-అబద్ధాల ప్రచారంలో ఆరితేరిన బీజేపీ -నల్లధనం తెస్తామని నల్లచట్టాలు తెచ్చారు -బీజేపీ అసమర్థ విధానాల వల్లే దేశం దివాలా -కమలనాథులూ వీటికి సమాధానమివ్వండి -యాభై ప్రశ్నలను సంధించిన మంత్రి కేటీఆర్ -కేంద్రంపై అడుగడుగునా చార్జ్‌షీట్లు వేయాలి -చార్మినార్, గోల్కొండ కోటలను అమ్మేస్తారు -మా ప్రత్యర్థి ముమ్మాటికీ ఎంఐఎం పార్టీనే -టీఆర్‌ఎస్ మహిళదే మేయర్ పీఠం -మీడియాతో ఐటీశాఖ మంత్రి కేటీఆర్

పెట్టుబడుల ఉపసంహరణనే విధానంగా పెట్టుకున్న బీజేపీ.. అవకాశం వస్తే హైదరాబాద్‌లో చార్మినార్, గోల్కొండ కోటను కూడా అమ్మేస్తుందని, జీహెచ్‌ఎంసీనీ ప్రైవేట్ పరం చేస్తుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీ అసమర్థ, అవివేక విధానాలతోనే దేశఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని ఆరోపించారు. ఆ పార్టీ అసత్య ప్రచారానికి అవధుల్లేకుండా పోతున్నదని మండిపడ్డారు. బీజేపీ నేతలు గోబెల్స్ కజిన్ బ్రదర్స్‌లాగా, గోబెల్స్ డైరీ మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థి ఎంఐఎం పార్టీ మాత్రమేనని, ముమ్మాటికీ జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠం టీఆర్‌ఎస్‌దేనని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ దేశ, విదేశాలను ఆకట్టుకునేలా పాలన సాగిస్తున్నారని అన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తదితరులతో కలిసి మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై 50 ప్రశ్నలు సంధించి.. వాటికి దమ్ముంటే సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్న వివిధ అంశాలు ఆయన మాటల్లోనే..
అసత్యాలు, పచ్చి అబద్ధాలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు గత కొంతకాలంగా గోబెల్స్ కజిన్స్‌లా మాట్లాడుతున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అసత్యాలు, పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోఉన్న ఎంపీల నుంచి మొదలుపెడితే కేంద్రమంత్రుల దాకా ఒక అబద్ధ్దాన్ని వందసార్లు చెప్తే నిజమైపోతుందన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యనే ప్రకాశ్ జవదేకర్ చార్జ్‌షీట్ పేరిట గోబెల్స్ పర్సనల్ డైరీని విడుదల చేశారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న ఆయన దానిని విడుదల చేసే సమయంలో కనీసం దానిని చూడాలి కదా. అందులో టీఆర్‌ఎస్-ఎంఐఎం ప్రభుత్వం అని ఉంటే అలాగే విడుదల చేస్తారా? కొంతైనా ఇంగితజ్ఞానం ఉండాలి. రాష్ట్రంలో ఉన్నది టీఆర్‌ఎస్ సర్కార్ మాత్రమే. మేం ఎవరితోనూ అధికారంలో భాగస్వాములం కాదు. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎంను కలిపి విడుదల చేశారంటే వారి ఉద్దేశమేమిటో గండ్లనే బయటపడ్డది. జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదులతో పొత్తుపెట్టుకున్నది మీరు. పీడీపీతో కలిసి ఊరేగింది మీరు. టీఆర్‌ఎస్, ఎంఐఎం సర్కార్ వైఫల్యం అని చెప్పడంద్వారా మీకు ఈ రాష్ట్రంలోని ముస్లింలపై ఉన్న ద్వేషం ఉందో.. దేశంలోని ముస్లింల మీద విద్వేషం ఎంతఉందో అర్థమయింది. తప్పుపేరు పెట్టడంలోనే బీజేపీ తప్పులో కాలేసింది. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకోవాలి.
ఆరేండ్లలోనే అభివృద్ధి బాటలో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్వల్ప వ్యవధిలోనే అన్నిరంగాల్లో ప్రగతి పథాన దూసుకుపోతున్నది. 2001లో ఎన్డీయే ఏర్పాటుచేసిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరఖండ్ రాష్ర్టాలు ఇంకా బాలారిష్టాల్లోనే ఉంటే ఆరేండ్లలోనే తెలంగాణ అసాధారణమైన ప్రగతిని సాధించింది. ఈ ఆరేండ్లలో ఢిల్లీలో మీరు అధికారంలోఉన్నరు. హైదరాబాద్‌లో మేం ఉన్నం. హైదరాబాద్‌లో మేమేంచేసినమో వంద చెప్తాం. ప్రగతి నివేదిక ఇప్పటికే విడుదల చేసినం. ఎన్నివేల కోట్ల రూపాయలు ఖర్చుచేసినమో చెపుతాం. ఎక్కడికిపోయినా మేం ఏంచేసినమో చెప్పినం. మీరుచెప్పండి. హైదరాబాద్‌కు, తెలంగాణకు కేంద్రప్రభుత్వం ఒక్కరూపాయి పనైనా చేసిందా? సూటిగా సమాధానం చెప్పండి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, అంబేద్కర్‌రాసిన రాజ్యాంగం సాక్షిగా.. మాకు రావల్సిన దానికంటే ఒక్కరూపాయి అదనంగా ఇచ్చారా?
ఎవరి భవిష్యత్ కోసం ప్రభుత్వసంస్థల అమ్మకం వేల కోట్ల ఆదాయం వస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను అడ్డికిపావుసేరులా అమ్ముతున్నది మీరు కాదా? నష్టాల్లో ఉన్నది కాబట్టి ఎయిర్‌ఇండియాను అమ్మినం అంటున్నరు.. మరి లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్మినట్టు? మహారత్న కంపెనీలు, నవరత్న కంపెనీలు.. లాభమున్నదా? నష్టమున్నదా అని చూడకుండా గుడ్డిగా అమ్మేయటమేనా మీ విధానం. బీపీసీఎల్‌ను ఎందుకు అమ్ముతున్నరు? ప్రపంచంలోనే నాలుగోస్థానంలో ఉన్న రైల్వేస్‌ని ఎందుకు అమ్ముతున్నరు? 40 కోట్ల పాలసీలున్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నరు? దేశ భవిష్యత్ కోసం అమ్ముతున్నమని కిషన్‌రెడ్డి అంటున్నరు. ఏ దేశ భవిష్యత్ కోసం అమ్ముతున్నరు. భారత భవిష్యత్ కోసమా? లేక గుజరాత్‌లోని కొంతమంది భవిష్యత్ కోసమా? బీజేపీ పాలసీయే అన్నింటినీ అమ్ముకోవడం. వీళ్లకు అవకాశమిస్తే చార్మినార్, గోల్కొండనూ అమ్ముతరు. జీహెచ్‌ఎంసీని ప్రైవేట్‌పరం చేసినా చేస్తరు. ప్రజలూ తస్మాత్ జాగ్రత్త.
మాకు పోటీ ఎంఐఎంతోనే.. టీఆర్‌ఎస్‌కు పోటీ అంటూ ఉన్నదంటే అది ఎంఐఎంతోనే. గతఎన్నికల్లో మజ్లిస్‌పార్టీ రెండోస్థానంలో ఉన్నది. ఈసారి కూడా అదే ఉంటది కావచ్చు. లాస్ట్‌టైమ్ ఎంఐఎం సీట్లను కూడా మేమే గెలుచుకున్నం. ఈసారి అంతకంటే ఎక్కువే గెలుస్తాం. మాకు ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టీఆర్‌ఎస్ సింగిల్‌గానే తలపడుతుంది. ముమ్మాటికీ మేయర్‌పీఠాన్ని అధిష్టించేది టీఆర్‌ఎస్ మహిళా అభ్యర్థే. మూడోస్థానం ఎవరిదో అనేది వాళ్లే తేల్చుకోవాలి. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తది. పీడీపీతో పొత్తుపెట్టుకున్నది బీజేపోళ్లు. మాది కమిట్‌మెంట్.. కటౌట్ కాదు.
ప్రపంచంలోనే నాలుగోస్థానంలో ఉన్న రైల్వేస్, 40 కోట్ల పాలసీలున్న ఎల్‌ఐసీ, బీపీసీఎల్‌ను కేంద్రం ఎందుకు అమ్ముతున్నది. దేశ భవిష్యత్ కోసం అమ్ముతున్నమని కిషన్‌రెడ్డి అంటున్నరు. ఏ దేశ భవిష్యత్ కోసం అమ్ముతున్నరు. భారత భవిష్యత్ కోసమా? లేక గుజరాత్‌లోని కొంతమంది భవిష్యత్ కోసమా? బీజేపీ పాలసీయే అన్నింటినీ అమ్ముకోవడం. అవకాశమిస్తే చార్మినార్, గోల్కొండనూ అమ్ముతరు. జీహెచ్‌ఎంసీని ప్రైవేట్‌పరం చేస్తరు.
మాపై ఎందుకు చార్జ్‌షీట్? తెలంగాణలో అభివృద్ధిలో సాగుతున్నందుకా.. కరువు భూములను తడుపుతున్నందుకా.. తెలంగాణను కోటిన్నర ఎకరాల మాగాణం చేసినందుకా? మాపై ఎందుకువేయాలి చార్జ్‌షీట్? 98.31 శాతం ఇంటింటికీ తెలంగాణ ప్రభుత్వం నీళ్లిస్తున్నదని ఒకవైపు మీ ఆదీనంలో కేంద్రమంత్రిత్వశాఖ చెప్తుంటే.. తాగునీటి పంపిణీలో తెలంగాణ దేశంలో నంబర్‌వన్ అని సాక్షాత్తూ కేంద్రమంత్రి షెకావత్ పేర్కొంటే.. ఈ ప్రకాశ్ జవదేకర్ సిగ్గులేకుండా చార్జ్‌షీట్ వేస్తారా? ప్రపంచంలోనే ఎవరి బుర్రకూ తట్టని విధంగా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం పెడితే దానిని కాపీకొట్టి పీఎం కిసాన్ అని పేరుపెట్టి మా మీద స్ఫూర్తి పొంది బొంకినందుకా? రైతుబీమాతో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి చేయని రీతిగా రైతులను ఆదుకున్నందుకా? తెలంగాణ పురిటినొప్పులతో ఉన్న సమయంలోనే ఖమ్మం నుంచీ సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలిపినా రాష్ట్రంలో కరెంట్ కష్టాలు తీర్చినందుకా? బీజేపీ పాలితరాష్ర్టాల్లో లేనివిధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకా? అభాగ్యులకు పింఛన్‌ను రూ.200 నుంచి రూ.2,000లు చేసినందుకా? వృద్ధులు, ఒంటరి మహిళలు ఇలా సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేనివిధంగా రూ. 50వేల కోట్లతో ఆదుకుంటున్నందుకా? కేసీఆర్ కిట్లతో తెలంగాణలో శిశు మరణాల రేటు తగ్గిందని సాక్షాత్తు కేంద్ర మంత్రి హర్షవర్దన్ ప్రకటించినందుకా? వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నందుకా? వేలాది మంది విద్యార్థులు గురుకురాల్లో విద్యనందిస్తున్నందుకా? ఓవర్సీస్ స్కాలర్‌షిప్పులు ఇస్తూ పేదవిద్యార్థులను విదేశాల్లో చదువుకొనే అవకాశం కల్పించినందుకా? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్, ఆపిల్, గూగుల్. ఫేస్‌బుక్ వంటి సంస్థలు తమ రెండో కార్యక్షేత్రాన్ని హైదరాబాద్‌ను మలచుకునేలా చేసినందుకా? హైదరాబాద్‌లో ఐదు లక్షల కెమెరాలు పెట్టి శాంతిభద్రతల్ని పర్యవేక్షిస్తునందుకా? గల్లీగల్లీలో బస్తీ దవాఖానలు పెట్టినందుకా? అన్నార్థులకు ఐదు రూపాయలకే అన్నం పెడుతున్నందుకా? హైదరారాబాద్‌లో పేకాట క్లబ్లులు లేకుండా, గుడుంబా గబ్బులేకుండా.. ఉగ్రవాదులకు స్థానం లేకుండా.. ఈ ఆరేండ్లల్లో కర్ఫ్యూ పెట్టనందుకా? గోకుల్‌చాట్, లుంబిని పార్కు పేలుళ్లను మరిపించి ప్రజలను శాంతియుతంగా ముందుకు తీస్కపోతున్నందుకా? మామీద ఎందుకు చార్జ్‌షీట్.
బీజేపీ నేతలూ.. ఈ ప్రశ్నలకు బదులేదీ? పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ బీజేపీ నేతలు తెలంగాణపై అవిషం చిమ్ముతున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశం దివాలా తీసిందని పేర్కొన్నారు. తెలంగాణపట్ల తీవ్రమైన వివక్ష చూపుతున్నదని, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్‌కు ఒక్కపైసా సాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీటన్నింటిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలంటూ మంత్రి కేటీఆర్ 50 ప్రశ్నలను సంధించారు..ఆ ప్రశ్నలివి..
జాతీయాంశాలు.. 1) వేలకోట్లు సమకూర్చే ప్రభుత్వసంస్థలను అమ్ముతున్నరా? లేదా? 2) నాలుగో అతిపెద్ద ఇండియన్ రైల్వేను ప్రైవేటీకరిస్తున్నరు కదా? 3) 40కోట్ల పాలసీదారులున్న ఎల్‌ఐసీని అమ్మేందుకు యత్నించడం లేదా? 4) ఏటా రెండుకోట్ల ఉద్యోగాలిస్తామని ఆరేండ్లుగా దగాచేయడం లేదా? 5) అసమర్థలాక్‌డౌన్‌తో లక్షలమంది ఉపాధిని ఆగం చేయలేదా? 6) పరుగులుపెట్టే ఆర్థికవ్యవస్థను అసమర్థవిధానాలతో నడ్డి విరచలేదా? 7) కరోనాకు ముందే 8 క్వార్టర్స్‌పాటు ఆర్థికరంగాన్ని దెబ్బతీయలేదా? 8) 24శాతమున్న జీడీపీని ఆల్‌టైమ్ దిగువకు తీసుకువెళ్లలేదా? 9) లాక్‌డౌన్‌లో వలసకార్మికులను మండేఎండల్లో నడిపించలేదా? 10) కూలీల నుంచి నిర్దయగా రైల్వేటికెట్ల పేరిట పైసలు పిండుకోలేదా? 11) 20లక్షల కోట్ల ప్యాకేజీఅంటూ ప్రయోజనమివ్వని మాటలు చెప్పలేదా? 12) జన్‌ధన్ ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామంటూ మోసం చేయడం లేదా? 13) విదేశాల నుంచి నల్లధనం తెస్తామన్న హామీకి పక్కన పడేయలేదా? 14) జీఎస్టీతో వ్యాపారుల వెన్ను విరిచింది వాస్తవం కాదా? 15) పెద్దనోట్ల రద్దుతో ఆర్థికవ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసింది మీరేకదా? 16) బంగ్లాదేశ్, శ్రీలంకకంటే తక్కువవృద్ధికి ఆర్థికవ్యవస్థను దిగజార్చలేదా? 17) ఎంఎస్‌ఎంఈ సెక్టార్లని కోలుకోని విధంగా దెబ్బతీసింది మీరు కాదా? 18) బలమైన బ్యాంకింగ్ వ్యవస్థను భ్రష్టుపట్టించలేదా? 19) బ్యాంకులను నట్టేట ముంచినవారిని దేశం దాటించలేదా? 20) లక్షలమంది ఖాతాదారులు, ఉద్యోగులను ఆగం చేయలేదా? 21) కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను పట్టించుకోనిది మీరు కాదా? 22) వేర్పాటువాద పార్టీలతో పదువులు పంచుకున్నది మీపార్టీ కాదా? 23) రైతుల నడ్డి విరిచే నల్లచట్టాలు తెచ్చింది మీరు కాదా? 24) కార్పొరేట్ వ్యవసాయానికి ద్వారాలు తెరవడం లేదా? 25) హథ్రాస్‌లో ఆడబిడ్డకు అంతిమసంస్కారమూ దక్కకుండా చేయలేదా? 26) క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్ రేటు దాదాపు రెట్టింపు చేయలేదా?
తెలంగాణ.. 27) తెలంగాణ ఏర్పడగానే ఏడుమండలాలను లాక్కుని ఏపీలో కలుపలేదా? 28) లోయర్‌సీలేరు ప్రాజెక్టును తెలంగాణకు దక్కకుండా చేయలేదా? 29) విభజన చట్టం హామీలను తుంగలో తొక్కింది మీరు కాదా? 30) ప్రత్యేక పన్ను రాయితీలు ఇవ్వాలన్న హామీలను మరిచిపోలేదా? 31) బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఉసురుతీస్తున్నది మీరు కాదా? 32) కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వనిది మీరు కాదా? 33) నీతిఅయోగ్ చెప్పినా మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథకు నిధులిచ్చారా? 34) ఐఐఎం, ఐసర్ వంటి సంస్థలు కేటాయించకుండా ఆపడం లేదా? 35) కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపడం లేదా? 36) గిరిజన బిడ్డల కోసం ట్రైబర్ యూనివర్సిటీని మంజూరు చేస్తున్నారా? 37) కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కొర్రీలు పెట్టింది మీరు కాదా? 38) 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినా ప్రత్యేక గ్రాంటును ఎగ్గొట్టలేదా? 39) నవోదయాలను కూడా ఇవ్వని దయలేని ప్రభుత్వం మీది కాదా? 40) బోరు బావులకు మీటర్లు పెట్టేందుకు సిద్ధం కావడం లేదా? 41) సన్నాలకు అదనపు మద్దతు ధర రాకుండా పరిమితులు పెట్టడంలేదా? 42) రాష్ర్టానికి రావాల్సిన జీఎస్టీ పన్ను బకాయిలను ఎగొట్టడంలేదా?
హైదరాబాద్ 43) ఆరేండ్లలో హైదరాబాద్‌కు అదనంగా ఒక్కపైసా అయినా ఇచ్చారా? 44) లక్షలమంది యువత ఉపాధిని హరిస్తూ ఐటీఐఆర్‌ను రద్దు చేయలేదా? 45) వరదసాయం కోసం లేఖరాస్తే నేటికీ అణాపైసా ఇవ్వనిది నిజం కాదా? 46) మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకకు వందల కోట్లు ఇచ్చింది మీరేకదా? 47) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను తన్నుకుపోయింది మీరు కాదా? 48) నమామి గంగేకు వేల కోట్లిచ్చి మూసీకి మొండిచేయి చూపలేదా? 49) బీహెచ్‌ఎఈఎల్, మిధానీ రక్షణసంస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్నరు కాదా? 50) కంటోన్మెంట్‌స్థలం ఇవ్వకుండా స్కైవేల నిర్మాణాన్ని అడ్డుకోవడం లేదా?