Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

బీడీ కార్మికులకు భరోసా

-అర్హులందరికీ రేపటి నుంచి భృతి.. రానివారు ధర్నాలకు వెళ్లొద్దు.. దరఖాస్తులు చేసుకోండి -కొత్తవారికి పదిరోజుల్లో వెరిఫై చేయించి ఆపై మార్చినెల భృతీ ఇస్తాం -యూనియన్లు గడబిడలు మాని దరఖాస్తులు చేయించాలి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన -తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే.. కేంద్రం రుణపరిమితి పెంచాలి -అనధికార విద్యుత్ కోతల్లేవు.. ఏడాది చివరినాటికి మరో 2 వేల మె.వా. -పుట్టే పిల్లలకు కరెంటు కోతలు అంటే తెల్వకుండ చేస్తం -యాదగిరిగుట్టలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ -విలేకరుల సమావేశంలో కే చంద్రశేఖర్‌రావు

KCR

టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మరో వాగ్దానం నెరవేరబోతున్నది. మార్చి 1న బీడీ కార్మికులకు వెయ్యి రూపాయలు జీవనభృతి ఇచ్చే పథకం ప్రారంభంకానుంది. తొలి రోజే లక్షా 70వేల మంది బీడీ కార్మికులు ఈ భృతి అందుకోనున్నారు. మరో 50 నుంచి 70వేల మందికి కూడా భృతి ఇచ్చేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలోని సీ బ్లాక్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విలేకరులతో సమావేశం అయ్యారు.

మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న బీడీ కార్మికులకు జీవన భృతి స్కీం వివరాలను వెల్లడించారు. బీడీ కార్మికులకు జీవన భృతి కింద రూ.1000 ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 1నుంచి రాష్ట్రం మొత్తం దీన్ని అమలు చేస్తున్నాం. ఇందులో కొందరికే పీఎఫ్ కార్డు నంబర్లు ఉన్నాయి. బీడీ కంపెనీలు స్వార్థంతో పీఎఫ్ కార్డులు ఇవ్వటంలేదు. నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమబెంగాల్‌లో 1.10లక్షల మందికి పీఎఫ్ కార్డులు ఇప్పించిన. తెలంగాణలో జీవన భృతిని ఎలా ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం చర్చించింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా చూస్తే 4.90లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నట్లు తేలింది. దీన్ని వెరిఫై చేయించినం. వెయ్యి రూపాయల భృతిని పొందేవారిలో డూప్లికేషన్ ఉండొద్దు. అడిట్‌లో ఒప్పుకోరు. అని అన్నారు.

ఎమ్మార్వో ఆఫీసుల్లో దరఖాస్తులు పెట్టండి రాష్ట్రంలో ఉన్న 4.90లక్షల బీడీ కార్మికుల్లో 1,40,819 మంది ఇప్పటికే ఆసరా పథకం కింద పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో వికలాంగులు, వితంతువులు ఉన్నారు. పీఎఫ్ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.వెయ్యి పెన్షన్ ఇస్తుంది. అట్లా మరో లక్ష మంది ఉన్నారు. మొత్తం 2.40లక్షల మంది ఇప్పటికే పెన్షన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. వారికి ఇచ్చే అవకాశం లేదు. ఇస్తే కాగ్ తప్పుపడుతుంది. వీరు పోగా మిగిలిన 2.5లక్షల మందిలో 1.70లక్షల మంది బీడీ కార్మికులకు భృతి ఇచ్చేందుకు అంతా సిద్ధం చేసినం. మార్చి 1న స్కీం లాంచింగ్ రోజున ఇస్తున్నాం.

స్కీంలో లేనివాళ్లు మరో 70-80వేల మంది ఉంటారు. ఇందులో కొంత మంది మైనర్లు ఉన్నారు. వారికి ఇస్తామంటే చట్టం ఒప్పుకోదు. కొందరు ఉద్యోగాలు చేస్తూ జీతం పొందుతున్నారు. మరికొందరు వ్యవసాయ కూలీలు ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో వాళ్లు వివరాలు రాయించలేదు. సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేయించుకోనివారు ఎమ్మార్వో ఆఫీసుకుపోయి దరఖాస్తు పెట్టుకుంటే 10రోజుల్లో వెరిఫై చేయించి మార్చి నెల పెన్షన్ కూడా ఇస్తాం అని ముఖ్యమంత్రి చెప్పారు. బీడీ కార్మికులు ఎక్కువుగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోనే ఉన్నారని అన్నారు. కొన్ని జిల్లాల్లో 10వేల చొప్పున ఉన్నారని తెలిపారు.

కార్మిక నాయకులు దరఖాస్తులు పెట్టించండి కార్మిక సంఘాల నేతలు ఏం చేసినా పెన్షన్లు రావు. నేను సీఎంగా చెబుతున్నా. ప్రభుత్వం ఇచ్చేదానికి ఒక పద్ధతి.. ఎంపిక, వెరిఫికేషన్ ఉంటుంది. మీకు కార్మికులకు న్యాయం చేయాలని ఉంటే ఎమ్మార్వో దగ్గరికి తీసుకెళ్లి దరఖాస్తు పెట్టించండి. వారం 10రోజుల్లో వెరిఫై చేయించి మార్చి నెల భృతి కూడా ఇస్తాం. కానీ ఆందోళనలు, ధర్నాలు చేసి మేం నాయకులం అయితం అంటే కాదు. ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా… మంచి, చెడు ఉంటాయి.

రేషన్ కార్డుల విషయంలో కూడా మొదట్ల కొన్ని ఇబ్బందులొచ్చినై. అవన్ని పరిష్కరించిన తరువాత ఇప్పుడు 99.9శాతం మందికి ఇస్తున్నాం. నిజమైన కార్మిక నాయకులు అయితే కార్మికులకు న్యాయం జరిగేలా ఎమ్మార్వో దగ్గరికి తీసుకుపోయి దరఖాస్తు పెట్టించండి. మేం ఎంత మందికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 1.7లక్షల మందికి ఇస్తున్నాం. మరో 50-70వేల మందికైనా ఇస్తాం. కానీ లేనిపోని ఆందోళనలు, గడబిడ చేస్తే లాభం ఉండదు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రైల్వే బడ్జెట్‌లో కొంతే సంతోషం రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కొంతే సంతోషం కలిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కొన్ని ప్రాజెక్టులు, స్కీంలు వచ్చాయి. పెద్దపల్లి-నిజామాబాద్‌కు నిధులు ఇచ్చారు. దీంతో ఆ ప్రాజెక్టు మొత్తం పూర్తవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను దేశంలోని 10 రైల్వే స్టేషన్లలో ఒకటిగా తీసుకున్నారు. దీంతో కొంత అభివృద్ధి, సౌకర్యాలు వస్తాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని సీఎం చెప్పారు. కోచ్, వ్యాగన్ పరిశ్రమలు రాలేదని అన్నారు. మనం కొన్ని ప్రతిపాదనలు ఇచ్చినం. అవి వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాం అని సీఎం వివరించారు.

విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని వివరించిన సీఎం.. ఏపీ లాక్కున్న పోలవరం మండలాలకు కూడా తెలంగాణ ప్రభుత్వమే విద్యుత్ సరఫరా చేస్తున్నదని చెప్పారు. వచ్చే సంవత్సరం మన ప్రాజెక్టుల నుంచి 1800మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు.

ప్రస్తుతం 900-1000మెగావాట్ల గ్యాప్ ఉందని, డిమాండ్ పీక్‌లో ఉన్నప్పుడు 1800-1900మెగావాట్ల లోటు ఉంటుందని తెలిపారు. ఈ సంవత్సరం చివరిలోపు సింగరేణికి చెందిన జైపూర్ ప్రాజెక్టు నుంచి 600+600 మెగావాట్లు, భూపాలపల్లి కాకతీయ ప్రాజెక్టునుంచి 600 మెగావాట్లు కూడా వస్తుంది. 280 మెగావాట్లు సెంట్రల్ షేర్ రానుంది. అంటే మొత్తంగా కొత్తగా అందుబాటులోకి వచ్చేది 2000 మెగావాట్లు అని సీఎం వివరించారు.

మరో ఆరు నెలల్లో రెండువేల మెగావాట్లు ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తుందని తెలిపారు. ఇందుకు వీలుగా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లైన్లు వేస్తుందని చెప్పారు. అంగుళా (ఒడిశా)-పలాస (ఏపీ) లైను పూర్తి కావొస్తున్నదని, దీంతోపాటు వార్ధా-డిచ్‌పల్లి-మహేశ్వరం లైనుకు టెండర్లు ఫైనల్ చేశారని చెప్పారు. 14-15 నెలల్లో ఇది పూర్తి కానుందని తెలిపారు. అంటే హైడల్ కాకుండా మనకు డైరెక్టుగా అందే విద్యుత్ 8300 మెగావాట్లకు చేరుతుంది. హైడల్ కలిపితే 10600 మెగావాట్లకు వెళ్తాం.

ఆ తరువాత మరికొన్ని నెలల్లోనే 1080 మెగావాట్లు మణుగూరు ప్రాజెక్టు వచ్చి కలుస్తుంది. ఆ తరువాత పుట్టే పిల్లలకు కరెంటు కోతలు అంటే తెల్వవు. 2018నాటికి ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు రైతులకు కరెంటు ఇస్తాం. కరెంటు కోతలంటే పరిశ్రమలకు తెల్వకూడదు. 2018నాటికి అదనంగా వచ్చే 10వేల మెగావాట్లతో మొత్తం తెలంగాణ 23వేల మెగావాట్ల విద్యుత్‌తో మిగులు రాష్ట్రంగా ఉంటుంది. ఎవరికైనా కావాల్సి వస్తే మూడు నాలుగు వేల మెగావాట్లు అమ్ముతాం అని సీఎం వివరించారు. దామరచర్ల విద్యుత్ ప్రాజెక్టుపై మార్చి 3న సమావేశం ఉంది. ఆ రోజు దానికి అనుమతులు వస్తాయి అని చెప్పారు. కృష్ణపట్నంనుంచి మనకు విద్యుత్ అవసరం ఉన్నప్పుడు ఇవ్వడం లేదు.

రేపు మనకు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇస్తామంటే వద్దనే హక్కు మనకు ఉంటుంది. కృష్ణపట్నం ప్రాజెక్టులో ఉన్న మన పెట్టుబడులు సచ్చుకుంట మనకు వస్తాయి. కేంద్రమే వసూలుచేసి ఇస్తుంది. ఇప్పటికే గవర్నర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి చెప్పినం. కేంద్రం కమిటీ కూడా వేసింది అని తెలిపారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఏ పాటో మనకు తెల్వదా. పొద్దున లేస్తే ఆయన పాట పాడుతరు… ఆయన జెండాలు పట్టుకుంటరు… ఎంత పాటో మనకు కనిపిస్తలేదా అని వ్యాఖ్యానించారు.

స్కీంల వారీగా నిధులు ఇవ్వాలి కేంద్రంనుంచి వచ్చే నిధులను పథకాల వారీగా ఇవ్వాలని అడిగినట్లు సీఎం తెలిపారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంలు (సీఎస్‌ఎస్)లు ఉన్నాయి. దీనిపై ప్రధానిని అడిగితే సానుకూలంగా స్పందించారు. సీఎస్‌ఎస్‌లు 122 ఉన్నాయి. ఈ మధ్య 66కు తగ్గించారు. విద్యాశాఖలోనే 10-12 ఉన్నాయి. ఇందులో 70% కేంద్రంఇస్తే, రాష్ట్రం 30% ఇవ్వాలి. అంటే మన ఖజానాపై పెత్తనం అన్నమాట. స్కీంలవారీగా నిధులుఇస్తే ఇబ్బందిలేదు. కేరళలో 100%శాతం అక్షరాస్యత ఉంది.

అక్కడ నిధులు పొందాలంటే 100% అక్షరాస్యత లేదని చెప్పాలా? అని నీతి ఆయోగ్ మీటింగ్‌లో ఆ రాష్ట్ర సీఎం అన్నారు. దాంతో సీఎస్‌ఎస్ స్కీంలను 66కు తగ్గించారు. విదేశాంగ, రైల్వే, జాతీయ రహదారులు వంటివి రాష్ర్టాలు నిర్వహించలేవు. వీటిపై కేంద్రం ఆధిపత్యమే ఉండాలి. కేంద్ర బడ్జెట్‌లో ఎన్ని సీఎస్‌ఎస్ ఉంటాయి? ఎన్ని నిధులిస్తారో చూద్దాం అని ముఖ్యమంత్రి అన్నారు.

దారినపోయే వారిని పట్టించుకోం మంత్రిపై కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ చేసిన ఆరోపణలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం సూటిగా స్పందించారు. మా మంత్రి ఇప్పటికే కేసుకూడా పెట్టిండు. ఆ ఆరోపణలను పట్టించుకోం. న్యాయస్థానం ఉంది. అడ్డగోలు ఆఆరోపణలు చేసే దారిన పోయే దానయ్యలు మాట్లాడితే పట్టించుకోం అని సీఎం అన్నారు.

ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ సరిగ్గా లేదు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ సరిగ్గా లేదు. మహారాష్ట్రతో గొడవ పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుపై సర్వే చేసిన వ్యాప్కో సంస్థను రేపు రమ్మన్నాను. మహారాష్ట ప్రభుత్వంతో ఈ మధ్య చర్చించినప్పుడు 160-165టీఎంసీలు వాడుకోవడానికి ఇబ్బంది లేదని చెప్పారు. కానీ వాళ్ల భూములు ముంచొద్దన్నారు. ఇబ్బంది లేకుండా ఎలా నీళ్లు తీసుకోవాలో మనం చూసుకుందాం.

నేను గతంలో ఆల్మట్టి నుంచి నీళ్లు వస్తాయని అన్నా. వాళ్లు డ్యాం ఎత్తు పెంచినంకా 300టీఎంసీలు నీళ్లు ఉంటున్నాయి. వారికి 196 టీఎంసీల నీళ్లకే వాటా ఉంది. మిగిలిన నీరు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు వస్తాయి. 100 టీఎంసీల కంటే ఎక్కువ వస్తాయి. కర్ణాటక సీఎంతో మాట్లాడుతా. అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే వెళ్లి వస్తా. వచ్చే నీళ్లు పాలమూరు ఎత్తిపోతలకు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సరిపోతాయి. ఈ నీళ్లు కూడా గ్రావిటీ ద్వారా వస్తాయి. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం వచ్చిన నీళ్లు ఎలా వాడుకోవాలో అది మన ఇష్టం.

తెలంగాణ ధనిక రాష్ట్రమే 14వ ఫైనాన్స్ కమిషన్ తెలంగాణను ధనిక రాష్ట్రం అన్నది. సంతోషం. తెలంగాణతోపాటు గుజరాత్‌ను కూడా చెప్పింది. నేను 16ఏండ్లుగా ఏదైతే వాదిస్తూ వచ్చిన్నో, విడిపోతే మాది ధనిక రాష్ట్రం అవుతుందని చెప్పిన్నో ఫైనాన్స్ కమిషన్ కూడా అదే తేల్చింది. తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమే. మనది మిగులు రాష్ట్రం అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తంచేశారు. నన్ను కొందరు అడిగారు ఎట్లా సాధ్యమని. నాకు తెలుసు.

విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎట్లుంటదో ఆనాడు మనకు తెల్వదు. ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఎట్లుంటదో తెల్వదు. ఆనాడున్న ట్రెండ్స్ ఆధారంగా లక్షా 600కోట్ల బడ్జెట్‌ను పెట్టుకున్నం. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ మాత్రం అక్యురేట్‌గా పెట్టుకుంటున్నం అని వివరించారు. నేను ప్రెస్‌మీట్‌కు రావడానికి ముందే గుజరాత్ సీఎంతో మాట్లాడిన. మనకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. ఆర్థిక లోటు ఉన్న 11 రాష్ర్టాలకు నిధులు ఇచ్చారు. సంతోషం. మాకు ప్యాకేజీ ఇవ్వనప్పుడు రుణ పరిమితిని పెంచాలని ప్రధాన మంత్రి మోదీని కోరిన. ఎఫ్‌ఆర్‌బీఎం అని ఉంటుంది.

కేంద్రం రుణ పరిమితి విధిస్తుంది. గత సంవత్సరం రూ.11వేల కోట్లు ఉంటే ఈ సంవత్సరం రూ.15వేల కోట్లకు పెంచారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అన్నారు కనుక ప్యాకేజీ రాదు. అదే సమయంలో ధనికంగా ఉన్నందుకు శిక్షలు కూడా వేయరు. కాబట్టి మంచి ప్రభుత్వం ఉన్నచోట రుణ పరిమితిని సడలించి ప్రస్తుతం ఉన్నదాన్ని డబుల్ చేయమని అడిగిన. ప్రధాన మంత్రి పాజిటివ్‌గా స్పందించారు. ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు రానీ.. అన్నారు. నా తరువాతి ఢిల్లీ పర్యటనలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తా. ఎఫ్‌ఆర్‌బీఎంను పెంచుకుంటాం. ఫైనాన్స్ కమిషన్ కూడా ఇదే విషయం చెప్పింది. దీని ప్రకారం తెలంగాణకు 8వేల కోట్ల రుణ పరిమితి అదనంగా పెరుగుతుంది అని చెప్పారు.

గుట్టలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ యాదగిరి గుట్ట టెంపుల్ కాంప్లెక్స్‌లవల్ల కనిపించడం లేదు. ఇప్పుడున్న దాన్ని తీసేయమని చెప్పిన. గుట్ట 14.5ఎకరాల్లో ఉంది. కొత్త నిర్మాణాలు 6.5ఎకరాల్లో వస్తాయి. గర్భగుడి, అంజనేయస్వామి గుడిని ఎవరూ ముట్టుకోరు. గోపురాలు, ప్రాకారాలు కడతారు. యజ్ఞశాల, ప్రవచన శాల, కల్యాణ మంటపం వస్తాయి. ప్రభుత్వం కేవలం డబ్బులు మాత్రమే ఇస్తుంది.

గుట్ట పక్కన 800ఎకరాలు ఇచ్చినం. దానికే అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినం. ఇది విల్లాలు, కాటేజీలు, మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తుంది. శని, ఆదివారాల్లో 60-70వేల మంది భక్తులు వస్తున్నారు. 10వేల కార్లు వచ్చినా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మేమిచ్చే నిధులు కూడా అథారిటీ ద్వారానే ఖర్చు పెడుతాం. ఈ మధ్యనే నాకు రూ.300-400కోట్ల ఆఫర్లు వచ్చినై. రిలయన్స్, టాటావంటి సంస్థల వాళ్లు ఐదు కోట్లతో వసతులు ఏర్పాటు చేస్తాం అని చెప్పిర్రు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో ఈ డబ్బులు జమ చేస్తాం. శిల్పారామం కట్టిన కిషన్‌రావును దీనికి వైస్ చైర్మన్, ఎండీగా చేసినం. దీనికి నేను చైర్మన్‌గా ఉంటా. ఈ కమిటీలో కలెక్టర్, ఎస్పీ ఇంకా అధికారులు ఉంటారు అని కేసీఆర్ వివరించారు.

అనధికార కరెంటు కోతలు లేవు రాష్ట్రంలో ఎక్కడా అనధికార కరెంటు కోతలు లేవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మా ఇంట్లో ఆన్‌లైన్‌లో చూస్తుంటా. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. కాయంకుళం స్టేషన్ నుంచి 500మెగావాట్ల విద్యుత్ రానుంది. గాయత్రి ప్రాజెక్టునుంచి 300 మెగావాట్లు రానుంది. నార్త్‌గ్రిడ్‌నుంచి కూడా 300 మెగావాట్లు కొంటున్నాం అని సీఎం వివరించారు. రైతులకు ఇప్పటికే వరి పంట వెయ్యొద్దని చెప్పినం. అయినా కొందరు వేశారు. ఈ ఒక్క సీజనే ట్రబుల్ ఉంది. ప్రభుత్వానికి సహకరించాలి. మార్చి-ఏప్రిల్‌లో మనకు కొంత సమస్య రావొచ్చు. అయినా ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేస్తాం. ఇప్పటికే 1300మెగావాట్లు అడిగాం.

సెన్సెక్స్ లాగానే ఆన్‌లైన్‌లో పవర్ అమ్మకానికి పెడుతున్నారు. ఎక్కడ పవర్ దొరికినా కొంటాం. కేరళ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్.. థర్మల్ నుంచి 4300, హైడల్ నుంచి 2300మెగావాట్లే. సీలేరు, కృష్ణపట్నం వాటా ఇస్తలేరు. కనీసం 500-600మెగావాట్లు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా ఏపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నది. కేంద్రం సూచనను పట్టించుకోవడం లేదు. మనపై వారికి కక్ష. ఆ గౌరవం వారికే దక్కనీ అని ఆయన చెప్పారు.

హుస్సేన్‌సాగర్‌ను క్లీన్ చేస్తాం ఏది ఏమైనా హుస్సేన్‌సాగర్‌ను శుభ్రం చేస్తామని సీఎం స్పష్టంచేశారు. క్లీన్ చేసేటప్పుడు వచ్చే అంటువ్యాధుల గురించి తెల్వదా మాకు? అని ప్రశ్నించారు. సెక్రటేరియట్‌ను మార్చొద్దు. ఏం ముట్టొద్దు. అదే బూజు పట్టిన ఆఫీసులల్ల ఉండాలి. మాకు చేయరాలేదు. మాకు తెలివి లేదు. మీరుకూడా ముట్టొద్దు అంటే కుదరదని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పుర్ పక్కన నయారాయ్‌పూర్‌ను కట్టారు. అక్కడ వారు 120 ఎకరాల్లో చెరువుంటే మరో 100 ఎకరాలు కలిపారు. అది, ఇది వస్తుందని చెప్పిర్రు.

నేను అక్కడికి పోయినప్పుడు 1400 ఎకరాల్లో మాకు చెరువు ఉందని అన్నా. ఇందులో 400ఎకరాలు మింగిర్రు. ఇటువంటి చెరువులు నగరాల్లో ఉండవు. తెలివితక్కువతనంతో సాగర్ దుర్గంధంగా మారింది. దీన్ని క్లీన్ చేస్తమంటే ఎన్నో కథలు. జర్నలిస్టులు కూడా దీన్ని ఖండించాలి. ప్రభుత్వం చేసే ప్రతి పనిని వ్యతిరేకించాలి అంటే ఎట్లా. మంచిచెడు ఉంటది కదా అని సీఎం అన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాలపై చర్చ జరగాలని చెప్పారు.

సెటిలర్ అన్న పదమే వద్దు సెటిలర్ అన్న పదమే వ్యతిరేకం. ఎవరైనా హైదరాబాదీలే అని సీఎం చెప్పారు. ముంబై ఒకప్పుడు ఇంత ఉండే. ఇప్పుడు దాని జనాభా 1.5కోట్లు. ఇందులో నిజమైన ముంబైవాళ్లు 5 శాతమే. కానీ ప్రతి ఒక్కరూ మేము ముంబాయీలమే అని మరాఠీలు అంటారు. సెటిలర్ అన్న పదమే వద్దు. కాలర్ ఎగరేసుకుని తిరగండి. కేసీఆర్ మీతో ఉన్నాడు. అని తెలంగాణలోని ఆంధ్ర వారికి కేసీఆర్ భరోసా ఇచ్చారు. విలేకరుల సమావేశంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.