-కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను రూపొందించాలి
-సేవల్లో అవినీతికి ఆస్కారం ఉండొద్దు
-లంచాలు లేని వ్యవస్థ తీసుకురావాలి
-అందుకు కఠినమైన చట్టాలు చేయాలి
-అప్పుడే పాలనాసంస్కరణల లక్ష్యం నెరవేరుతుంది
-ప్రజలకు మంచిసేవ చేయడంకన్నా గొప్ప బాధ్యతలేవి?
-జిల్లా, రాష్ట్రస్థాయిలో పటిష్ఠమైన అధికారవ్యవస్థలు
-స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటును పరిశీలించాలి
-పట్టణ అవసరాలకు అనుగుణంగా అర్బన్‌పాలసీ
-మంత్రులు, అధికారులతో సీఎం కే చంద్రశేఖర్‌రావు సమీక్ష

రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేనివిధంగా ప్రజలకు మరింత బాగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పట్టణప్రాంతాలను ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలని చెప్పారు. కలెక్టర్, జిల్లా పరిపాలనాధికారి పేరుతో పిలిచే ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని అడిషనల్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్‌గా పిలిచే ముఖ్య అధికారుల బృం దంతో జిల్లాస్థాయిలో పటిష్ఠమైన అధికారిక వ్యవస్థను ఏర్పాటుచేయాలని చెప్పారు. లే అవుట్లకు అనుమతులు, ఆస్తుల అంచనాలు (అసెస్మెంట్స్) తదితర పనులన్నీ ఈ అధికారిక బృందం ఆధ్వర్యంలోనే జరుగాలని వివరించారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుచేసే విషయం పరి శీలించాలన్నారు. కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాల రూపకల్పనపై శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మంచి సేవలు అందించడంకన్నా ప్రజాప్రతినిధులు, అధికారులకు గొప్ప బాధ్యతలేవీ లేవన్నారు. ఎవరికీ ఎక్కడా ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా ప్రజలకు పని జరుగాలి. రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కావాల్సిన పనులు జరుగాలి. దీనికోసం కఠినమైన కొత్తచట్టాలు తేవాలి. రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యంవల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. వాటిని పనిచేసే పాలనా విభాగాలుగా మార్చాలి. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు కూడా వాటి విధుల విషయంలో స్పష్టతనివ్వాలి. కొత్త జిల్లాలను, కొత్త డివిజన్లను, కొత్త మండలాలను, కొత్త మున్సిపాలిటీలను, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేసుకుని పరిపాలనా సంస్కరణలకు శ్రీకారంచుట్టాం. ఆయా కార్యాలయాల్లో అవినీతిలేకుండా ప్రజలకు పనికావడంతోనే ఈ సంస్కరణల లక్ష్యం నెరవేరుతుంది అని ముఖ్యమంత్రి చెప్పారు.
ప్రజలు లంచం ఎందుకివ్వాలి?
నాకు ప్రజల నుంచి వేలసంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. లంచం ఇవ్వకుంటే పనులుకావడంలేదని మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.. నిందిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు తిట్లుపడాలి? ప్రజలు ఎందుకు లంచాలివ్వాలి? లంచాలులేని వ్యవస్థను తీసుకురావాలి. ఇందుకోసం పటిష్టమైన చట్టాలు రూపొందించి పకడ్బందీగా అమలుచేయాలి. రెవెన్యూలో, రిజిస్ట్రేషన్లలో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో ఒక్కపైసా ఇవ్వకుండా పనులు జరిగే పరిస్థితులు రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ముఖ్యమంత్రి ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు.
జిల్లాస్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థ
జిల్లా ముఖ్య పరిపాలనాధికారి సారథ్యంలో సీనియర్ అధికారుల నాయకత్వంలో జిల్లాస్థాయిలో పటిష్టమైన అధికారిక వ్యవస్థ ఉండాలి. భూమి శిస్తులు, నీటి రఖాలు వసూలుచేసినప్పుడు కలెక్టర్ అనే పదం పుట్టింది. ఇప్పటికీ అదే పేరుతో పిలుస్తున్నారు. మారిన పరిస్థితుల్లో ఇంకా కలెక్టర్ అని పిలవాలా? లేక జిల్లా పరిపాలనాధికారి అనే పేరు పెట్టాలా? అని ఆలోచించాలి. కలెక్టర్ లేదా జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో ఐదారుగురు ముఖ్యమైన అధికారుల బృందాన్ని ఏర్పాటుచేయాలి. వారికి కొన్ని నిర్దిష్టశాఖలు అప్పగించాలి. జిల్లాస్థాయిలో ముఖ్యమైన పనులన్నీ ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని అధికారుల బృందం పర్యవేక్షించాలి.
ప్రభుత్వ కార్యక్రమాలను అమలుచేయడం, ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా సేవలు అందించడం, అవినీతికి, అలసత్వానికి పాల్పడేవారిపై చర్యలు తీసుకోవడం ఈ అధికారి బాధ్యత. కలెక్టర్/పరిపాలనాధికారి, అడిషనల్ కలెక్టర్/అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విధులు, బాధ్యతలను నిర్దిష్టంగా పేర్కొనాలి. లే అవుట్ల అనుమతులు, ఆస్తుల అంచనాలు (ప్రాపర్టీ అసెస్మెంట్లు) తదితర పనులు ఐఏఎస్ అధికారి నాయకత్వంలోని బృందం చేయాల్సి ఉంటుంది అని సీఎం చెప్పారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లాగా తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను నెలకొల్పి రాష్ట్రంలోని స్థితిగతులకు అనుగుణంగా పాలన సజావుగా సాగే ప్రక్రియను ప్రవేశపెట్టే అవకాశాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎస్ నాయకత్వంలో రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో ఐఏఎస్ అధికారి నాయకత్వంలో అధికార యంత్రాంగం ఏర్పడినట్లే, రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నాయకత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పడాలి. సీఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ సీఎస్‌లను నియమించాలి. వారికి శాఖలు అప్పగించాలి. జిల్లాస్థాయిలో ఐఏఎస్ అధికారి నాయకత్వంలో పనిచేసే బృందం పనితీరును సీఎస్ నాయకత్వంలోని బృందం పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడు కావాల్సిన నిర్ణయాలను ఈ బృందం తీసుకోవాలి అని ముఖ్యమంత్రి సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు.. పారిశుద్ధ్యం, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దృష్టిపెట్టాల్సి ఉంది. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో విధిగా వైకుంఠధామం నిర్మించాలి. నర్సరీ ఏర్పాటుచేయాలి. అనుమతులు, సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు. ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి రావాలి. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండాలి. ఈ అంశాలన్నీ కొత్తగా రూపొందించే చట్టంలో పొందుపర్చాలి అని ముఖ్యమంత్రి చెప్పారు.
పట్టణ జనాభాకు అనుగుణంగా అర్బన్ పాలసీ
తెలంగాణలో పట్టణ జనాభా బాగా పెరుగుతున్నది. పట్టణాల్లో ఏర్పడే అవసరాలను తీర్చేవిధంగా తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. హైదరాబాద్ నగరానికి సంబంధించిన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు ప్రత్యేక విధానం రూపొందించాలి. ఇతర పట్టణాలు, నగరాలను ఎలా తీర్చిదిద్దాలనే విషయంపై తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలి. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణమైన విధాన రూపకల్పన జరుగాలి అని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్, మండలిలో విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కే తారక రామారావు, బాల్క సుమన్, వివేకానందగౌడ్, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.