భౌగోళికంగా ఏ రాష్ట్రంలో ఉన్న సంస్థలు ఆ రాష్ర్టానికి చెందుతయి. ఇంత చిన్న విషయం చంద్రబాబుకు తెలియక కాదు.. అయినా తెలంగాణ గడ్డపై హైదరాబాద్‌లో ఉన్న న్యాక్‌కు చంద్రబాబును చైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిన్నటికి నిన్న విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఇప్పుడు న్యాక్.. ఇలా చంద్రబాబు ప్రతిరోజు తెలంగాణతో గిచ్చి కయ్యాలు పెట్టుకుంటున్నారు. ఆయన ఇలా తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించడం రెండు రాష్ర్టాలకు మంచిది కాదు అని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

-గిచ్చి కయ్యాలు పెడుతున్నవ్ -తెలంగాణ గడ్డపై న్యాక్ చైర్మన్‌గా ఎలా నియమించుకుంటావ్? -టీటీడీ చైర్మన్‌గా తెలంగాణవారిని నియమిస్తే అంగీకరిస్తారా? -భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ధ్వజం పదేండ్లు ఉమ్మడి రాజధానిగా అవకాశం ఇస్తే.. బాబు తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాయంలో హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన తెలంగాణ వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ (న్యాక్)కు తనను తాను చైర్మన్‌గా నియమించుకుంటూ నిన్న (మంగళవారం) జీవో 72 విడుదల చేశారు. దిగజారుడు తనానికి ఇది నిదర్శనం. తెలంగాణ సహనాన్ని పరీక్షిస్తుండ్రు. ఏపీలోని పలు పట్టణాల్లో న్యాక్ శాఖలున్నాయి.
కావాలంటే వాటికి చంద్రబాబును చైర్మన్‌గా నియమించుకోవచ్చు. ఇప్పటికైనా గవర్నర్, కేంద్రం బాబును కట్టడి చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా తెలంగాణ వ్యక్తిని నియమిస్తే అంగీకరిస్తరా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఏపీలో వస్తున్న తీవ్ర ప్రజాగ్రహాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నరు. విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడితే.. న్యాక్‌కు చైర్మన్‌గా నియమించుకుంటే రైతులు, డ్వాక్రా మహిళలకు ఉపశమనం కలుగుతుందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
రైతు ఆత్మహత్యలపై కేంద్ర మంత్రి ఒకలా మాట్లాడితే, ఇక్కడి టీడీపీ, బీజేపీ నాయకులు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్లమెంటులో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్ తెలంగాణలో 69 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ప్రకటించిండ్రు. కానీ తెలంగాణ టీడీపీ, బీజేపీ నేతలు మాత్రం 200, 400 మంది అని చెప్తున్నరు. మరి తెలంగాణ బీజేపీ నాయకులు చెప్పింది నిజమా? ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి చెప్పింది నిజమా? ఏది నమ్మాలి? అని ఆయన ప్రశ్నించారు.