-కార్యాచరణ సిద్ధంచేస్తున్న కేసీఆర్ -7న హెచ్చార్డీలో కీలక సమావేశం.. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామస్థాయి నుంచి ప్రణాళికలు -వాటి ఆధారంగా రానున్న ఐదేళ్ల పాలన.. -సమగ్ర నివేదికలతో సమావేశానికి రండి -అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు

బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వ అడుగులు వేగం పుంజుకుంటున్నాయి. శాసించే స్థితికి వచ్చిన తెలంగాణ భవిష్యత్తుకు భరోసానిస్తూ సాగిన నెల రోజుల పాలనకు ఇక విస్తృత స్థాయి రూపాన్నిచ్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమాయత్తమవుతున్నారు. కేవలం ఆదేశాలకు పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరించి.. సమగ్ర అభివృద్ధికి నిర్దిష్ట కార్యాచరణను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. దాని ఆధారంగా రానున్న ఐదేండ్ల పరిపాలన కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రణాళికల తయారీలో జిల్లా కలెక్టర్లు, సెక్టోరియల్ అధికారులు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులతోపాటు.. ఇతర కీలక ప్రభుత్వ విభాగాలన్నింటినీ విశ్వాసంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అలా రూపొందించిన ప్రణాళికలపై చర్చించి బృహత్తర భవిష్యత్ కార్యాచరణ తయారు చేసేందుకు నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివద్ధి సంస్థ (ఎంసీహెచ్చార్డీ)లో ఈ నెల 7న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలేమిటి? లక్ష్యాలేమిటి? అనే అంశాలపై అధికారులకు విడమర్చి చెప్పాలని సీఎం భావిస్తున్నారు. కీలకమైన ఆ సమావేశం నేపథ్యంలో బుధవారం హెచ్చార్డీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో పాటు ఇతర ముఖ్యశాఖల అధికారులతో కేసీఆర్ భేటీ నిర్వహించారు.
ఒకే విధానం, ఒకే పద్ధతి పెట్టుకోకుండా, ప్రతి ఒక్క జిల్లాకూ అక్కడి స్థానిక వనరులు, పరిస్థితులను బట్టి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కొత్త రాష్ట్రంలో సరికొత్త పాలన, సరికొత్త పంథా అవలంబించాలని సూచించారు. ఈ విధాన రూపకల్పనలో భాగంగా సీఎం నుంచి సర్పంచ్, వార్డు కౌన్సిలర్ల వరకు భాగస్వాములయితే అభివృద్ధికి మరింత దోహదం చేసే అంశాలు వెలుగులోకి వస్తాయని సీఎం భావిస్తున్నారు. దీనివల్ల ఎవరి ప్రాంతాన్ని వారు అభివృద్ధి చేసుకోవాలనే భావన పెరుగుతుందని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నట్టు తెలిసింది. అందుకే ప్రతి ఒక్కరి భాగస్వామ్యం తీసుకుని అభివృద్ధి ప్రణాళిక రూపొందించేందుకు కృషి చేయాలని ఆయన అధికారులను కోరారు. ప్రస్తుతం అమలవుతున్న చట్టాలు, పథకాలు, పద్ధతులు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ దృక్పథంతో ఉన్నాయని, సీమాంధ్ర పక్షపాతంతో ఉన్నాయని కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు కూడా. ఈ చట్టాలను అవసరమైన మేరకు మార్చుకోవాలన్న ఉద్దేశాన్ని ఆయన బుధవారం నాటి భేటీలో అధికారులకు వివరించారు.
భూ పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు 500 మంది ప్రత్యేక అధికారులతో బ్రిగేడ్ ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సమాయత్తం అవుతున్నారు. సర్పంచ్ నుంచి ఎమ్యెల్యే వరకు చాలా మంది కొత్త వారేనని, వారికి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే తపన సహజంగా ఉంటుందని, వీరికి సరైన మార్గదర్శకాలు అందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని సీఎం ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధుల కోసం శిక్షణాకార్యక్రమాలు కూడా నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో అవినీతిని జీరో స్థాయికి తీసుకువచ్చేందుకు ఎక్కడా రాజీపడేది లేదని అధికారులకు కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా సీఎం చర్చించారు. కలెక్టరేట్ల అభివృద్ధి, జాయింట్ కలెక్టర్ల సంఖ్య పెంపు, విద్య, వైద్యం, సంక్షేమంపై ప్రత్యేకాధికారులను నియమించేందుకు కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, హెచ్చార్డీ డైరెక్టర్ జనరల్ లక్ష్మీపార్థసారధి, ఎంపీలు బీ వినోద్, కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు ఏకే గోయల్, విద్యాసాగర్‌రావు, రమణాచారి, పాపారావు, రామలక్ష్మణ్, రాజిరెడ్డి, సీనియర్ ఐఏఎస్‌లు అజయ్‌మిశ్రా, రేమాండ్ పీటర్, పార్థసారధి, నాగిరెడ్డి, స్మిత సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.