-ముస్లింల మాదిరే మైనార్టీల సంక్షేమానికి కట్టుబడ్డాం -నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా -మెదక్ జిల్లాలో మంత్రికి ఘనస్వాగతం పలికిన నేతలు
యావత్ తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న రెండు లక్ష్యాల్లో ఒకటైన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నెరవేరింది. మరో లక్ష్యమైన బంగారు తెలంగాణ సాధన కోసం ముందుకు సాగాల్సి ఉంది. పునర్నిర్మాణంలో బంగారు తెలంగాణ సాధించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుందిఅని భారీ నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా మెదక్‌జిల్లాకు వచ్చిన ఆయనకు అడుగడుగునా పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి.
సిద్దిపేట శివారులోని రంగధాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపానికి పూలు చల్లి నివాళులర్పించారు. బైక్ ర్యాలీగా హరీశ్‌రావు కాన్వాయ్‌లో పట్టణానికి చేరుకున్నారు. జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం శరభేశ్వరాలయం, చర్చిలో పూజలు, ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నిజాయితీగా, చిత్తశుద్ధితో అన్నివర్గాల ప్రజల ఆకాంక్షను గుర్తించి నెరవేర్చడానికి ప్రభుత్వం కతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎలాకషి చేస్తుందో క్రిస్టియన్ మైనార్టీల కోసం అలాగే పాటుపడుతుందని భరోసా ఇచ్చారు.
నెరవేరిన స్వప్నం: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని కోరుకున్న స్వప్నం నెరవేరిందని హరీశ్‌రావు చెప్పారు. గత ఏడాది సిద్దిపేటలోని అమర్‌నాథ్ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంట సరుకుల సామాగ్రి తరలింపు సందర్భంగా, వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచే వంట సామాగ్రి సరుకులు అమర్‌నాథ్‌కు తరలించాలని కోరుకున్నామని.. ఆ కల సాకారమైందన్నారు. అమర్‌నాథ్ యాత్రికుల కోసం అన్నదానం చేయడం గొప్ప కార్యక్రమని, తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. తర్వాత అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో బాల్‌థాల్ అన్నదాన శిబిరంకు తరలించే వంట సామగ్రి సరుకుల లారీని జెండా ఊపి ప్రారంభించారు.
కోనాయిపల్లి వెంకన్నకు ముడుపు అప్పగింత నంగునూరు: మంత్రిగా తనకు వచ్చే నెల జీతంను నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి హుండీలోనే వేస్తానని హరీశ్‌రావు చెప్పారు. మంత్రిగా తొలిసారి సెంట్‌మెంట్ దేవాలయమైన కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలోని గ్రామాల్లో ఓటేస్తాం…నోటు ఇస్తామంటూ ప్రజలు విరాళాలలు ఇచ్చారు. అలా వచ్చిన సుమారు రూ.1,40,782లను అప్పట్లో ముడుపుకట్టారు. ఆ ముడుపును ఆదివారం కోనాయిపల్లి వెంకటేశ్వరాలయంలో విప్పి మొక్కు చెల్లించారు. సీఎం కేసీఆర్‌కు ఇష్టదైవమైన కోనాయిపల్లి వెంకన్నస్వామి ఆలయఅభివృద్ధికి త్వరలో నిధులు మంజూరు చేస్తామన్నారు.