-కుట్రలను ఛేదించాం.. కుతంత్రాలను తిప్పికొట్టాం
-అభివృద్ధిలో అగ్రపథాన నిలిచాం
-నాలుగేండ్ల ప్రగతిని నివేదించిన సీఎం కేసీఆర్
-చారిత్రాత్మక గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకావిష్కరణ
-విఫలరాష్ట్రం కాదు సఫలమైన రాష్ట్రం తెలంగాణ
-చిల్లరమల్లర రాజకీయాలు.. వ్యర్థ వివాదాలకు దూరం
-వచ్చే నెలలో రెండోదశ మెట్రో రైలు పరుగులు
-అగ్రవర్ణాలలో పేదలకు ప్రత్యేక పథకాలు
-కొత్త జోనల్ విధానానికి కేంద్రం సానుకూలం: కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు మిగిల్చిన విధ్వంసాలు, విషాదాలను అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రం విజయపరంపరతో అప్రతిహతంగా ముందుకు సాగుతున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ర్టాన్ని సాధించిన సంకల్పబలంతో బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం అభివృద్ధి ఒక్కటే ధ్యేయంగా పనిచేస్తుంటే, కొంతమంది కేవలం క్షుద్రరాజకీయ ప్రయోజనాలకోసం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రతీపశక్తుల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొంటూ, కుట్రలను ఛేదిస్తూ ధైర్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. నిత్యం అలజడులు సృష్టించే ప్రయత్నాలను తిప్పికొడుతూ రాజకీయ సుస్థిరతను నెలకొల్పామని, రాజకీయ అవినీతిలేని పరిపాలన అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం గోల్కొండ కోటలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఈ పంద్రాగస్టు నుంచి కొత్తగా కంటివెలుగు, బీసీలకు వందశాతం సబ్సిడీపై రుణాలు, రైతుబంధు జీవిత బీమా పథకాలు ప్రారంభమైనట్టు ప్రకటించారు. మిషన్ భగీరథ కింద అన్ని గ్రామాలకు బల్క్ వాటర్ సరఫరా, పల్లెలను పరిశుభ్రంగా మార్చేందుకు కార్యాచరణ మొదలయ్యాయని వివరించారు. తెలంగాణలో సం క్షేమ పథకాల అమలులో స్వర్ణయుగం నడుస్తున్నదని చెప్పారు. అగ్రవర్ణాల్లోని పేదల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు తీసుకువస్తున్నామని తెలిపారు.
స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కాలన్న ప్రధాన లక్ష్యంతో తెచ్చిన కొత్త జోనల్ చట్టాన్ని ఆమోదించడానికి కేంద్రం సానుకూలత వ్యక్తంచేసిందని సీఎం వెల్లడించారు. హైదరాబాద్ మీదుగా ఇతర ప్రాం తాలకు వెళ్లేందుకు ట్రాఫిక్ సమస్య లేకుండా ఔటర్ రింగురోడ్డుకు అవతల 330 కిలోమీటర్ల రీజినల్ రింగురోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వచ్చే నెల నుంచి అమీర్‌పేట్- ఎల్బీనగర్, నవంబర్‌లో అమీర్‌పేట- హైటెక్‌సిటీ మార్గాల్లో మెట్రోరైలు నడిపించడానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయని ప్రకటించారు. అన్నిరంగాల్లో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ అనతికాలంలోనే దేశం గర్విం చే రాష్ట్రంగా గుర్తింపు పొందిందని, తనను తాను నిర్మించుకుంటూ జాతి నిర్మాణానికి దోహదం చేస్తున్నదన్నారు. ప్రధాని మోదీ ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ ఏపీ విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎంతో పరిణతితో వ్యవహరించిందని, రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపించడంలోనే సంపూర్ణంగా నిమగ్నమైందని ప్రకటించారని గుర్తుచేశారు. ఆయన చెప్పినట్టుగానే మనం చిల్లరమల్లర రాజకీయాలతోనో, వ్యర్థ వివాదాలతోనో పొద్దుపుచ్చలేదు. ఈ నాలుగేండ్ల విలువైన సమయాన్ని తెలంగాణ భవిష్యత్తుకు తగిన అభివృద్ధి ప్రాతిపదికలు నిర్మించేందుకు సమర్థంగా వినియోగించుకున్నాం. దృఢసంకల్పంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రస్థానం సాగుతున్నది అని చెప్పారు.
విఫల రాష్ట్రంగా చూపేందుకు కుట్రలు తెలంగాణను విఫల రాష్ట్రంగా మార్చాలనే కుట్రలు జరిగాయని, ప్రజల ఐక్యతను విచ్ఛిన్నంచేసే కుటిలయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతీపశక్తుల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగుతున్నామని, సమస్యలను పరిష్కరించే క్రమంలో సవాళ్లను చాకచక్యంగా అధిగమిస్తున్నామని తెలిపారు. అగమ్యగోచరంగా ఉన్న ఆర్థికవ్యవస్థను గాడిలోపెట్టి, ప్రగతిదిశలో నడిపించాం. గడిచిన నాలుగేండ్లలో తెలంగాణ ఏడాదికి సగటున 17.12% ఆదాయ వృద్ధిరేటు సాధించింది. పురోగామి రాష్ట్రంగా దేశంలో ప్రథమస్థానాన్ని ఆక్రమించింది అని వెల్లడించారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా మనుగడ సాగిస్తుందా? అనే భయసందేహాలను తొలిగించామని, దేశానికే మార్గనిర్దేశనం చేసే రాష్ట్రంగా నిలబెట్టామని చెప్పారు.
బంగారు తెలంగాణ కోసం పునరంకితం ఆనాడు జలదృశ్యంలో ఉద్యమానికి ఉద్యుక్తుడినవుతూ, నేను గనక పోరాటాన్ని మధ్యలో ఆపితే నన్ను రాళ్లతో కొట్టండి అని సాహసోపేతమైన ప్రతిజ్ఞ చేశాను. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సుసాధ్యం చేసేవరకు విశ్రమించలేదు. నేడు అదే సంకల్పబలంతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పునరంకితమవుతున్నాను. ఈ ప్రయాణంలో ప్రజలే నాకు అండదండ. వారి దీవెనలే నాకు ప్రేరణ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. తెలంగాణ విజయయాత్ర ఇదే విధంగా కొనసాగేందుకు తగిన బలాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు అందించాలని విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా పరిపాలనలో, పోలీసు వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలు, సంక్షేమం, విద్య, వైద్యం, కులవృత్తులు, మైనార్టీలు, మహిళా భద్రత, తదితర రంగాల్లో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. నేత కార్మికుల సంక్షేమానికి, ఖాయిలాపడ్డ పరిశ్రమలను తెరిపించేందుకు, పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. పేదలకు మెరుగైన ఆరోగ్యం లభించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ వైద్యశాలల్లో వసతులు కల్పించి, దవాఖానలపై ప్రజల్లో విశ్వాసం పెంచినట్టు చెప్పారు. కేసీఆర్ కిట్స్, అమ్మ ఒడి విజయవంతమయ్యాయని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, షీ టీమ్స్, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు రాష్ట్రం లో మహిళల అభ్యున్నతికి, భద్రతకు దోహదపడుతున్నాయన్నారు. ఇటీవలి సివిల్స్ పరీక్షల్లో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు విజయం సాధించారని సీఎం ప్రస్తావించారు. దేశం మొత్తంమీద ప్రథమస్థానం సాధించింది కూడా తెలంగాణ బిడ్డే కావడం మనందరికీ గర్వకారణమన్నారు. అనేకమంది క్రీడాకారులు, పర్వతారోహకులు రాష్ట్రం నుంచి వెలుగులోకిరావడం, రాష్ర్టానికి, దేశానికి గౌరవం తీసుకురావడం సంతోషదాయకమని చెప్పారు.
గ్రామీణ ఆర్థికవ్యవస్థకు పునరుత్తేజం సమైక్యరాష్ట్రంలో తెలంగాణ గ్రామీణఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారి స్థితిగతులు మార్చాలని, తద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థను తిరిగి నిలబెట్టాలని భావించిందని చెప్పారు. అందుకు.. నేటికీ మనుగడలో ఉన్న కులవృత్తులకు తగిన ఆర్థిక మద్దతునివ్వడం, ఇంకా పాత సంప్రదాయ పద్ధతులనే అనుసరిస్తున్న కులవృత్తులవారికి ఆధునిక పరిజ్ఞానాన్ని, పరికరాలను అందించి నిలబెట్టటం, పూర్తిగా అంతరించిపోయిన వృత్తులపై ఇంకా ఆధారపడినవారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపించటం అనే మూడంచెల వ్యూహాన్ని ఎంచుకుని, ప్రత్యేకంగా పథకాలు అమలుచేస్తున్నామని చెప్పారు. ఈ దిశగా గొర్రెలు, బర్రెలు పంపిణీ, చేపల పెంపకంవంటి చర్యలు తీసుకున్నదని, నాయీబ్రాహ్మణులు, రజకులకు అధునాతన యంత్రాలు అందిస్తున్నదని చెప్పారు.
వ్యవసాయరంగ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు సమైక్యరాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా అత్యంత దయనీయంగా ఉండేదని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఈ దశలో వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించి, రైతులలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించిందని తెలిపారు. రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపు, వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను రద్దు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని ఆరు లక్షల రూపాయలకు పెంపు తదితర నిర్ణయాలు అమలుచేసిందని, సకాలంలో ఎరువులు, విత్తనాలను సరఫరా చేస్తున్నదని వివరించారు. దేశంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరంటు సరఫరాచేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. అన్ని స్థాయిల్లో సామాజిక న్యాయం అమలుకావాలని దేశంలోనే తొలిసారి మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ ప్రవేశపెట్టి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళారైతులకు మార్కెట్ చైర్మన్లు అయ్యే హక్కును కల్పించిందని వివరించారు. తెలంగాణ వచ్చేనాటికి 4.17 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన 176 గోదాములుంటే.. నాలుగేండ్లలో వాటి నిల్వ సామర్థ్యం 22.47 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను శరవేగంగా నిర్మిస్తున్నామని చెప్పారు. ఉమ్మడిరాష్ట్రంలో ధ్వంసమైన చెరువులను మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరిస్తున్నామని, వీటిని ప్రాజెక్టులతో అనుసంధానిస్తే ఏడాది పొడవునా చెరువులు నీటితో కళకళలాడుతాయని తెలిపారు.
మిషన్ భగీరథ.. ఓ అద్భుతం తెలంగాణ ఆవిష్కరించిన ఒక అద్భుతం మిషన్ భగీరథ. శుద్ధిచేసిన నదీ జలాలను ప్రతీ ఇంటికీ, అందించడానికి లక్షా 40 వేల కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణం జరిగింది. ఇప్పటికే 19 వేల పైచిలుకు ఆవాస ప్రాం తాలకు శుద్ధిచేసిన జలాలు చేరుతున్నాయి. ఈ పథకంపై దేశంలోని 11 రాష్ర్టాలు ఆసక్తి చూపుతున్నాయి అని సీఎం వివరించారు. కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం సానుకూలం తెలంగాణ సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా పొందాలంటే స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కాలని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానికుల హక్కులు పరిరక్షించటం కోసం, ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు. లోకల్ క్యాడర్ ఉద్యోగాలలో 95% అవకాశాలు స్థానికులకే లభించేలా డిస్ట్రిక్ట్ క్యాడర్‌తోపాటు ఏడు జోన్లు, రెండు మల్టిజోన్లు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. దీన్ని ఆమోదించేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తంచేసిందని వెల్లడించారు.
సంక్షేమంలో స్వర్ణయుగం దేశంలో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక గుర్తింపు పొందిందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజలు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని చవిచూస్తున్నారు. రూ.40 వేలకోట్లతో 40కి పైగా సంక్షేమ పథకాలు అమలుచేస్తూ ప్రజాసంక్షేమంలో దేశంలో నంబర్ వన్‌గా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో రూ.5,367 కోట్లతో 41.78 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రూపాయికి కిలో చొప్పున బియ్యాన్ని అందిస్తున్నది. పాఠశాలల్లో, హాస్టళ్లలో, అంగన్‌వాడీల్లోని విద్యార్థులు ప్రతీ రోజు సన్నబియ్యంతో వండిన అన్నం తింటున్నారు. రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడపిల్ల పెండ్లికి సాయం అందించేందుకు కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ పథకం కింద లక్షా నూట పదహార్లు ఆర్థిక సహాయం అందిస్తున్నది అని వివరించారు.
విశ్వనగరంగా హైదరాబాద్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అమలుచేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. రూ.35 వేల కోట్లతో వివిధ నిర్మాణాలను చేపట్టిందన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణకు రూ.25 వేల కోట్లతో ప్రణాళికలు అమలుచేస్తున్నదని చెప్పారు. ైఫ్లెఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఉపరితల రహదారులు, అండర్‌పాస్‌లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి ఎస్సార్డీపీ ఊతమిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్.. ఔటర్ రింగురోడ్డును దాటుకుని శరవేగంగా విస్తరిస్తున్నదని సీఎం చెప్పారు. హైదరాబాద్ మీదుగా ఇతర ప్రాంతాలకు రాకపోకలూ ఎక్కువయ్యాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఔటర్ రింగురోడ్డుకు అవతల 330 కిలోమీటర్ల పొడవున రీజినల్ రింగురోడ్డును అంతర్జాతీయ స్థాయి ఎక్స్‌ప్రెస్ హైవేగా నిర్మించాలని నిర్ణయించిందని చెప్పారు.
ప్రతీ ఒక్కరు మొక్క నాటాలి.. భవిష్యత్‌తరాలకు నిర్మలమైన, పచ్చని పర్యావరణాన్ని అందించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. హరితహారంలో ప్రజలు ఉత్సాహంగా భాగస్వాములు కావడంపై సంతోషం వ్యక్తంచేశారు. ప్రతీ ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటి, వాటిని పెంచాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.