– పరిశ్రమలు, ఐటీ, విద్యాసంస్థల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి సమావేశం – విద్యార్థులను ఉద్యోగులుగా మార్చేందుకు చట్టం తెస్తాం – దేశంలో అత్యుత్తమ సిలబస్‌కు రూపకల్పన – టాస్క్ ద్వారా విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంపు
విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరిగేలా దేశంలోనే అత్యుత్తమ విద్యావిధానానికి నాంది పలుకుతామని ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న విద్యావిధానాన్ని పూర్తిగా మార్చేందుకు అవసరమైతే నూతన చట్టాన్ని తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్యావిధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే దిశగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ని రూపొందించేందుకు పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థలతో సచివాలయంలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డితోపాటు ఫిక్కి, సీఐఐ, నాస్కాం, ప్రముఖ సాఫ్ట్‌వేర్‌కంపెనీల, యూనివర్సిటీ, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
అత్యుత్తమ బోధకులు అందుబాటులో ఉన్నచోట నుంచి వర్చువల్ క్లాస్‌రూం(అత్యాధునికమైన) ద్వారా విద్యార్థులకు శిక్షణ అందిస్తామని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలలోని నిపుణులు నేరుగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా పలు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే విద్యార్థుల ఉద్యోగావకాశాలు పెంచేందుకు ఐటీశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ఆయన వెల్లడించారు. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెంచడంతోపాటు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణా నైపుణ్యం పెంచేందుకు వీలుగా స్టార్ట్ అప్ కంపెనీలతో విద్యార్థులకు ఒక నెట్‌వర్క్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం వేలసంఖ్యలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌తోపాటు పలు వృత్తి విద్యానిపుణులను అందిస్తున్నామని, అయితే వారందరికీ ఉద్యోగాలు లభించే పరిస్థితి లేదన్నారు. అందుకే సీఎం కేసీఆర్ సూచన మేరకు ఉద్యోగ ప్రమాణాలకు సరిపడేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నూతన సిలబస్‌ను రూపొందించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం రూపొందించబోయే విద్యా విధానంలో కేవలం స్థానిక పరిశ్రమల స్థాయికే కాకుండా, ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకునేలా సిలబస్ రూపొందించనున్నామని తెలిపారు. కేవలం సిలబస్ మార్చితే సరిపోదని, విద్యార్థులకు శిక్షణనిచ్చే లెక్చరర్లకు కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీపడితే సరిపోదని, విద్యార్థులకు పరిశ్రమల్లో ప్రత్యక్షంగా పని అనుభవం ఉండాలని , ఇందుకోసం విద్యాసంస్థలతో పరిశ్రమలు కలిసి పనిచేయాలని సూచించారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వ రూపొందించిన చట్టాలను విద్యాసంస్థలు సరిగ్గా పాటించడం లేదని, అందుకే విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్‌ని లేదా ప్రాక్టికల్ స్కూల్ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న ఐటీఐ లాంటి వృత్తి శిక్షణ సంస్థలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. పరిశ్రమలున్న చోటనే శిక్షణ సంస్థల్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ విజన్‌ను పటిష్టం చేసేందుకు అన్నివర్గాల నుంచి సలహాలు స్వీకరించడానికే పరిశ్రమ, విద్యాసంస్థలు, అధికారులు, విద్యావేత్తలతో సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామన్నారు. విద్యావిధానంలో ప్రాక్టికల్స్ ఆధారంగా ఉండే శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌కి, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రతినిధులు సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్రా, ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, శైలజారామయ్యార్ తదితరులు పాల్గొన్నారు.