలు కూడా దేశ ప్రజల సంపదను పెంచేందుకు తీసుకున్న చర్యలు ఒక్కటి కూడా లేదు. బడేమియా.. చోటేమియా అన్నట్టున్నది వాళ్ల పరిస్థితి. ప్రపంచ యువకుల్లో 40 శాతం మంది మన దేశంలోనే ఉన్నారు. ఇంత గొప్ప వనరులను మనం సమర్థంగా వాడాలి. మన దేశం అభివృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశమున్నది. దేశానికి మంచి నాయకత్వం కావాలి. దిశానిర్దేశం చేసేలా ఉండాలి. ఇప్పటి విధానాలకు ప్రత్యామ్నాయం కావాలి. దీనికి టీఆర్‌ఎస్‌ చొరవ చూపుతుంది. దేశ రాజకీయాల్లో క్రియాశీలపాత్ర పోషిస్తుంది. దిక్కుమాలిన, పనికిమాలిన సంకుచిత ఆలోచనలతో దేశాన్ని నడిపే శక్తుల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత టీఆర్‌ఎస్‌, తెలంగాణ రాష్ట్రంపై ఉన్నది.

జీహెచ్‌ఎంసీలో చేసిన పనిని చెప్పండి..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మనం ప్రజలకేం చేశామో వివరించాలి. కార్మికులకు జీతాలు పెంచాం. 67 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లండి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డివిజన్ల బాధ్యతలు తీసుకున్నవారందరూ పోలింగ్‌ ముగిసేవరకు రాత్రింబవళ్లు కష్టపడాల్సిందే.

వరదసాయంపై బీజేపీ బురద రాజకీయం
నగరంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు పడ్డాయి. ఒక్కరోజే 30 సెంటీమీటర్లు కూడా పడ్డరోజులున్నాయి. కాలనీలకు కాలనీలే నీళ్లలో ఉన్నాయి. పాపం కొంత మంది ఇండ్లలో బియ్యం, ఉప్పు, పప్పు కూడా తడిచిపోయింది. పిల్లల స్కూళ్ల సర్టిఫికెట్లు కూడా తడిసిపోయినయ్‌. వాళ్లను చూస్తే నాకు చాలా బాధనిపించింది. కొందరి ఇండ్లలో మంచం మునిగేంత నీళ్లు.. వాళ్ల బాధలు వర్ణనాతీతం. చాలా చోట్ల నిరుపేదలే ఎక్కువమంది ఉన్నారు. వాళ్లను ఆదుకోవడం మన బాధ్యత అనిపించింది. నన్ను ఎవరూ అడగకపోయినా వరద బాధితుల కోసం ప్రతి కుటుంబానికి పదివేలు ఇవ్వాలని నిర్ణయించిన. సీఎంఆర్‌ఎఫ్‌లోని నిధుల నుంచి 550 కోట్లను దీనికోసమే కేటాయించిన. దీంట్లో 50 కోట్లు తక్షణ మరమ్మతులకు కేటాయించాం. మిగిలిన 500 కోట్లను వరద బాధితులకు ఇవ్వాలని సీఎస్‌ గారిని కోరిన. అయిదులక్షల కుటుంబాల వరకు నష్టపోయినట్టు అధికారులు అంచనావేశారు. అందరికీ సహాయం ఇవ్వాలనుకొన్నాం. అవసరమైతే ఇంకో రెండుమూడు వందల కోట్లు దీనికోసమే కేటాయించాలని భావించాం. మీ సేవా కేంద్రాల్లోనే 2.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. లక్షా 67 వేల మందికి మనం ఇప్పటికే సహాయం అందించాం. కానీ, ఎన్నికల సంఘం ఇప్పుడు దీన్ని ఆపాలని చెప్పింది. దీనికి కూడా బీజేపీనే కారణం.

అమ్మ ఇవ్వదు.. అడుక్కు తిననివ్వదు
సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌ను మనం నిధులు ఇవ్వమని అడిగితే, వరద సహాయం చెయ్యమంటే చేయలేదు. మనం అడిగితే ఇవ్వకపోగా ఇచ్చినట్టు బీజేపీ నేతలు దొంగమాటలు చెప్తున్నారు. ఈ విషయాన్ని మనం బస్తీల్లో చెప్పాలి. ఇది వంచన. ఇంతకన్న ఘోరం ఏముంటుంది? ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నది ఫ్యాక్ట్‌. జీఎస్టీ, ఇతర రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన నిధులను ఇవ్వకపోగా మనం అక్కడో ఇక్కడో సర్దుబాటు చేసుకొని పేదలకు రూ.10వేల చొప్పున వరద సహాయాన్ని ఇస్తుంటే కాళ్లలో కట్టెపెట్టినట్టు ఆపేశారు. మనం ఇంకో 100-200 కోట్లు అయినా ఇద్దామనుకుంటే చిల్లర రాజకీయంచేసింది బీజేపీ. ప్రజల నోటికాడి కూడు ఎత్తగొట్టేలాచేసింది. ఇది బాధాకరం.

సోషల్‌ మీడియా పేరుతో దిక్కుమాలిన ప్రచారం
బీజేపీ సోషల్‌మీడియా పేరుతో దిక్కుమాలిన ప్రచారం చేస్తున్నది. దుబ్బాకలో అట్లనే చేసిండ్రు. మన అభ్యర్ధి సుజాత ఓటేయడానికి వెళ్లి హరీశ్‌రావు బొమ్మలేదా అని అడిగినట్టు కూడా చిత్రీకరించారు. మహిళను నానారకాలుగా హేళనచేసేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. వీటన్నింటికీ మనం జవాబు చెప్పాలి. టీఆర్‌ఎస్‌కు అన్నిరకాల శక్తియుక్తులున్నాయి. సోషల్‌ మీడియా పేరుతో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. వాళ్ల నిజస్వరూపాన్ని దేశం ముందు నిలబెట్టాలి.

మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్‌
హైదరాబాద్‌ మతసామరస్యానికి ప్రతీక. ఏడేండ్లుగా ఇక్కడ ఒక్క మతఘర్షణ లేదు. ఏదో కొన్ని సందర్భాల్లో కొందరు చేతకాని నాయకుల వల్ల అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. కానీ, దేశంలో మననగరం ప్రశాంత జీవనానికి నిలయం. ఉపాధి, పరిశ్రమల రంగానికి పెట్టింది పేరు. ఇటీవల అమెజాన్‌ సంస్థ 21 వేల కోట్ల అతిపెద్ద పెట్టుబడిని మన నగరంలో పెట్టింది. రాష్ట్రం వచ్చాక రెండు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్‌ను మనం మంచిగ తయారుచేసుకొన్నం.

శాంతిభద్రతలు లేకపోతే పెట్టుబడి పెట్టేవారు రారు. అభివృద్ధి ఆగిపోతుంది. నగరంలో ఓట్లకోసం వెళ్లినపుడు ప్రజలకు ఇవన్నీ విడమరిచి చెప్పాలి. అగ్గిమండే సమాజం కావాలా? అభివృద్ధి కోరుకొనే సమాజం కావాలా అన్నది ప్రశ్నించాలి. తెలంగాణ వచ్చాక మనంచేసిన అద్భుత అభివృద్ధిని వివరించాలి. దేశంముందు మనం నగుబాటు కావొద్దు. హైదరాబాద్‌వాసులంటే గర్వంగా ఉండే పరిస్థితి కొనసాగాలి. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి.
-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.