Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

బీజేపీ ఎంపీలు తెచ్చిందేంటి?

-ఎన్నికల వేళ లెక్కలేనన్ని వాగ్దానాలు
-బాండు పేపర్లు.. బండెడు హామీలు
-పసుపు బోర్డు తెస్తానని ప్రగల్భాలు
-నిధుల వరద పారుతుందని గప్పాలు
-తుపాకీ రాముళ్ల అవతారాల్లో మాయ
-మూడేండ్లలో ఎంపీలుగా చేసింది లేదు
-కేంద్రం నుంచి నిధులు తెచ్చిందీ లేదు
-మరి ఈ కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లోనైనా వీళ్లు నిధులు తెస్తారా? మోదీ ఇస్తారా?

కేంద్రంలో ఓ జాతీయ పార్టీ అధికారంలో ఉన్నది. దానికి రాష్ట్రంలో ఓ నలుగురు ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వారిలో ఒకరు కేంద్ర క్యాబినెట్‌ మంత్రి హోదా అనుభవిస్తుంటారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎన్నికలొస్తే చాలు.. వీళ్లు మైకు వదలరు. నోటికొచ్చినవన్నీ మాట్లాడతారు. వాగ్దానాలు గుప్పిస్తారు. వీరికి తోడు తమ కేంద్ర నాయకులను విమానాల్లో వరుసబెట్టి ఒకరి వెంట ఒకరిని దింపుతారు. ఆ వచ్చిన వాళ్లు చిత్తం వచ్చిన హామీలన్నీ ఇచ్చిపోతారు. ఇందుకు ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికలే ఉదాహరణ.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైతే.. ఇంటికి ఇల్లు.. కారుకు కారు.. బండికి బండి ఇచ్చేస్తానంటూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ ప్రజలు మరచిపోలేదు.

ఒకాయనేమో.. గెలిస్తే అయిదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానంటాడు. మరొకాయన నేనే మంత్రిని.. నేను చేయగలిగింది లేదా? ఏదంటే అది తెస్తానంటాడు. ఇంకొకాయనేమో.. ముందు నోటికొచ్చిందేమిటో అనేద్దాం.. చేసిన్నాటి సంగతి కదా.. అనుకొంటాడు. మరో ప్రజాప్రతినిధి.. కేంద్రం నుంచి నిధుల వరద ఉప్పొంగుతుందంటాడు. తుపాకీ రాముళ్లలా.. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హామీలు గుప్పించడం ఫ్రీయే కదా పోయేదేముందని చేసేస్తారు. అమలు దగ్గరకు వచ్చేసరికి ముఖం చాటేస్తారు. గత మూడేండ్లలో కేంద్రంలో అధికార పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ ఎంపీలు రాష్ట్రానికి కానీ, తమ నియోజకవర్గానికి కానీ ఒక్కటంటే ఒక్క రూపాయి తెచ్చిన దాఖలా కనిపించదు.

తీరా ఇదేమిటయ్యా బండికి బండి ఎట్లా ఇస్తావు అని అడిగితే.. ఇన్సూరెన్సు ఉంటది కదా.. అదిప్పిస్తా అన్నారు. ఇది ఒక ఉదాహరణే. వీళ్లు వాగ్దానాలు మాత్రమే చేస్తారు. అంతకుమించి ఏమీ చేయరు. చేయలేరు కూడా. వీళ్లను నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. పార్లమెంట్‌ ఎన్నికలు జరిగి మూడేండ్లు అయింది. మూడో బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెడుతున్నది. ఇప్పటివరకు వీళ్లు రాష్ట్రానికి రూపాయి తెచ్చింది లేదు. కనీసం వాళ్ల నియోజకవర్గానికైనా నిధులు తెచ్చుకోగలిగారా అంటే అదీ లేదు. ఒక్కటంటే ఒక్క జాతీయ సంస్థను సాధించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ బడ్జెట్‌ వస్తున్నది. రాష్ట్రం మాట సరేసరి.. వాళ్ల నియోజకవర్గాలకైనా ఈ బడ్జెట్‌లోనైనా నిధులు తెచ్చుకోగలరా? – నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌

ధర్మపురి అర్వింద్‌

–హోదా: ఎంపీ, నిజామాబాద్‌, పార్టీ: బీజేపీ

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు

ఎంపీగా గెలిస్తే.. ఐదు రోజుల వ్యవధిలో పసుపుబోర్డు తెస్తా.. అలా అని బాండ్‌ పేపర్‌ రాసిస్తున్నా.
పసుపు మద్దతుధర క్వింటాలుకు రూ.15 వేలు ఇప్పిస్తా..
చెరుకు రైతులను ఆదుకొంటా, ఇథనాల్‌ పరిశ్రమలు తెప్పిస్తా

వాటి పరిస్థితి:
పార్లమెంట్‌ ఎన్నికలప్పుడు నియోజకవర్గంలో అత్యంత ముఖ్యమైన డిమాండ్‌ అయిన పసుపుబోర్డు విషయంలో ధర్మపురి అర్వింద్‌. ఇచ్చిన హామీ సూపర్‌. గెలిచిన ఐదు రోజుల వ్యవధిలోనే నిజామాబాద్‌కు పసుపుబోర్డు తెస్తానని హామీ ఇచ్చారు. ఏకంగా బాండ్‌పేపర్‌పై రాసిచ్చారు. ప్రజలూ నమ్మారు. ఎంపీగా ఎన్నికై మూడేండ్లయింది. పసుపుబోర్డును కేంద్రం ఇవ్వనన్నది. వరంగల్‌లో ఉన్న స్పైసెస్‌ బోర్డు ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసును నిజామాబాద్‌కు తరలించారు. ఇంతకుమించి చేసిందేమీ లేదు. పసుపుబోర్డు కోసం మొదట్నుంచీ.. మాజీ ఎంపీ కవిత పార్లమెంట్‌ లోపలా.. బయటా కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. అర్వింద్‌ ఓ బాండ్‌పేపర్‌ను జనం ముందు ప్రదర్శనకు ఉంచి.. ఇప్పుడు హాయిగా జారుకొన్నారు. పసుపు మద్దతుధర క్వింటాలుకు రూ.15 వేలు ఇప్పిస్తానని గప్పాలు కొట్టారు. ఇప్పుడు కనీసం రూ.6,500 కూడా లేదు. ఎర్రజొన్నకేమో రూ.3 వేలు ఇప్పిస్తానన్నారు. కనీసం ఆ దిశగా ప్రయత్నమైనా చేయలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలకు ప్రైవేట్‌ షుగర్‌ ప్యాక్టరీలను తెస్తానన్న గొప్పలకైతే అంతే లేదు. ఒక్కటంటే ఒక్కటి రాలేదు. ఇక ఇథనాల్‌ పరిశ్రమలు తెచ్చి వేల మందికి ఉపాధి కల్పిస్తామన్న మాట కూడా ఆయన రాసిచ్చిన బాండ్‌ పేపర్‌ మాదిరిగానే మిగిలిపోయింది. కరీంనగర్‌, నిజామాబాద్‌ నియోజకవర్గాలకు బీజేపీ నేతలే ఎంపీలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరి ఆదిలాబాద్‌-ఆర్మూర్‌.. బీదర్‌-బోధన్‌ రైల్వే లైన్‌ గురించి ఒక్క ముక్క అయినా కేంద్రం దగ్గర మాట్లాడింది లేదు.. రూపాయి తెచ్చిందీ లేదు. హామీలపై వివరణకు నమస్తే తెలంగాణ ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు.

బండి సంజయ్‌ కుమార్‌

-హోదా: ఎంపీ, కరీంనగర్‌, పార్టీ: బీజేపీ

గెలవటం కోసం బండి సంజయ్‌ ప్రజలకు ఇచ్చిన హామీలు
-కరీంనగర్‌కు ట్రిపుల్‌ ఐటీ, కరీంనగర్‌-కాజీపేట రైల్వేలైన్‌
-మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌, జాతీయ రహదారుల నిర్మాణం

వాటి పరిస్థితి:
బండి సంజయ్‌కుమార్‌.. కరీంనగర్‌కు ఎంపీ మాత్రమే కాదు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. అడ్డిమారిగుడ్డిదెబ్బగా ఎంపీగా గెలిచిన ఈ నాయకుడికి నోటి వదురు తప్ప.. నియోజకవర్గ ప్రగతి అంటే ఏమిటో తెలియదన్న విమర్శలున్నాయి. మైకు దొరికితే టీఆర్‌ఎస్‌పైనా, సీఎం కేసీఆర్‌పైనా నోటికొచ్చినట్టల్లా మాట్లాడుడు. తర్వాత పార్టీ పెద్దలు తిడితే నాలుక కర్చుకోవుడు! ఇంతకుమించి నియోజకవర్గానికో, రాష్ట్ర రాజధానికో, రాష్ట్రానికో మేలు చేసే పని మచ్చుకు కూడా కనిపించదు. కరీంనగర్‌లో ట్రిపుల్‌ఐటీకి అన్ని వసతులు కల్పిస్తామని కేసీఆర్‌ స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. ఈ ఎంపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. కరీంనగర్‌-కాజీపేట రైల్వే లైన్‌కు గత మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ రూ.కోటి మంజూరుచేయించి డీపీఆర్‌ నివేదికకు బాట వేస్తే.. ఆ తదుపరి ఆ విషయాన్ని పట్టించుకున్నది లేదు. సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్లస్టర్‌ కోసం మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు కోరినా స్పందించడం లేదు. కొత్త ప్రాజెక్టులు సరే.. కేంద్రం అంగీకరించి, అమలుచేయని ప్రాజెక్టులపైనా నోరెత్తడం లేదు. వినోద్‌కుమార్‌ ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణలోనే కరీంనగర్‌ను జాతీయ రహదారుల జంక్షన్‌ చేయాలన్న లక్ష్యంతో పనిచేశారు. ఆ మేరకు అనేక ఎన్‌హెచ్‌లకు అనుమతులు తెప్పించారు. సంజయ్‌ మాత్రం అనుమతులు వచ్చిన వాటినైనా అమలు చేయించడం లేదు.

అనుమతులు వచ్చి, అమలుకాని వాటిలో కొన్ని..
-కరీంనగర్‌- సిరిసిల్ల- ఎల్లారెడ్డి-పిట్లం 164 కిలోమీటర్ల ఎన్‌హెచ్‌.
-ఎన్‌హెచ్‌ జంక్షన్‌ 353 సీ నుంచి భూపాల్‌పల్లి- అంశాన్‌ పల్లి- గొర్లవీడు, నేరేడ్‌పల్లి- గర్మిళ్లపల్లి-బూరపల్లి- ఎమ్పెడ్‌-వావిలాల- జమ్మికుంట-వీణవంక-కరీంనగర్‌.. 131 కి.మీ. జాతీయ రహదారి.
-సిరిసిల్ల-సిద్దిపేట- దుద్దెడ రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా నంబర్‌ 365బీగా ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 16న సమాచారాన్నిచ్చిన కేంద్రం.
మెదక్‌-సిద్దిపేట- ఎల్కతుర్తి 133 కి.మీ. ఎన్‌హెచ్‌.
-జాతీయ రహదారుల హబ్‌గా కరీంనగర్‌ను తీర్చిదిద్దేందుకు నాలుగు జాతీయ రహదారుల పనుల పర్యవేక్షణకోసం 2016లో ఎస్‌ఈ కార్యాలయాన్ని వినోద్‌కుమార్‌ పట్టుబట్టి ఏర్పాటుచేయించారు. కానీ, ఇప్పుడు నేడు పనులు లేక తరలిపోయే పరిస్థితి ఏర్పడింది.
-ఎన్‌హెచ్‌ఏఐ నంబర్‌ 563 కరీంనగర్‌- వరంగల్‌ జాతీయ రహదారి మరమ్మతుకు నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు ప్రతిపాదనలు పంపినా కేంద్రం మొండిచెయ్యి చూపడంతో.. సీఎంతో మాట్లాడి మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు ఇప్పించి మరమ్మతులు చేయించాల్సి వచ్చింది.
-భారత్‌ మాల జాబితాలోకి కరీంనగర్‌- వేములవాడ-సిరిసిల్ల-పిట్లం రోడ్‌ను చేర్చుతామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గతేడాది హామీ ఇచ్చారు. అలాగే కరీంనగర్‌- చల్లూరు-టేకుమట్ల- భూపాలపల్లి రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. కానీ, నేటివరకు అతీగతీ లేదు. కరీంనగర్‌ ఎంపీగా నియోజకవర్గానికి కేంద్రం నుంచి సాధించి పెట్టిన అంశాలు ఏమన్నా ఉన్నాయేమోనని ఆయనకు నమస్తే తెలంగాణ సంప్రదించేందుకు ప్రయత్నిస్తే.. అవకాశం ఇవ్వలేదు.

గంగపురం కిషన్‌రెడ్డి

–హోదా: కేంద్ర టూరిజం శాఖ మంత్రి

ఎన్నికల్లో కిషన్‌రెడ్డి ఇచ్చిన హామీలు
ఎంపీగా గెలిపిస్తే సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కావలిదారులా ఉంటా.
రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్‌, కాలుష్య సమస్యలను పరిష్కరిస్తా.
నా నియోజకవర్గం దేశంలోని వివిధ భాషలకు, ప్రాంతాలకు చెందిన వారికి నిలయం. వారి సమగ్రాభివృద్ధికి నిరంతరం పనిచేస్తా.
పార్లమెంటేరియన్‌గా చేయాల్సిందంతా చేస్తా. ప్రజలు నా దగ్గరికి రావటానికి వెనుకాడకుండా చూసుకొంటా. ప్రజల ప్రతి సమస్యను పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్తా.

వాటి పరిస్థితి:
ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు సరికదా.. సికింద్రాబాద్‌ను పూర్తిగా మర్చిపోయారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో రక్షణశాఖ అధికారులు రోడ్లను మూసివేసి, స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినా స్పందించలేదు. పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఇప్పటికి చాలాసార్లు రక్షణమంత్రికి పలు లేఖలు రాశారు. కిషన్‌రెడ్డిని స్వయంగా వేదికపై బహిరంగంగానే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కానీ తన నియోజకవర్గం పరిధిలో ప్రజల ఇబ్బందులు కేంద్ర మంత్రికి చీమకుట్టినట్టయినా అనిపించడంలేదు. గెలిచి రెండేండ్లు దాటినా ఏ సమస్యా పరిష్కారం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించటానికి, అసత్య ఆరోపణలకు పరిమితమయ్యారు. కేంద్ర మంత్రి మండలిలో సహాయమంత్రి పదవి తప్ప క్యాబినెట్‌ హోదా రావడం.. ముఖ్యంగా మన ప్రాంతానికి రావడం చాలా అరుదైన సందర్భం. గతంలో జైపాల్‌రెడ్డి.. అంతకుముందు దశాబ్దాల క్రితం కోట్ల, పీవీ వంటి వేళ్లమీద లెక్కించదగ్గ సంఖ్యలో క్యాబినెట్‌ హోదా వచ్చింది. బీజేపీలో బండారు దత్తాత్రేయ మంత్రి అయినా ఎలాంటి అధికారాలు లేని సహాయమంత్రిగానే ఉండిపోయారు. కిషన్‌రెడ్డికి అత్యంత అరుదుగా క్యాబినెట్‌ హోదా లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రానికి లబ్ధి చేకూర్చాల్సిన కిషన్‌రెడ్డి.. కనీసం ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు కూడా అనిపించదు. ఎంతసేపూ హైదరాబాద్‌లోనే ఉంటూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీఆర్‌ఎస్‌ను నిందించడం.. తప్పుడు, అవాస్తవ ప్రచారాలు చేయడం తప్ప ఆయన చేసిందేమీ లేదు. తన మంత్రిత్వశాఖ అయిన పర్యాటక శాఖ పరిధిలోనైనా హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చేయూతనివ్వడం ఆయన చేతిలో పని. అది కూడా చేయకపోవడం దారుణం. దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం. కనీసం దానికి జాతీయ పండుగ హోదా కల్పించడానికైనా కిషన్‌రెడ్డికి ఎందుకు మనసురావడంలేదు? కిషన్‌రెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించిన వెంటనే.. మంత్రులు, అధికారులు.. ఆయన్ను కలిసి రాష్ట్రానికి కావాల్సిన వాటి గురించి వినతిపత్రాలు ఇచ్చారు. ఏ తమిళనాడుకో, కర్ణాటకకో చెందిన నేతకు ఇలాంటి అవకాశాలు వస్తే.. ఆ శాఖనుంచి మొదటి రోజు నుంచే నిధుల వరద పారేది. కానీ.. కిషన్‌రెడ్డి క్యాబినెట్‌ హోదాలో ఉన్నప్పటికీ.. రాష్ట్రానికి చేసింది సున్నా.. ఇక నియోజకవర్గం గురించి ఏం చెప్పగలం? ఈ విషయాల్లో వివరణ కోసం నమస్తే తెలంగాణ ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.

సోయం బాపూరావు

-హోదా: ఎంపీ, ఆదిలాబాద్‌, పార్టీ: బీజేపీ

గెలవటం కోసం సోయం బాపూరావు ప్రజలకు ఇచ్చిన హామీలు
-ఆదిలాబాద్‌ సిమెంట్‌ పరిశ్రమ పునఃప్రారంభానికి కృషి చేస్తా.
-ఆదిలాబాద్‌-ఆర్మూర్‌ రైల్వే లైన్‌ కోసం అవసరమయ్యే రూ.2,700 కోట్లు కేంద్రం నుంచి తీసుకొస్తా.
-ఆదిలాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయానికి పక్కా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తా.
-ఆదిలాబాద్‌ జిల్లాలో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఒప్పించి, ఉపాధి కల్పిస్తా.

వాటి పరిస్థితి:
ఏ ఒక్క హామీ నెరవేర్చింది లేదు. సీసీఐని తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఇప్పటికే అనేకమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. తాజాగా మరో లేఖ కూడా రాశారు. స్థానిక ఎంపీ అయి ఉండి.. తన నియోజకవర్గ ప్రజానీకానికి మేలు జరుగుతుందని తెలిసి కూడా సోయం బాపూరావు సీసీఐ కోసం ప్రయత్నమైనా చేసింది లేదు. ఆదిలాబాద్‌-ఆర్మూర్‌ రైల్వే లైన్‌, కేంద్రీయ విద్యాలయ రానేలేదు. ఒక్క నవోదయ స్కూల్‌ను కూడా మంజూరు చేయించుకోలేని పరిస్థితి. ఆదిలాబాద్‌-ఆర్మూర్‌ రైల్వేలైన్‌కు రూ.2700 ఖర్చవుతుందని అంచనాలు కూడా వేశారు. ఏటా కేంద్ర బడ్జెట్‌ రావడం.. నిధులు ఇవ్వకపోవడం.. ప్రజలు ఉసూరుమనడం కామన్‌ అయిపోయింది. కేంద్రీయ విద్యాలయానిది దీనగాథ. స్థలమిస్తే నిధులిస్తామని కేంద్రం తెలిపింది. పదెకరాల స్థలాన్ని కూడా సేకరించారు. కేంద్రం మాత్రం రూపాయి విదల్చలేదు. వీటిపై ఎంపీ స్పందనకు ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు.

ఘునందన్‌రావు

-హోదా: ఎమ్మెల్యే, దుబ్బాక, పార్టీ: బీజేపీ

దుబ్బాక ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలు
-ప్రతి నిరుద్యోగికి రూ.3వేల నిరుద్యోగ భృతి.
-చేనేత, బీడీ కార్మికులకు నెలకు 3 వేల చొప్పున పింఛన్‌.
-గజ్వేల్‌ నుంచి మిరుదొడ్డి మీదుగా దుబ్బాకకు రైల్వే లైన్‌.
-నియోజకవర్గంలో ప్రతి రైతుకు జోడు ఎడ్లు, ఒక నాగలి.
-రైతులకు ప్రతి పంటకు ఎరువులు.
-ఉచిత కార్పొరేట్‌ పాఠశాల, కార్పొరేట్‌ దవాఖాన.
-నిరుద్యోగులకు, మహిళలకు ప్రతి మండలంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు.
-దుబ్బాక పట్టణానికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు. మిరుదొడ్డి, చేగుంటలో డిగ్రీ కళాశాలలు.
-నూతన పరిశ్రమల ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన.
-గల్ఫ్‌కు వలస వెళ్లిన వారి కోసం ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు.
-దుబ్బాకలో కేంద్ర ప్రభుత్వ నిధులతో టెక్స్‌టైల్‌ పార్కు. చేనేతకు పూర్వవైభవం .
-సిద్దిపేట, గజ్వేల్‌కు దీటుగా దుబ్బాకను నిలిపి ప్రపంచస్థాయి గుర్తింపు.

వాటి పరిస్థితి:
ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిపైనే అయింది. ప్రచార సమయంలో లిఖితపూర్వకంగా ఒక మ్యానిఫెస్టోను ఈ ఎమ్మెల్యే ప్రజలకిచ్చారు. ఇందులో ఏ ఒక్క హామీ నెరవేరలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రతినిధిగా ఏవైనా నిధులు తెచ్చారా అంటే రూపాయి కనిపించదు. గతంలో మంజూరైన అభివృద్ధి పనులకు మాత్రం తగుదునమ్మా అని రిబ్బన్‌ కట్‌ చేస్తున్నారు. ఇచ్చిన హామీలు, అమలు చేసినవాటి గురించి తెలుసుకునేందుకు నమస్తే తెలంగాణ ప్రయత్నించగా రఘునందన్‌రావు పత్తా లేరు.బీజేపీ ఎంపీలు తెచ్చిందేంటి?

ఈటల రాజేందర్‌

– హోదా: ఎమ్మెల్యే, హుజూరాబాద్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలు
-గెలిపిస్తే కేంద్ర నిధుల వరద పారిస్తా.
-వివిధ కేంద్ర పథకాలు హుజూరాబాద్‌లో.
-నియోజకవర్గ పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్ల అభివృద్ధి, రైల్‌ ఓవర్‌ బ్రిడ్జీలు, అండర్‌ బ్రిడ్జీల నిర్మాణం, జమ్మికుంట రైల్వేస్టేషన్‌ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు.
-వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం ప్రత్యేక కార్యక్రమం. కనీస మద్దతు ధర ఇప్పించేలా చర్యలు.
-కేంద్ర వ్యవసాయ పథకాలతో అర్హులైన రైతులందరికీ సాయం.
-60 ఏండ్లు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు పీఎం కిసాన్‌ మస్ధన్‌ యోజన ద్వారా నెలకు రూ.3 వేల పింఛన్‌ ఇప్పిస్తా.
-నిరుద్యోగుల ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కోసం ఆయా మండలాల్లో పీఎంఈజీపీ అమలు.
-పీఎంకేవైఏ, ముద్ర రుణాలు తదితర పథకాలతో యువతను ఆదుకొంటా.
-విద్యారంగ అభివృద్ధి కోసం కృషిచేస్తా. దేశ, విదేశాల్లో చదవాలనుకొనే విద్యార్థులను ‘విద్యాలక్ష్మి పథకం‘తో ఆదుకొంటా.
-మహిళల అభ్యున్నతి కోసం ‘పీఎం ఉద్యోగిని యోజన’ అమలు చేయిస్తా.
-దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, అనాథ పిల్లలను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పథకాల లబ్ధి చేకూర్చేలా చేస్తా.
-నియోజకవర్గంలో శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ అమలు చేసేందుకు కృషిచేస్తా.
-కేంద్ర ప్రభుత్వ సహకారంతో హుజురాబాద్‌, జమ్మికుంట పట్టణాలను సుందరీకరిస్తా.
-గ్రామీణ, మండల ప్రాంతాల అభివృద్ధికి ఆర్థిక సంఘం, ఉపాధి హామీ నిధులతో మరింత అభివృద్ధి కార్యక్రమాలకు చర్యలు తీసుకొంటా.
-పక్కా రోడ్లు లేని గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన కింద రోడ్లు నిర్మిస్తా.
-కేంద్ర ప్రభుత్వ ‘క్రిషి సించాయి యోజన‘ కింద కాల్వల మరమ్మతులకు నిధులు మంజూరు చేయిస్తా.
-నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తా.

వాటి పరిస్థితి:
లిస్టు చూస్తే చాంతాడంత కనిపిస్తుంది. గెలిచినప్పటి నుంచి ఒక్కటంటే ఒక్క హామీ అమలుకు తొలి అడుగు కూడా పడలేదు. కేంద్రం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిచేస్తానన్న మాట నిలబెట్టుకొనే దిశగా ఒక్క పనీలేదు.
ఇచ్చిన హామీల అమలుకు చేస్తున్న కృషిని తెలుసుకునేందుకు నమస్తే తెలంగాణ ప్రయత్నించగా.. ఫోన్‌ కూడా ఎత్తలేదు.

రాజాసింగ్‌

–హోదా: ఎమ్మెల్యే, పార్టీ: బీజేపీ

2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు
-బస్తీల్లోనే ఉండి, ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తా.
-హిందీనగర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పనులు పూర్తిచేయిస్తా.
-మురికివాడల్లోని సమస్యలు తీరుస్తా.
-సీతారాంబాగ్‌ నుంచి కిస్తీ చమాన్‌ రహదారిలో డ్రైనేజీ సమస్య లేకుండా చేస్తా.
-ధూల్‌పేట ప్రజల సమస్యలు తీరుస్తా.

వాటి పరిస్థితి:
ఇందులో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ప్రజాదర్బార్‌లు ఏమైనాయో తెలియదు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పనులు ఎక్కడికక్కడే ఉండిపోయాయి. స్థానిక సమస్యలనైతే.. పట్టించుకొన్న పాపాన పోలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార సమయంలో పెద్ద ఎత్తున బీజేపీ జాతీయ నేతలు పొలోమని వచ్చి ఇచ్చిన హామీలన్నీ గాల్లో కలిసిపోయాయి. ఎన్నికల తరువాత ఆ హామీలలో కొన్నింటినైనా ఎమ్మెల్యేగా అమలు చేయించగలిగారా అంటే అదీ లేదు. బీజేపీ జాతీయ నేతలు ముఖం చాటేసినట్లే.. బీజేపీ స్థానిక ఎమ్మెల్యే కూడా ముఖం చాటేశారు. ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలు చేశారో తెలుసుకునేందుకు నమస్తే తెలంగాణ ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.