Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

భాగ్యనగర వైభవాన్ని మరింత పెంచాలి

-హైదరాబాద్‌ మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దే
-నగర ప్రథమ పౌరురాలిగా విజయలక్ష్మి
-డిప్యూటీ మేయర్‌గా శ్రీలతారెడ్డి ఎన్నిక
-తొలిసారి ఇద్దరు మహిళల సారథ్యం
-సహజత్వాన్ని కోల్పోవద్దు
-ఆదమరిస్తే చెడ్డపేరు ఖాయం
-గోరటి వెంకన్న పాటలు వినండి
-బస్తీ పేదల గోసలు చూడండి
-పేదల సమస్యలన్నీ తీర్చాలి
-జీహెచ్‌ఎంసీ పాలకవర్గానికి సీఎం కేసీఆర్‌ హితబోధ
-మేయర్‌, డిప్యూటీకి శుభాకాంక్షలు

విభిన్న సంస్కృతులు, భాషలతో మినీ ఇండియాగా భాసిల్లుతున్న నగరం హైదరాబాద్‌. విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగర ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేయాలి. కోట్లలో కొద్దిమందికి మాత్రమే ప్రజాప్రతినిధులుగా అవకాశం కలుగుతుంది. ప్రజలకు సేవ చేయడమే గొప్ప విషయంగా భావించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సహజత్వం కోల్పోవద్దు. వేషభాషలు మారొద్దు. దగ్గరకు వచ్చిన అందరినీ ఆదరించాలి.. బస్తీల గోస తీర్చాలి.

– జీహెచ్‌ఎంసీ కొత్త మేయర్‌, కార్పొరేటర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌ అందరినీ ఆదరించే ప్రేమగల్ల నగరమని, నిజమైన విశ్వనగరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ‘నగరంలో సింధ్‌ కాలనీ ఉంది.. గుజరాతీ గల్లీ ఉంది.. పార్సీగుట్ట ఉంది. బెంగాళీలు, మలయాళీలు, మార్వాడీలు, కాయస్తులున్నారు.. ఇలా విభిన్న ప్రాంతాలు, మతాలు, సంస్కృతుల వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు’ అని చెప్పారు. హైదరాబాద్‌ ఓ మినీ ఇండియా అని పేర్కొన్నారు. ఇంతటి గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లపైనే ఉన్నదని.. దాని వైభవాన్ని మరింతగా పెంచాలని పిలుపునిచ్చారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నూతన పాలకవర్గం గురువారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కొలువుదీరింది. టీఆర్‌ఎస్‌ వరుసగా రెండోసారి బల్దియా మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్నది. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు గద్వాల విజయలక్ష్మి, మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి మేయర్‌, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన మేయర్‌, డిప్యూటీ మేయర్లతోపాటు, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని అభినందించిన కేసీఆర్‌.. విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్‌ నగరవైభవాన్ని మరింత పెంచేలా కృషిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

ప్రజాజీవితంలో మంచిపేరు తెచ్చుకోండి
కోట్లమందిలో కొద్దిమందికి మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. అదికాదు గొప్పవిషయం. ప్రజాప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. ప్రజాజీవితంలో మంచిపేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. మంచిగా ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి. కొద్దిగా ఆదమర్చినా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

సహజత్వం కోల్పోవద్దు
పదవిలో ఉన్నవారు ఎంతో సంయమనంతో, సహనంతోపాటు చాలా సాదాసీదాగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సహజత్వాన్ని కోల్పోవద్దు. వేషభాషల్లో మార్పులు రావద్దు. అసంబద్ధంగా, అవసరంలేని మాటలు మాట్లాడితే వచ్చే లాభమేమీ లేకపోగా.. కొన్ని సందర్భాల్లో వికటించే అవకాశం కూడా ఉంటుంది. అవసరం కోరి వచ్చేవాళ్ల కులం, మతం చూడొద్దు. ప్రతి ఒక్కరినీ ఆదరించి, అక్కున చేర్చుకోవాలి. వారికి సరైన గౌరవం ఇవ్వాలి. చెప్పేది ఓపిగ్గా విని చేతనయినంత సాయంచేయాలి. అబద్ధాలు చెప్పవద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.

బస్తీ కష్టాలు, గోసలు అర్థంచేసుకోవాలి
‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది..’ అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వందసార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. మేయర్‌, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించి వారి బాధలు అర్థంచేసుకోవాలి. పేదలను ఆదరించాలి. బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలి. హైదరాబాద్‌ నగరానికి అనేక అనుకూలతలున్నాయి. మంచి భవిష్యత్తు ఉన్నది. నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. వాటికి సహకరించాలి.

అర్హులున్నా అందరికీ ఇవ్వలేం
ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు. కానీ ఒక్కరికే మేయర్‌గా అవకాశం దక్కుతుంది. మీలో మేయర్‌ కావాల్సిన అర్హతలున్నవారు చాలామంది ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేం. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలిసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి. కార్యక్రమంలో ఎంపీలు కే కేశవరావు, సురేశ్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.