Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఆత్మహత్యల పాపం గత పాలకులదే!

-15 నెలల పసిగుడ్డు మీద నిందలు వేయవద్దు -ఐదేండ్ల తర్వాత రైతు ఆత్మహత్యలకు మాదే బాధ్యత -వచ్చే ఏడాది నుంచి రైతుకు 9 గంటల విద్యుత్ -రాజకీయాల కోసం వేలంపాట పాడుతున్న పక్కరాష్ట్ర పార్టీ -రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ -పాలేరు సెగ్మెంట్‌లో వాటర్‌గ్రిడ్ పథకానికి శంకుస్థాపన -వాటర్‌గ్రిడ్‌ను ఖమ్మంజిల్లాలో ముందుగా పూర్తిచేస్తాం: తుమ్మల

రైతు ఆత్మహత్యలకు ఉమ్మడి రాష్ట్ర పాలకుల దుష్పరిపాలనే కారణమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆ పాలన కారణంగా ప్రతిపంటా ఒక పునర్జన్మగా మారిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, దానికి పసిగుడ్డులాంటి తెలంగాణ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్న ప్రభుత్వాన్ని నిందించడం ఏ రకంగా భావ్యమని ఆయన ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు. అరవై ఏండ్ల పాపాలు కడగడానికి 15 నెలల సమయం సరిపోదని అంటూ ఐదేండ్ల తరువాత తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నా బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ప్రతిపక్షాలు చేతనైతే నిర్మాణాత్మక సలహాలివ్వాలే తప్ప రైతుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీయవద్దని విజప్తి చేశారు.

Panchayat-Raj-Minister-KT-Rama-Rao-inaugurated-water-grid-scheme

ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనంత ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని చెప్పారు. కొన్ని పార్టీలు నిన్నటిదాకా రూ 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా డిమాండ్ చేసి ప్రభుత్వం రూ. 6 లక్షలు ప్రకటించగానే వేలం పాట పెంచినట్టు ఇవాళ రూ.10 లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికలు వచ్చిన్నాడు తప్పకుండా పోరాడుదాం. ప్రజల వద్దకు పోదాం. వారికి మేము నచ్చితే మమ్మల్ని గెలిపిస్తారు. మేము వద్దనుకుంటే పక్కకు పెడతారు. కానీ ఇంకో మూడు, నాలుగేండ్లు ఏ ఎన్నికలు లేని సమయంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేసి, రంగుపులిమి అనవసరంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించవద్దని అన్ని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా అని కేటీఆర్ అన్నారు.

ఆదివారం ఖమ్మం అర్బన్ మండలంలో రూ.10 కోట్లతో నిర్మించిన మంచినీటి పథకానికి, రూరల్ మండలంలో రూ. 7 కోట్లతో నిర్మించిన మంచినీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పాలేరు నియోజకవర్గం జీళ్లచెరువు గ్రామం వద్ద రూ. 587 కోట్లతో నిర్మించతలపెట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేసి ఆ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. మంత్రి తుమ్మల, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కోరినట్లుగా తిరుమలాయపాలెం మండలానికి సాగునీరందించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ఐదేళ్ల తర్వాత మాదే బాధ్యత.. ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏండ్ల దుష్పపరిపాలన ఫలితంగా ఈరోజు రైతులు ఒక విషవలయంలో చిక్కుకున్నారని కేటీఆర్ అన్నారు. అందులోంచి బయటికి రాలేక ప్రతిపంటా ఒక పునర్జన్మగా మారిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. దానికి తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించడం భావ్యం కాదన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని స్థాయిలో ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీఎం నిర్ణయించారని చెప్పారు. బీహార్‌లో రూ.5 లక్షల పరిహారం ఇస్తూ అదీ ఏకమొత్తంగా కాకుండా కొంత అప్పులకు కొంత ఇతర అవసరాలకు ఇస్తున్నారని అధికారులు చెబితే, రూ. 5లక్షలు ఇచ్చి దానిలో తొంభై షరతులు పెట్టడం కాదు. మనం రూ. 5లక్షలు నేరుగా కుటుంబానికి, అదనంగా మరొక లక్ష రూపాయలు కుటుంబం చేసిన అప్పులకు ఇద్దామని క్యాబినెట్‌లో చెప్పారని పేర్కొన్నారు. దాంతోపాటు కుటుంబంలో పెళ్లీడు అమ్మాయి ఉంటే కులంతో నిమిత్తం లేకుండా కళ్యాణలక్ష్మిద్వారా రూ. 51వేలు ఇస్తామని ప్రకటించారని వివరించారు.

సంక్షేమం అభివృద్ధి జోడెద్దులుగా.. సంక్షేమాన్ని, అభివృద్ధి రెండింటినీ జోడించి జోడెద్దుల మాదిరిగా ముందుకు నడుపుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని గర్వంగా చెబుతున్నా అని కేటీఆర్ అన్నారు. వెంకటరెడ్డి వంటి పెద్దమనుషులు జీవితాన్ని చూసినవాళ్లు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినవాళ్లు కొత్త ప్రభుత్వానికి సమయం పడుతుందని సంయమనం పాటిస్తుంటే ఈ మధ్య కాలంలో ఢిల్లీలో అక్కడా ఇక్కడా పైరవీలతో పదవులు పొందిన నాయకులు మాత్రం ఎగిరెగిరి పడుతున్నారని కేటీఆర్ చురకలంటించారు. ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు మాత్రమే అయ్యిందని అంటూ ఇక్కడ జరిగింది కేవలం అధికార మార్పిడి మాత్రమే కాదు.

ఇక్కడ కొత్త రాష్ట్రం కూడా వచ్చింది అని గుర్తు చేశారు. కొత్త రాష్ర్టానికి అనేక బాలారిష్టాలు ఉంటాయని, అధికారులు ఎవరు ఎక్కడుంటారో తెలియకుండానే ఏడు నెలలు గడపాల్సి వచ్చిందని వివరించారు. సమస్యలన్నీ దాటుకుని రాష్ర్టాన్ని చక్కదిద్దే కార్యక్రమంలో ప్రభుత్వం ఉంటే కొందరు విమర్శలే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. అరవై సంవత్సరాల గబ్బు, అరవై సంవత్సరాల దుష్పపరిపాలనా ఫలితాలను వదిలించడానికి పదిహేను నెలలు సరిపోదన్నారు.

పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ముచ్చట మనకు వద్దు.. ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తావన మన రాష్ర్టానికి అవసరం లేదని కేటీఆర్ అన్నారు. ఖమ్మం ఎంపీ శ్రీనివాసరెడ్డి తన ప్రసంగంలో చంద్రబాబు ప్రస్తావన తేవడాన్ని ఉటంకిస్తూ ఏపీ సీఎంకు మన సీఎంకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఆయనకు బిల్డప్ ఎక్కువ.. పనితక్కువ. మన ముఖ్యమంత్రికి పని ఎక్కువ, బిల్డప్ తక్కువ. సొంత మామగారినే వెన్నులో పోటుపొడిచి అధికారాన్ని తెచ్చుకున్నది ఆయనైతే తెలంగాణకోసం పదవులను పక్కనపెట్టి చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి అన్నారు. పొరపాటున ఆ వ్యక్తిపేరు ఇక్కడ ప్రస్తావించినా ఖమ్మం జిల్లా రాజకీయాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు.

ఎన్నికలు కనుచూపు మేరలో లేని సమయంలో నిండు అసెంబ్లీలో రాబోయే నాలుగేండ్లలో ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగనని కేసీఆర్ ధైర్యంగా ప్రకటించారని అన్నారు. ఇలా ఓట్లడగననే దమ్ము ఆ పక్కరాష్ట్రం ముఖ్యమంత్రికి ఉందా ..? అని ప్రశ్నించారు. కొంతమంది ఎక్కడలేని మాటలు మాట్లాడుతున్నరని, పక్కరాష్ట్రం పార్టీ నాయకులైతే మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారని నిన్నమొన్నటిదాక రూ. 5లక్షలు నష్టపరిహారం కావాలని డిమాండ్ చేసి ముఖ్యమంత్రి ఆరు లక్షల రూపాయలు ప్రకటించగానే ..ఆరెట్లా ఇస్తారు, పది ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇదా పద్ధతి? రైతులను ఆదుకోవాలన్నది మీ సంకల్పమా? లేక చిల్లర మల్లర రాజకీయాలు చేయాలన్నదా? అని ప్రశ్నించారు.

మంత్రి తుమ్మల వంటి సీనియర్ నేత తన ముప్పై, ముప్పైఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో విద్యుత్ కోతలు లేని ఎండాకాలం తొలిసారి చూశానని చెప్తున్నారని, ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత కాదా? అని నిలదీశారు. వచ్చే ఏడాదినుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల విద్యుత్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు కరెంట్ ఎక్కడినుంచి వస్తదని భయోత్పాతాలు సృష్టించేలాగ మాట్లాడారని గుర్తు చేశారు. అయితే ఏ కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే తెలంగాణ అంధకారమైపోతుంది,

చీకటి రాజ్యమైపోతుందని చెప్పాడో, ఈరోజు ఆయన రాజకీయ జీవితం చీకటైపోయింది కానీ, తెలంగాణ మాత్రం దేదీప్యమానంగా వెలుగుతుంది ..ఇది కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత అన్నారు. పెన్షన్ల లబ్దిదారుల వయో పరిమితి 65 సంవత్సరాల నుంచి 60కి తగ్గించాలని, భర్తలు వదిలేసిన వారికి, ఉద్యోగాలు చేసుకుంటున్న వారి తల్లిదండ్రులకు కూడా పెన్షన్ ఇవ్వాలని ఎంపీ శ్రీనివాస్ రెడ్డి చేసిన సూచనను సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పారు.

ఏడాదిన్నరలోపే పాలేరుకు నీరు.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ నల్లా కార్యక్రమం ఒక భగీరథ ప్రయత్నమని కేటీఆర్ అన్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే రూ. 3552 కోట్లతో, మూడు సెగ్మెంట్లుగా ఈ కార్యక్రమాన్ని విభజించి అమలు చేస్తున్నామని చెప్పారు. నీటి లభ్యతఉన్న పాలేరు లాంటి నియోజకవర్గాలకు రాబోయే సంవత్సరం, సంవత్సరన్నరలోపలే ఇంటింటికీ మంచినీళ్లిస్తామని చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం వద్ద మంచినీటి పథకంతో 24 గ్రామాలకు మంచినీళ్లు ఇవ్వటం జరిగింది.

అదేరకంగా రేపటి రోజున ఏరకంగా పూర్తయితే, అదేమాదిరిగా నీళ్లిస్తూ ముందుకు పోతం తప్ప మూడేళ్ల వరకు వేచిఉండే అక్కరకూడా లేదని అన్నారు. పది జిల్లాల్లో రూ. 35వేల కోట్ల రూపాయలతో దాదాపు 40 టీఎంసీల నీళ్లు, 19.56 టీఎంసీలు గోదావరి నుంచి, 19.56 టీఎంసీల నీళ్లు కృష్ణానది నుంచి తీసుకుని, దాదాపు 200 మెగావాట్ల విద్యుత్‌శక్తిని వినియోగించుకుంటూ ఎక్కడికక్కడ 26 సెగ్మెంట్లుగా విభజించుకుని పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోతూఉన్నామని చెప్పారు. 19వేల వాటర్ ట్యాంకుల నిర్మాణం,1.50లక్షల కిలోమీటర్లు కొత్తపైప్‌లైన్ చేపడుతున్నామని చెప్పారు.

ఇది చేతల ప్రభుత్వం: తుమ్మల రాష్ట్ర అర్‌అండ్‌బి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చరిత్రలో లేని విధంగా భీష్మ ప్రతిజ్ఞ చేశాడని, దాన్ని నెరవేర్చే బాధ్యత కేటీఆర్‌పై పెట్టారని అన్నారు. ఇది చేతల ప్రభుత్వమని, చేసే పనులను మాత్రమే ఈ ప్రభుత్వం చెబుతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ పథకాన్ని మొదటగా ఖమ్మం జిల్లాలో పూర్తి చేస్తామని ప్రకటించారు.

భలో ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాల్కసుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జెడ్పి చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, , డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ కే బేగ్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.