-ఆయన ఉన్నారనే.. రాష్ర్టానికి పెట్టుబడులు -ఆయన వల్లనే ప్రశాంతంగా హైదరాబాద్ -జీహెచ్‌ఎంసీలో ఈసారి సెంచరీ ఖాయం -బీజేపీ నేతలకు దమ్ముంటే హైదరాబాద్ అభివృద్ధికి లక్ష కోట్లు తేవాలి -మంచినీటి గోస తీర్చినం.. కరెంట్ సమస్యను అధిగమించినం -హైదరాబాద్ ప్రగతి నివేదిక విడుదల సందర్భంగా మంత్రి కేటీఆర్

తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆరే భరోసా అని పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు అన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నారనే ధీమాతోనే పెట్టుబడులు వస్తున్నాయని.. ఆయన దార్శనికత వల్లనే హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నదని చెప్పారు. హైదరాబాద్‌లో విభజన రాజకీయాలు కావాలా.. విశ్వాస రాజకీయాలు కావాలా.. విద్వేషపూరిత రాజకీయాలు కావాలా.. ప్రశాంత ప్రగతి కావాలా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. సామాజిక న్యాయాన్ని.. టీఆర్‌ఎస్ మాటల్లో కాకుండా చేతల్లో చూపిందన్నారు. అందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సీట్లు ఇవ్వటమే తార్కాణమని పేర్కొన్నారు.
హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుందని, హైదరాబాద్ ప్రగతిని సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు. ప్రజల్ని రెచ్చగొట్టి వారి ప్రశాంత జీవితాన్ని చెదరగొట్టడం ద్వారా పబ్బం గడపాలనిచూసే పార్టీలకు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సెంచరీ కొట్టుడు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పెద్ద పెద్ద మాటలు చెప్తున్న బీజేపీ నేతలు దమ్ముంటే కేంద్రంలో ఉన్న తమ పార్టీ ప్రభుత్వం నుంచి హైదరాబాద్ అభివృద్ధికోసం లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకొనిరావాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆరేండ్లలో హైదరాబాద్ సాధించిన అభివృద్ధిపై ప్రగతి నివేదిక విడుదలచేశారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు గెలుపుపై నిర్దేశంచేశారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే…
60 లక్షల మంది సైనికులున్న పార్టీ టీఆర్‌ఎస్ 60 లక్షల మంది గులాబీ సైనికులున్న పార్టీ. అందరికీ అవకాశాలు రావు. అవకాశాలు వచ్చిన వారు తామే గొప్ప అనే భావనతో ఉండకూడదు. వందల కార్యకర్తల్లో ఏ ఒక్కరికో అవకాశం దక్కుతుంది. అభ్యర్థులుగా అవకాశం వచ్చినవారు.. మీమీ డివిజన్లలో టికెట్ కోసం మీలాగే పోటీపడ్డ ఆశావహుల ఇంటికి ముందుగా పోవాలి. వారి సంపూర్ణ సహకారం కావాలని కోరండి. కడుపుల తలపెట్టండి. పార్టీ అవకాశం నాకిచ్చింది. మీకు భవిష్యత్‌లో మంచిరోజులు వస్తాయి. నేను కూడా సహకరిస్తానని వారికి నచ్చచెప్పి.. వారు మీతో ఎల్లప్పుడు ఉండేవిధంగా బతిమిలాడండి. ఎందుకంటే వందలమంది కష్టపడితేనే ఒక నాయకుడు అవుతాడు. వేలమంది కార్యకర్తలు కష్టపడితేనే నేను సిరిసిల్లలో ఎమ్మెల్యేను అయ్యాను. ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. టికెట్ వచ్చింది కాబట్టే నేనే గొప్ప అని, విజయగర్వంతో ఊగిపోకుండా మీ డివిజన్‌లోని ఆశావహుల సహకారం తీసుకోండి. అది మీ బాధ్యత. అంతేకాదు సమయంలేదు. ఇంకా పది రోజులే గడువుంది. అభ్యర్థులు అందరూ రేపు ఉదయం బీ-ఫాములు సమర్పించి కార్యక్షేత్రంలో దిగండి. ప్రజల ఆశీర్వాదం తీసుకోండి.
టీఆర్‌ఎస్ ఏం చేసిందో ప్రజలకు వివరించండి హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఏం చేసింది? ఎన్ని బ్రిడ్జిలు కట్టినం. ఎన్ని రోడ్లు వేసినం. మంచినీళ్లు ఎట్లా తెచ్చినం. కరెంట్ ఎట్లా బాగుచేసినం. ఎన్ని పార్కులు కట్టినం. ఎన్ని పబ్లిక్ టాయిలెట్లు కట్టినం. బస్తీ దవాఖాన్లు ఎన్ని తెచ్చినం. కేసీఆర్ కిట్లెన్నిచ్చినం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఎందరికిచ్చినం. మెట్రోరైల్‌కు ఎంత ఖర్చుచేసినం. ఏ రంగంలో ఎంత ఖర్చుచేసినం అనే విషయాన్ని ప్రజలకు వివరించాలి. మనం చేసిన ప్రగతిని ప్రజలకు నివేదించాలి. డివిజన్లలో ఏం చేశామో చెప్పాలి. ఒక్కో డివిజన్లలో దాదాపు వంద నుంచి 140 కోట్లు కూడా ఖర్చుచేసినం అవన్నీ చెప్పాలి. ఇది స్థానిక ఎన్నిక. స్థానికంగా ఏం చేసినమో చెప్తూనే హైదరాబాద్ నగరాభివృద్దికి ఏం చేసినమో చెప్పాల్సిన బాధ్యత మనందరిమీద ఉన్నది.
కరెంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం కరెంట్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారంలో రెండురోజులు పవర్ హాలీడే ఉండేది. సూరారం, చెర్లపల్లి, జీడిమెట్ల మొదలైన పారిశ్రామికవాడలు.. ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, జిరాక్స్ సెంటర్లు.. ఇలా కరెంట్ మీద ఆధారపడిన వేలు, లక్షల కుటుంబాలు మూడు పూటలా తిండికి నోచుకోక, ఉపాధి ప్రశ్నార్థకమై జీవనం సాగించే పరిస్థితి ఉండేది. విద్యార్థులకైతే పరీక్షా సమయల్లో కరెంట్ కోసం క్షణక్షణం పరీక్షే ఉండేది. ఇప్పుడా పరిస్థితి ఉన్నదా? 24 గంటలు నాణ్యమైన, నిరంతరాయమైన కరెంట్ సరఫరా చేస్తూ పారిశ్రామిక పురోగతికి తోడ్పాటు అందించిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది.
ఆరేండ్లుగా ప్రశాంతత నేను అబిడ్స్‌లో చదువుకొనే రోజుల్లో వారం పది రోజులు స్కూల్ బందే ఉండేది. సంవత్సరానికి పక్కాగా వారం పది రోజులు స్కూల్ బంద్ ఉండేది. ఎందుకురా అంటే పాతబస్తీలో లొల్లి అయిందట. కర్ఫ్యూ పెట్టారట. కాబట్టి స్కూల్ బంద్ ఉండేది. ఆరేండ్లుగా కేసీఆర్ వచ్చిన తరువాత హైదరాబాద్‌లో గతంలోలాగా పేకాట క్లబ్బుల్లేవు. గుడుంబా అడ్డాల్లేవు. అల్లరిలేదు. లొల్లి లేదు. కేసీఆర్ వచ్చిన తరువాత. తెలంగాణ వచ్చిన తరువాత మతకల్లోలాల్లేవు. లుంబిని, గోకుల్‌చాట్ పేలుళ్లు లేవు. దమ్మున్న ముఖ్యమంత్రి ఉంటే ప్రశాంతంగా ఉంటది. ముమ్మాటికీ హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉంచటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం. దమ్మున్న ముఖ్యమంత్రి ఉన్నాడనే ధీమాతో పెట్టుబడలు వస్తున్నవి. రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వట్టిగనే వస్తయా?
ప్రజల కష్టంలో మనమున్నం ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు మనం ప్రజలతోనే ఉన్నం. కరోనా వచ్చి లాక్‌డౌన్ వస్తే పేదలందరినీ ఆదుకున్నం. రేషన్ ఇచ్చినం. కుటుంబానికి రూ.1500 ఇచ్చినం. మనవాళ్లకే కాదు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి వలస కూలీలుగా పనిచేసిన లక్షలమందిని ఆదుకొన్నం. ఏ రాష్ట్రం కూలీలను ఆ రాష్ర్టానికి పంపినం. కేంద్రప్రభుత్వానికి బాధ్యత లేదా? కనీసం కూలీలను పంపేందుకు సహాయం కూడా చేయలేదు. మనసున్న సీఎం కేసీఆర్ కనుకనే 360 శ్రామికరైళ్లకు డబ్బులు కట్టి పంపించిన్రు.
యువతను తప్పుదారి పట్టించేకుట్ర హైదరాబాద్ యుతను తప్పుదారి పట్టించేందుకు ట్రిపుల్ రైడింగ్ చేసుకోండి. చాలన్లు మేమే కడుతాం అని ప్రకటిస్తున్నవాళ్లు గుజరాత్‌లో కడుతున్నరా? మధ్యప్రదేశ్‌లో కడుతున్నరా? కేంద్రంలోని నితిన్‌గడ్కరీ మంత్రిగా ఉండి మోటర్ వెహికిల్ యాక్ట్ తెచ్చారు. దాన్ని తప్పు పడతారా? ఇదేనా మీ సంస్కృతి అని నిలదీయాలి. దమ్ముంటే హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రాన్ని ఒప్పించి లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకొని రండి. అది తెలివని ప్రజలు నమ్ముతరు.
ధర్నా అక్కడే ఎందుకు? ధర్నా ఎక్కడ చేశారు. భాగ్యలక్ష్మి టెంపుల్. బిర్లామందిర్ లేదా, తాడ్‌బండ్‌లో ఆంజనేయస్వామి గుడి లేదా, బల్కంపేటలో ఎల్లమ్మతల్లి గుడి లేదా. ఇవేవీ లేవు. చార్మినార్ కాడికిపోయి గెలుక్కోవాలె. ఎందుకంటే హిందూ ముస్లిం, ఇండియా.. పాకిస్తాన్. వాళ్లకు తెల్సింది అదొక్కటే. డబ్బలో రాళ్లు వేసి ఊపినట్లు గళగళగళ ఊపుతరు తప్ప ఏం తెల్వదు. ఏం చేస్తరో చెప్పు అంటే చెప్పరు. ఎస్‌ఆర్‌డీపీ చేసినట్లు.. రేపు నాలాల కోసం ఎస్‌ఎన్‌డీపీ చేస్తం. చెరువులు బాగుచేస్తం. నాలాలు బాగుచేస్తం. నీళ్లు రాకుండాచేస్తం. మొన్న అయ్యింది మరోసారి కాకుండా చేస్తం. ఆ దమ్ము మాకే ఉన్నది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గల్లి గల్లీలో చెప్పాలి. హైదరాబాద్ లోకల్ ఎన్నికల్లో ఏం చేస్తరో అడుగుదాం. చలాన్ల గురించి, ధర్నాల గురించి, మతాల మధ్య చిచ్చు కాదు.. హైదరాబాద్‌కు ఏం చేస్తరో చెప్పండి. ఆరేండ్లలో ఏం చేశారు. ఎన్ని రూపాయలు తెచ్చారు. ఎక్కడ ఏం కట్టారు. రేపు గెలిపిస్తే ఏం చేస్తరో చెప్పాలె. ఎందుకు వేయాలి మీకు ఓటు అని నిలదీసి అడగండి. దమ్ముంటే చెప్పమనండి.
ఒక్క రూపాయి పన్నులు పెంచలేదు చేసిన పనులను ప్రజలకు గుర్తుచేయండి. ఇన్ని పనులు చేశాం కాని ఇప్పటివరకు పన్నులు ఒక్క రూపాయి పెంచలేదు. ఇంటిపన్ను, నీటి బిల్లు, కరెంట్ చార్జీ, ట్రేడ్ లైసెన్స్, డెవలప్‌మెంట్ చార్జీ ఇలా ఏ పన్ను పెంచలేదు. ఏదీ పెంచలేదు. ప్రజలమీద భారం మోపలేదు. పేదలకు మంచిచేశాం. ప్రాపర్టీ ట్యాక్స్ 50 రద్దుచేశాం. రూ.326 కోట్ల లాభంచేశాం తప్ప.. పేదలకు, మధ్యతరగతి వారికి నష్టంచేయలేదు. కష్టాల్లో ఉంటే ఆరున్నర లక్షల మందికి రూ.550 కోట్ల రూపాయలు ఇచ్చినం. లాక్‌డౌన్‌లో రూ.1500 చొప్పున ప్రతి రేషన్‌కార్డుకు ఇచ్చినం. పేద వారికి పక్షపాతంగా ఉన్నామే తప్ప.. వారి నడ్డివిరిచే పనిచేయలేదు. వాళ్ల తప్పుడు నిర్ణయాలవల్ల కార్మికులు రోడ్డున పడే పరిస్థితి.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతున్నారు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు కదులుతున్నారు. బీహెచ్‌ఈఎల్, ఎల్‌ఐసీ, ఎన్టీపీసీ, రైల్వేస్ కదలుతున్నారు. మీ డివిజన్లలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు ఉన్నరో.. వారి దగ్గరికి పోయి కలవండి. మా నాయకుడు కేసీఆర్ మీకు అండగా ఉన్నడు, మాకు మద్దతు ఇవ్వండి అని కోరండి. కేంద్రంతో ఎంత దూరమైనా పోరాటం చేస్తమని చెప్పండి. రైల్వేస్‌ని ప్రైవేటుపరం చేస్తున్నరు. ఎల్‌ఐసీని ప్రైవేటు చేస్తున్నరు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు ఉన్న ప్రాంతంలో వారిని కలిసి తెలియజేయండి. ప్రతి వర్గం మద్దతు కూడగట్టండి. స్థానిక శాసనసభ్యుల నాయకత్వంలో పనిచేయాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారంచేయాలి.
28న ఎల్బీ స్టేడియంలో సీఎం సభ పోటీబడ్డ ఆశావహులను కలుపుకొని నిర్విరామంగా పని చేయాలి. 28న లాల్‌బహదూర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ సభ ఉంటుంది. కొవిడ్ నిబంధనల మధ్య పెద్ద సంఖ్యలో హాజరై విజయం సాధించాలి. ఈలోగా ఎక్కడివారక్కడ సిద్ధం కావాలి. సెంచరీ కొట్టాలి. గతంలో ఒక్క సీటుతో పోయింది. ఈ సారి తప్పకుండా కొట్టాలి.
ప్రముఖ కంపెనీలు ఊరకే రావు హైదరాబాద్‌కు నష్టం జరుగుతుంది. ఒకసారి హైదరాబాద్‌లో అశాంతి చెలరేగితే అమెజాన్, యాపిల్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు రావు. అన్ని చూసుకొని ఆ సంస్థలు హైదరాబాద్ వచ్చాయి. నైపుణ్యాలు, రక్షణ, భద్రత, భౌగోళిక పరిస్థితులు, రాజకీయ స్థిరత, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించి ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు నగరానికి వస్తాయి. అలాంటి వాతావరణాన్ని కాపాడుకుందాం.
బస్ నంబర్ 135.. తాగునీటి కష్టాలు.. నేను కరీంనగర్‌లో పుట్టిన. హైదరాబాద్‌లో స్థిరపడ్డ. మా కుటుంబం సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డదే. చదువుకొనే రోజుల్లో మేము ఎర్రమంజిల్‌లో ఉండేవాళ్లం. అక్కడి నుంచి నేను బస్సులో స్కూల్‌కెళ్లేది. 135 బస్ నంబర్. వెంకటరమణ కాలనీ మీదుగా పోయేది. ఖైరతాబాద్ దగ్గర జలమండలి ఆఫీస్ ఉంటది. ఎండకాలం వచ్చిందంటే చాలు మార్చి, ఏప్రిల్ నెలల్ల్లో వందల మంది.. వేల మంది బిందెలతో నిలబడేది. ఎందుకంటే నీళ్లకోసం ఆందోళనలు జరిగేది. ధర్నాలు చేసేది. ఒకటిరెండుసార్లు కాదు.. వందలసార్లు చూసిన. పధ్నాలుగు రోజలకోసారి నీళ్లు వచ్చేది.
ఇయ్యాల ఆ పరిస్థితి ఉన్నదా? హైదరాబాద్ సాగునీటి గోస తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది. మంచినీటి సమస్యను 90-95% తీర్చినం. ఈ రోజు హైదరాబాద్ ప్రజలు చైన్నైలో మాదిరిగా ట్యాంకర్లలో, రైళ్లలో నీళ్లు తెచ్చే దుస్థితి లేకుండా హైదరాబాద్‌వాసులకు నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది. అప్పుడెప్పుడో 1916లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గండిపేట చెరువును కట్టిండు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎందరో మహానుభావులు పరిపాలించిండ్రు. హైదరాబాద్ పెరుగుతున్నది. జనాభా పెరుగుతున్నది. భవిష్యత్‌లో తాగునీటి సమస్య ఉండకూడదని ఏ ఒక్కరైనా ఆలోచించిన్రా? ఎవరూ ఆలోచించలేదు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ లెక్క డెడికేటేడ్ డ్రింకింగ్‌వాటర్ రిజర్వాయర్ ఉండాలని ఆలోచించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఒక్క కేసీఆరే.
రాబోయే సంవత్సరం, ఆర్నెళ్లలోనే హైదరాబాద్ తాగునీటి కష్టాలు తీర్చేందుకు రిజర్వాయర్ సిద్ధమవుతున్నది. హైదరాబాద్‌లో 2050 వరకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయాలన్న సంకల్పంతో రిజర్వాయర్ నిర్మాణం మొదలైంది. ఈ మధ్య కొన్ని అంతర్జాతీయ సంస్థలు నివేదికలు విడుదలచేస్తున్నవి. ఏ పట్టణంలో నీటికొరత ఉన్నది. ఏ పట్టణంలో సమస్య ఉన్నది అనే అంశం మీద ఆ సంస్థలు కొన్ని పట్టణాలను ప్రకటించాయి. అందులో హైదరాబాద్ లేదు. అలా లేకపోవటానికి కారణం ముందుచూపున్న నాయకుడు, ప్రణాళిక ఉన్న నాయకుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటమే. హైదరాబాద్ నగర తాగునీటి గోసను మా ఆడబిడ్డలు రోడ్డు మీదికి రాకుండా తీర్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం.
రెండు విషయాల్లో ఆలోచించండి హైదరాబాద్ ప్రజలు రెండు విషయాల్లో ఆలోచించాలని అడగాలి. మనం ఇక్కడ ప్రభుత్వంలోకి వచ్చి ఆరేండ్లు అయింది. ఈ ఆరేండ్లలో టీఆర్‌ఎస్ ఏం చేసిందంటే వివరించి చెప్పండి. బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు పోతున్నది. ఇదే విషయాన్ని వారికి చెప్పండి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి ఆరేండ్లు అయింది కదా! వాళ్లొక్క పనైనాచేశారా? అని నిలదీయవలసిన అవసరం ఉన్నది. హైదరాబాద్ ఆరేండ్ల నుంచి ప్రశాంతంగా ఉంది.
అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ కావాలా? లేదా అశాంతితో నిత్యం మత ఘర్షణలతో తల్లడిల్లిన హైదరాబాద్ కావాలా? అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? కచ్చితంగా ప్రజల్ని అడగాలి. విభజన రాజకీయ వాదులు కావాలా? లేక పురోగమన శీలంగా ముందుకు పోతున్న రాజకీయవాదులు కావాలా? హైదరాబాద్‌ను విశ్వనగరంగా మలచే చిత్తశుద్ధి ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కావాలా? అని అడగవలసిన బాధ్యత మనపై ఉన్నది. ఇది కేవలం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మాత్రమే కావు. రాష్ర్టానికి సంబంధించిన కీలకమైన ఎన్నిక. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆషామాషీగా నిర్ణయం తీసుకోవటానికి వీల్లేదు. అందరం కలిసి మెలిసి ఉంటున్నాం. అటువంటి హైదరాబాద్‌కోసం అందరం కలిసి పనిచేద్దాం. ఆశీర్వదించండి అని ప్రజల్ని కోరండి.
చేతల్లో సామాజిక న్యాయం ముఖ్యమంత్రి కేసీఆర్.. జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించి 50% రిజర్వేషన్లు చట్టబద్ధంగా మహిళలకు ఇవ్వాలని చట్టాన్ని మార్చి. సగం డివిజన్లను మహిళలకు ఇవ్వాలని నిర్ణయించి మహిళాపక్షపాతి అని నిరూపించారు. చట్టం ప్రకారం జీహెచ్‌ఎంసీలోని 150 సీట్లుంటే అందులో 75 మహిళలకు ఇవ్వాలి. కానీ, సీఎం కేసీఆర్ 85 స్థానాలను ఇచ్చారు. సమాజంలో అన్ని వర్గాలకు న్యాయంచేయాలని సామాజికన్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ టీఆర్‌ఎస్సే. 50% బలహీన వర్గాలకు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకొన్నది. ఆ పార్టీ ఇచ్చిందో లేదో కానీ సీఎం కేసీఆర్ 75 సీట్లను బలహీనవర్గాలకు ఇచ్చి 50 శాతం రిజర్వేషన్లతో వారికి సముచిత స్థానం కల్పించారు. బలహీనవర్గాల్లో అన్ని కులాలాకు ప్రాతినిధ్యం వహించే విధంగా గౌడ్‌లు, గంగపుత్రులు, పద్మశాలి. కమ్మరి, కుమ్మరి, సగర, లింగాయత్, లోథీస్, విశ్వబ్రాహ్మణులు, మున్నూరు కాపులు, నాయిబ్రాహ్మణులు, ముదిరాజ్‌లు, రజకులు అందరికీ ప్రాతినిథ్యం లభించేవిధంగా టిక్కెట్లు కేటాయించారు.
పూలబొకే అందంగా కనిపించాలంటే అందులో అన్నిరకాల పూలుండాలి. సీఎం కేసీఆర్‌కూడా అలాగే జీహెచ్‌ఎంసీలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం ఉండాలని భావించారు. 17 సీట్లు మైనార్టీ అభ్యర్థులకు ఇచ్చాం. రెండు సీట్లు మాత్రమే గిరిజనులకుంటే మూడో సీటును కూడా ఇచ్చాం. పదిసీట్లు దళిత సోదరులకు ఇవ్వాల్సి ఉండగా పదమూడు సీట్లు కేటాయించాం. అందులో మళ్లీ మాదిగ, మాల, మేదరి వర్గాలే కాకుండా తమిళనాడు నుంచి ఇక్కడ స్థిరపడ్డ అరవమాల సోదరులకు కూడా కేటాయించాం. అగ్రవర్ణాలకు కూడా సముచితస్థానం కల్పించాం. వైశ్యులు, కాపులు, వెలమలు, కమ్మలు, రెడ్డి, బ్రాహ్మణ ఇలా అందరికీ సమాన అవకాశాలు కల్పించాం. వందల ఏండ్ల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడిన రాజస్థానీ, మరాఠీ సోదరులకు టిక్కెట్లు ఇచ్చాం.
తెలంగాణ వస్తే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితులుంటాయని అనుమానాలు, అపోహలు సృష్టించారు. ముఖ్యంగా ఆంధ్రాప్రాంత సోదరుల్లో అనేక సందేహాలు కల్పించారు. కానీ సీఎం కేసీఆర్ అసాధారణ పరిణతిని ప్రదర్శించి తెలంగాణలో బతుకుదెరువు కోసం వచ్చిన ఏ ప్రాంత బిడ్డలైనా మా బిడ్డలే.. ఆంధ్రాప్రాంతం వారు అతీతంకాదు అని సమున్నతంగా వ్యవహరించిన గొప్పనేత సీఎం కేసీఆర్. వాళ్లంతా మా అన్నదమ్ములే.. మా అక్కాచెల్లెండ్లే అని ఆచరణలో చూపి ఆరేండ్లుగా ఎక్కడా ఏ చిన్నపాటి గొడవ లేకుండా అద్భుతంగా కలుపుకొని పోవడమే కాకుండా వారికీ ఈ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు కేటాయించి వారి గౌరవాన్ని కాపాడింది టీఆర్‌ఎస్ పార్టీ. అందరూ మనవారే.. ఇది అందరి హైదరాబాద్.. అందరి కోసం పనిచేసే టీం తప్ప కొందరి కోసం పనిచేసే టీం కాదు.
దమ్మున్న సీఎం ఉండబట్టే.. సుచిత్ర కృష్ణంరాజు దగ్గరికిపోతే ఆయన ఒక ముచ్చట చెప్పిండు. ‘ఉత్తరప్రదేశ్ సీఎస్‌తో ఏదో పనిఉండి పోతే. పని సంగతి తరువాత గని మా దగ్గర నోయిడా, ఘజియాబాద్ వంటి పారిశ్రామిక పట్టణాలున్నా మాకు పెట్టుబడులు వస్తలేవు. మరి హైదరాబాద్‌కు ఎట్లా వస్తున్నయి. ఎందుకొస్తున్నవి’ అని అడిగిండట. అప్పుడాయన మా తెలంగాణలో దమ్మున్న ముఖ్యమంత్రి ఉన్నడు. కేసీఆర్ ఉన్నడు. హైదరాబాద్‌లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పిండు. పనికిమాలిన పంచాయతీల్లేవు. అందుకే పెట్టుబడులు వస్తున్నాయి అని ఆయన సమాధానం చెప్పారట. హైదరాబాద్ బాగుంటెనే తెలంగాణ బాగుంటుంది. తెలంగాణ భవిష్యత్తు హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నది. రైతుబంధు, రైతు బీమా సహ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేయాలంటే హైదరాబాద్ బాగుండాలి. పెట్టుబడులు రావాలంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలి. హైదరాబాద్ నగరంలో జీవో నెంబర్ 58, 59 కింద పేద వారికి లక్ష పట్టాలు పంపిణీచేశాం. మోడల్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు.. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు కట్టుకొన్నాం. మల్టీపర్పస్ కాంప్లెక్స్‌లు కట్టుకొన్నాం. బ్రహ్మాండంగా ైఫ్లై ఓవర్లు కట్టుకొన్నాం. అండర్‌పాస్‌లు, బై పాస్‌లు కట్టుకొన్నాం. 135 లింకు రోడ్లు ఏర్పాటుచేసుకొన్నాం. మనంచేసిన అభివృద్ధిని చెప్పుకొంటూ పోతే ఎంతైనా చెప్పొచ్చు.