-రైతు సమస్యలన్నీ పరిష్కరిస్తాం -ప్రశ్నించే అంశాల్లేకే విపక్షాల యాగీ -టీడీపీ రైతు ప్రేమ విడ్డూరం -రుణమాఫీపై హామీ పత్రాలిచ్చాం -కేంద్ర బృందం వచ్చేలోపు కరువు మండలాల ఎంపిక -మద్దతు ధర, పంటల బీమాపై కేంద్రం స్పందించాలి -వ్యవసాయశాఖ మంత్రి పోచారం

రైతు ఆత్మహత్య రహిత తెలంగాణగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహోరాత్రులు శ్రమిస్తున్నారని తెలిపారు. ఆత్మహత్యలకు సంబంధించిన సమాచారాన్ని క్షేత్రస్థాయినుంచి సేకరించామని పేర్కొన్నారు. ఆ సంఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాలు, ఆత్మహత్యలకు ప్రధాన కారణాలను సమీక్షించి పరిష్కార దిశగా ప్రభుత్వపరంగా చర్యలు చేపడుతున్నామన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ ఇప్పటివరకు 50 శాతం పూర్తయిందని, రూ.17వేల కోట్ల రుణాల్లో ప్రభుత్వం రూ.8,336 కోట్లు ఇదివరకే మాఫీ చేసిందని చెప్పారు. మిగిలిన మొత్తం కోసం బ్యాంకర్లు రైతులను వేధించకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మాఫీలో మిగిలిన 50శాతం రుణాలను చెల్లించేందుకు ఏర్పాట్లు చేయడంతోపాటు రైతు రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందనే హామీ పత్రాలను కూడా రైతులకు అందచేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 36లక్షలమంది రైతులకు తహసీల్దార్ల ద్వారా రుణమాఫీ పత్రాలను అందించామని, బ్యాంకర్లు 21 లక్షల మంది రైతులకు బ్యాంకు ఖాతా పుస్తకాల్లో వారి రుణ చెల్లింపులు జరిపినట్లుగా రాసిచ్చారని మంత్రి వెల్లడించారు. రైతు సమస్యలమీద తమ ప్రభుత్వం తక్షణం స్పందిస్తున్నదని స్పష్టంచేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా అందజేస్తున్నామని, దీంతోపాటు ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని గుర్తుచేశారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో 80 లక్షల ఎకరాలు బీడు రాష్ట్రంలో రెండు జీవనదులు ప్రవహిస్తున్నా గత పాలకులు తెలంగాణకు నీళ్లివ్వలేదని పోచారం ఆరోపించారు. దానివల్ల రాష్ట్రంలో దాదాపు 80 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారాయన్నారు. గోదావరి జలాల్లో మన వాటాను పూర్తిగా వినియోగించుకునేలా సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా చర్యలు ప్రారంభించారన్నారు. కేంద్రం తరపున రాష్ర్టానికి కరువు పరిశీలక బృందం వచ్చేలోపు కరువు మండలాలను ఎంపిక చేస్తామన్నారు. కరువు మండలాల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రత్యేక పరిశీలన చేపట్టాలని సీఎం సూచించారని మంత్రి తెలిపారు. రైతాం గం శ్రమకోర్చి పండిస్తున్న పంటలకు తగిన మద్దతు ధరను, పంటల బీమా చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని, తద్వారానే రైతాంగానికి ప్రయోజనం కలగడంతోపాటు భరోసా వస్తుందని మంత్రి పోచారం పేర్కొన్నారు.
ప్రతిపక్షాలకు ఎజెండా లేదు ప్రతిపక్షాలకు చెప్పేందుకు ఏమీ లేక శాసనసభలో యాగీ చేశాయని పోచారం ఎద్దేవాచేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాప్రయోజన కార్యక్రమాలను వివరిస్తే కాళ్ల కింద భూమి కదులుతుందన్న భయంతోనే ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశంలో అనవసర రాద్ధాంతం చేశాయన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, విమర్శించేందుకు వాళ్ల వద్ద ఎటువంటి అంశాలు లేవని పేర్కొన్నారు. సుమారు 11 గంటలపాటు ప్రతిపక్ష నాయకులు మాట్లాడిందంతా తాము ఓపికగా విన్నామని, వారి ప్రశ్నలకు బదులివ్వడానికి ప్రభుత్వం సిద్ధమైతే వినే ఓపిక వారికి లేకపోయిందన్నారు. ప్రభుత్వం జవాబిస్తుంటే వినకుండా అనవసరమైన చర్చకుదిగి సమయం వృథా చేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. ప్రభుత్వం చాలా స్పష్టంగా వివరణ ఇచ్చినా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కేవలం రాజకీయ లబ్ధికోసమే విమర్శలకు దిగాయని మంత్రి విమర్శించారు. గతంలో ఆత్మహత్యలు జరుగుతున్నా రైతులపై ఏ మాత్రం జాలిచూపని టీడీపీ ఆధ్వర్యంలో రైతులకోసం యాత్రలు నిర్వహించడం హాస్యాస్పదమని పోచారం ఎద్దేవాచేశారు. జాతీయపార్టీగా చెప్తున్న టీడీపీ ఏపీలో రైతులకు ఏమాత్రం న్యాయం చేసిందో ఆ పార్టీ నాయకులు చెప్పాలని నిలదీశారు.