– సింగిల్‌విండో, స్పెషల్ చేజింగ్ సెల్‌తో జీరో కరప్షన్ – నిర్దిష్ట గడువులోగా పరిశ్రమలకు అనుమతులు – పారిశ్రామిక విధాన రూపకల్పన సమీక్షలో సీఎం కేసీఆర్ – ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదానికి కసరత్తులు

పారిశ్రామీకరణతోనే ఆర్థికాభివద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన సాధ్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న పారిశ్రామిక విధానాన్ని ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించేందుకు కసరత్తు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో పారిశ్రామిక విధాన రూపకల్పన అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయని అన్నారు. అలాగే కొన్ని ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల మాదిరిగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల శకం నడుస్తున్నది. ఎక్కడ అనువైన వాతావరణం ఉంటే అక్కడ పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, తక్కువ ధరల్లో లభ్యమయ్యే భూములు, అపారమైన మానవ వనరులు ఉన్నాయి. వీటికితోడు ప్రపంచంలోనే అత్యుత్తమమైన తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలి. అప్పుడే హైదరాబాద్, ఇతర జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు అని సీఎం అధికారులకు సూచించారు.
పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం సింగిల్‌విండో విధానం, స్పెషల్ చేజింగ్ సెల్‌ను అమలు చేయనుందని.. పరిశ్రమల స్థాపన, నిర్వహణలో జీరో కరప్షన్‌కు ప్రభుత్వం హమీ ఇస్తుందని చెప్పారు. రాష్ర్టానికి ప్రకతి వైపరీత్యాలు, పెను తుఫాన్ల భయం వంటివి లేనేలేవు కాబట్టి, చాలా మంది పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అత్యున్నతంగా ఉండాలన్నారు. అనుమతుల కోసం కూడా పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడకుండా అనేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిర్దిష్ట గడువులోగానే అనుమతులు వచ్చే విధానం ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేదన్నారు. మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్నదన్నారు.
పారిశ్రామిక విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్, సంబంధిత అధికారులు ఇప్పటికే సింగపూర్ పర్యటన చేశారు. ఆ అనుభవాలతో ఇండస్ట్రియల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేష్‌రంజన్, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, ప్రభుత్వ సలహాదారుడు బీవీ పాపారావు పాల్గొన్నారు.