Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

భిక్షకాదు మా హక్కు

-కేంద్రం నిధుల్లో రాష్ర్టాలకు వాటా లేదా?
-కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరిమాన్యాలే
-కాంగ్రెస్‌ పాలనపై విసుగుతోనే బీజేపీకి అధికారం
-దేశాన్ని పాలించడంలో రెండుపార్టీలూ అట్టర్‌ఫ్లాప్‌
-ఏది చెప్తే అది నమ్మడానికి చదువురాని వాళ్లం కాదు
-కేంద్రంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫైర్‌

రాష్ట్రంలో పన్నులు వసూలుచేసే బాధ్యత మాత్రమే కేంద్రానిది.. ఆ పన్నుల్లో రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సిందేనని సీఎం కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. కేంద్రం రాష్ర్టాలకు ఇచ్చేది భిక్ష కాదని.. రాజ్యాంగం రాష్ర్టాలకు కల్పించిన హక్కుఅని పేర్కొన్నారు. నాడు సీఎస్టీ పేరుతో కాంగ్రెస్‌.. నేడు జీఎస్టీ పేరుతో బీజేపీ వాస్తవంగా రాష్ర్టాలకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని విమర్శించారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ర్టానికి కేంద్రం ఇచ్చే నిధుల అంశంలో బీజేపీ నేతల విమర్శలపై ఘాటుగా స్పందించారు. యాభై, అరవై ఏండ్ల తర్వాత.. అదీ కాంగ్రెస్‌ పాలనపై విసుగుతో కేంద్రంలో బీజేపీకి ప్రజలు అవకాశమిచ్చారు కానీ.. ప్రేమతో కాదని వ్యాఖ్యా నించారు. లేకలేక వచ్చిన ఆ అవకాశాన్ని కూడా బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించారు.

దేశాన్ని పాలించడంలో కాంగ్రెస్‌, బీజేపీ రెండూ అట్టర్‌ప్లాప్‌ అయ్యాయన్నారు. దేశంలో పన్నుల పద్ధతి, వాటిని ఎవరు వసూలు చేయాలనే అంశాలను రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని సీఎం తెలిపారు. ఐటీ వంటి పన్నులు వసూలు చేసే బాధ్యతను కేంద్రానికి కల్పించిందని, వసూలయిన పన్నుల్లో రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సిందేనని సూచించారన్నారు. అయితే రాష్ర్టాలకు వాటా ఇవ్వడంలో కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాలు మొదట్నుంచీ మోసం చేస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. జీఎస్టీ నష్టపరిహారం, ఐజీఎస్టీ బకాయిలు ఇవ్వడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని.. సరైన సమయంలో ఇవ్వడం లేదని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే వీటితోనే ప్రతిరాష్ట్రం ఉద్యోగుల వేతనాలు, ఇతరత్రా అత్యవసర నిధులకు వాడుకుంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు.

కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరగిరిమాన్యాలే..
కేంద్రం సరిగా, సరైన సమయంలో విధులు విడుదల చేయకపోవడంతో రాష్ర్టాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. కేంద్రం నుంచి వచ్చే బకాయిలు, జీఎస్టీ రిటర్న్స్‌పై ఆశలు పెట్టుకుంటే శంకరగిరి మాన్యాలే దిక్కవుతుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన విధం గా రాష్ర్టానికి రావాల్సిన రూ.3,900 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం వెనుకాడుతున్నదన్నారు. కానీ. రూ.1,400 కోట్ల అప్పు తీసుకోవాలని సలహా ఇస్తూ మనచేతులు మన నెత్తిపైనే పెడుతున్నదని మండిపడ్డారు. ఐదేండ్లుగా కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏటా రూ.10 వేల కోట్లు దాటలేదన్నారు. కొన్నినిధులను కేంద్రం నేరుగా రాష్ర్టాల్లో వినియోగించడం సాధ్యం కాదని.. నరేగా, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ తదితర నిధులను రాష్ట్రప్రభుత్వంతో కలిసే ఖర్చు చేస్తుందన్నారు. దీనిలో 70:30 శాతం లేదా 60: 40శాతంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చుచేయాలని, దీనికోసం రాష్ట్రప్రభుత్వం తరఫున యూసీలు, నివేదికలన్నీ ఇస్తేనే తిరిగి ఇస్తారన్నారు.

మన దగ్గర నుంచి వసూలుచేసిన వాటిల్లోనే రాష్ర్టాలకు నిధులు ఇస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలని, కేంద్రం దయాదాక్షిణ్యంతో ఇవ్వడంలేదని సూచించారు. దేశాన్ని భ్రమింపజేసే పిచ్చి ప్రయత్నంలో కాంగ్రెస్‌ ఉండేదని, ప్రస్తుతం బీజేపీ దాని తాతలా మారిందని ఎద్దేవాచేశారు. దేశాన్ని సాకే ఐదు రాష్ర్టాల్లో తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో ఉంటుందని చెప్పారు. రూ.50 వేల కోట్లకుపైగా పన్నులు రాష్ట్రం నుంచిపోతే.. కేంద్రం నుంచి వచ్చే అన్నిరకాల పన్నుల వాటా కలిపినా రూ.24 వేల కోట్లు దాటదన్నారు. రాజ్యాంగంలో ట్యాక్స్‌ అనేదానికి ఒక పద్ధతి, విభజన అనేవి ఉంటాయని.. కేంద్రం ఏదో ఇస్తుందని, ఏదేదో చేస్తుందని ఇష్టంవచ్చినట్టు చెప్పితే నమ్మడానికి మనది చదువురాని రాష్ట్రం కాదని మండిపడ్డారు. బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు మానుకోవాలని హితవుపలికారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదని, ఏదైనా ఇచ్చి నా అది రాష్ట్ర ప్రజల సొమ్మేనని, ఆకాశం నుంచి రావడం లేదని స్పష్టంచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.