-కరీంనగర్‌లో సీఎం కేసీఆర్ శ్రీకారం -అదేరోజు 500 యూనిట్లలో 500 గ్రామాల్లో భూపంపిణీ -ఆలోపు దళితుల స్థితిగతులపై గ్రామాల్లో సర్వే -ప్రతి నిరుపేద దళిత కుటుంబానికీ 3 ఎకరాల సాగుభూమి ఇస్తాం -దళిత మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ -ఎస్సీ సబ్‌ప్లాన్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన -ఎస్సీ సబ్‌ప్లాన్ 15.4 శాతం -నిధులు వారి అభివృద్ధికే -వచ్చే ఐదేళ్లలో సబ్ ప్లాన్ కింద రూ.50వేల కోట్లు ఖర్చు -సాంఘిక సంక్షేమ శాఖ పేరు ఎస్సీ అభివృద్ధి శాఖగా మార్పు -పథకాల అమలులో పూర్తి పారదర్శకత పాటించాలి -దళితవాడలతో మిళితం కావాలని కలెక్టర్లకు ఆదేశం

దళితుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో పనిచేసి సత్ఫలితాలు సాధిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్‌ను ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. భూమిలేని వ్యవసాయాధార దళిత కుటుంబాలకు మూడేసి ఎకరాల చొప్పున సాగుభూమి అందజేస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుందని, తాను కరీంనగర్‌లో ప్రారంభిస్తానని ప్రకటించారు. వివిధ జిల్లాల్లో చేపట్టే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని చెప్పారు. ఆలోపు దళితుల స్థితిగతులపై గ్రామాల్లో సర్వే నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సీల అభివృద్ధి కోసం అమలు చేయాల్సిన పథకాలపై మంగళవారం సచివాలయంలో పది జిల్లాల కలెక్టర్లతో మేధోమథనం నిర్వహించారు. సుమారు మూడున్నరగంటలపాటు సుదీర్ఘంగా జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సలహాదారు రామలక్ష్మణ్, సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రాధ, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్, ప్రత్యేక ఆహ్వానితులుగా మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పాల్గొన్నారు.
నిరుపేద దళిత కుటుంబాలకిచ్చే మూడెకరాల సాగుభూమిని దళిత మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ర్టాన్ని 500 యూనిట్లుగా చేసి 500 గ్రామాల్లో భూపంపిణీ చేపట్టాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి కోరారు. గ్రామాల్లో దళితుల స్థితిగతులకు సంబంధించి గ్రామాల్లో సర్వే నిర్వహించి ఆగస్టు 15లోపు నివేదిక ఇవ్వాలని సూచించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద బడ్జెట్‌లో కేటాయించే 15.4 శాతం నిధులను పూర్తిగా వారి అభివృద్ధికే వెచ్చిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే ఐదేళ్లలో సబ్ ప్లాన్ కింద రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ పేరును ఇకపై ఎస్సీఅభివృద్ధి శాఖగా మారుస్తామని తెలిపారు. దళితుల అభివృద్ధి పథకాల అమలులో పూర్తి పారదర్శకత పాటించాలని, దళితవాడలతో మిళితం కావాలని కలెక్టర్లను ఆదేశించారు.
వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో ఎస్సీల అభివృద్ధి కోసం అవసరమైన ప్రత్యేక కార్యక్రమాల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. మూడెకరాల భూ పంపిణీ లబ్ధిదారులకు సంబంధించి మొదట ఒక గ్రామాన్ని తీసుకొని ఆ తర్వాత అన్ని జిల్లాల్లోని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఎస్సీల అభివృద్ధి కోసం ప్రతి జిల్లాలో రాబోయే ఐదేళ్లలో దాదాపు 4వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. దళితుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు వస్తాయని, అవన్నీ కలిపి ప్రతి జిల్లాకు ఏడాదికి రూ.600కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. దళితవాడల్లో దారిద్య్రాన్ని పారదోలేందుకు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టే ఈ పోరాటానికి జిలా కలెక్టర్లే సారథులుగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎందుకు జరుగదో చూసుకుందామనే.. సమావేశంలో ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల నుంచి ఆయా జిల్లాల దళితుల స్థితిగతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు దళితుల అభివృద్ధి పేరిట ప్రచారం బాగా జరిగింది కానీ దళితుల బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. అందుకోసమే తెలంగాణలోని దళితుల అభివృద్ధి కోసం కొత్త పథకాల అవసరం ఉందన్నారు. దళితుల అభివృద్ధి కోసం రూపొందించే పథకాలు, కార్యక్రమాల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలువాలని అభిలషించారు. ఇప్పటివరకు ఎస్సీల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు లెక్కలున్నాయని, ప్రచారం కూడా బాగానే జరిగిందని, కానీ దళితుల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఊరికి పోయి అడిగినా అక్కడ అత్యంత నిరుపేదలు దళితులే అనే సమాధానం వస్తోందని, వచ్చే ఐదేండ్లలో ఈ పరిస్థితుల్లో మార్పులు రావాలని సూచించారు. రాబోయే ఐదేండ్లలో బీపీఎల్ కింద (దారిద్య్రరేఖకు దిగువన) ఉన్న దళితులంతా ఆ పరిధిదాటి ఏపీఎల్‌లోకి రావాలని సీఎం ఆకాంక్షించారు.
సాంఘిక సంక్షేమ శాఖ పేరును ఎస్సీ అభివృద్ధి శాఖగా మార్చాలని అధికారులను కోరారు. గతంలో ఎస్సీల జనాభా ప్రకారం నిధుల కేటాయింపు జరిగినా, వివిధ శాఖల ద్వారా ఆ నిధులను ఖర్చు చేయించారని, అందువల్ల దళితులకు మేలు కలుగలేదని కేసీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుల కోసం కేటాయించే 15.4శాతం నిధులను కేవలం ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్టుమెంట్‌కే ఇస్తుందని చెప్పారు. దళితులు ఎందుకు అభివృద్ధి చెందరో తేల్చుకుందామనే ఉద్దేశంతోనే సాంఘిక సంక్షేమ శాఖను తన వద్ద పెట్టుకొన్నానని ముఖ్యమంత్రి అన్నారు. దళితుల అభివృద్ధిని ఓ సవాల్‌గా స్వీకరించి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు అమలు చేయాలి, ఏ పథకాలు రూపొందించాలి అనే విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధారణ మార్గ దర్మకాలు మాత్రమే ఇస్తామని కలెక్టర్లే తమ జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, స్థితిగతుల ఆధారంగా కార్యక్రమాలు రూపొందించి అమలుచేయాలని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కలెక్టర్లే నేరుగా పర్యవేక్షించాలని, ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. పథకాల రూపకల్పన నుంచి అమలువరకు కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో ఒక ప్రత్యేకాధికారిని ఎస్సీల అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు నియమిస్తామని చెప్పారు.
భూపంపిణీలో ఎలాంటి అవకతవకలుండొద్దు దళితులకు భూపంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా ప్రజాప్రతినిధుల సహకారంతో పూర్తి పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. విద్యావంతులైన దళిత యువతీయువకులతో దళిత బస్తీ కమిటీలు వేయాలని, వారి భాగస్వామ్యంలో కార్యక్రమాలు జరగాలని కలెక్టర్లకు సూచించారు. దళిత యువతే దళిత వెలుగుదివ్వెలు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జనాభా ఆధారంగా నిధుల కేటాయింపు జరగాలన్నారు. అతి నిరుపేద దళితుల అభివృద్ధి మొదటి ప్రాధాన్యంగా పెట్టుకోవాలని కోరారు. ఇప్పటికే ఒకటో రెండో ఎకరాల భూమి ఉన్నవారికి కూడా మిగితా భూమిని ప్రభుత్వం సమకూర్చి పేదలకు ఖచ్చితంగా మూడెకరాల భూమి దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం అవసరమున్నచోట రద్దు బదలు పథకాన్ని కూడా అమలు చేస్తామని తెలిపారు. కమతాల ఏకీకరణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దళితులకిచ్చే భూములను మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాలవారీగా దళితుల విద్య, ఆరోగ్యం, వయస్సు, భూమి, ఉద్యోగం తదితర అంశాలపై సమగ్ర వివరాలతో స్టేటస్ రిపోర్టు తయారుచేయాలని, దాని ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు.
బ్యాంకు లింకేజీతో అమలు చేసే కార్యక్రమాలను, బ్యాంకుతో సంబంధం లేకుండా అమలు చేసే కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకునేంత చైతన్యం దళితుల్లో లేనందనే అధికారులే చొరవ తీసుకుని వారికి కావాల్సిన డాక్యుమెంట్లు సిద్ధం చేసివ్వాలని ఆదేశించారు. కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఎస్సీల కోసం అమలుచేయాల్సిన కార్యక్రమాల గురించి స్థానికంగానే సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, దళిత సంఘాలు, మేధావులతో సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సూచించారు. మొత్తంగా తెలంగాణలో ఎస్సీల కోసం రూపొందించి విజయవంతంగా అమలు చేసే కార్యక్రమాలు దళితుల జీవితాల్లో సమగ్ర మార్పు తీసుకురావాలని కలెక్టర్లను కోరారు.