-చెక్కులు, బుక్కులతో అన్నదాత ఆనందం -మిగిలిన చెక్కులు తహసీల్దార్ కార్యాలయాల్లో తీసుకునే అవకాశం -గల్ఫ్ దేశాల్లో ఉన్నవారికి చెక్కులు అందించేందుకు ప్రత్యేక చర్యలు -ఆర్వోఎఫ్‌ఆర్ గిరిజనులకు పంటసాయం అందజేత మొదలు -రైతుబంధుతో లక్షకుపైగా గిరిజన రైతులకు లబ్ధి -9వ రోజు 307 గ్రామాల్లో 1.55 లక్షల చెక్కుల పంపిణీ -తొమ్మిది రోజుల్లో మొత్తం 43,74,746 చెక్కులు
సర్కారు నుంచే అందుతున్న పంటసాయం.. ఈ ఏడాది మూడ్రోజుల ముందుగానే తొలకరి పలకరింపు ఉంటుందన్న శుభవార్తతో అన్నదాతల్లో అనందం వెల్లివిరుస్తున్నది. చేతిలో చెక్కులు నింపుతున్న భరోసాతో ఈ ఏడాది సాగుకు ఎలాంటి ఢోకా ఉండబోదన్న విశ్వాసం వ్యక్తమవుతున్నది. మొత్తంగా రైతుబంధు పథకం.. రైతుల పాలిట ఆత్మబంధువుగా మారింది. విజయవంతంగా కొనసాగుతున్న రైతుబంధు చెక్కులు, బుక్కుల పంపిణీ కార్యక్రమంలో తొమ్మిదోరోజైన శుక్రవారం 307 గ్రామాల్లో 1.55 లక్షల చెక్కులను పంపిణీచేశారు. వీటితో కలుపుకొంటే గడిచిన తొమ్మిది రోజుల్లో 10,359 గ్రామాల్లో రైతులకు అందించిన చెక్కుల సంఖ్య 43,74,746కు చేరింది. పలుగ్రామాల్లో చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లిన రీత్యా కొన్ని చెక్కులను పంపిణీ చేయలేకపోయారు. మరికొన్నింటిని అందుబాటులో లేని రైతులు తీసుకోలేకపోయారు. అటువంటి చెక్కులన్నింటినీ నెలరోజులవరకు తహసీల్దార్ కార్యాలయాల్లో తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. మరోవైపు గిరిజన రైతులకు సైతం పంట పెట్టుబడి సాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు వారికి చెక్కుల పంపిణీ శుక్రవారం నుంచి మొదలైంది. ఆదిలాబాద్ జిల్లాలో అటవీహక్కు చట్టం (ఆర్వోఎఫ్‌ఆర్) పత్రాలున్న గిరిజన రైతులకు చెక్కుల పంపిణీ ప్రారంభమైంది. ఈ జిల్లాలో 17,657 గిరిజన రైతులకు రూ.27.86 కోట్ల సాయం అందనున్నది. మొత్తంగా లక్షమందికిపైగా గిరిజన రైతులు పంటసాయం అందుకోనున్నారు. ఇక గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి చెక్కులు అందించేందుకు ప్రభుత్వ కార్యాచరణ మొదలుపెట్టింది.
మిగిలిన చెక్కులు తహసీల్దార్ కార్యాలయాల్లో రైతుబంధు పథకం పంటసాయం చెక్కుల అందజేత నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం అమలుచేస్తున్నది. తొలి విడుత కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో చెక్కులు అందుకోని వారికి.. వాటిని మండల కార్యాలయాల్లో అందించేందుకు ఏర్పాట్లుచేశారు. పట్టాదార్ పాస్‌పుస్తకాలు, చెక్కుల్లో రాసిన వివరాలలో తప్పులు దొర్లితే, వాటిని తక్షణమే సవరించి రైతులకు అందించే ప్రయత్నాల్లో ఉన్నారు. చెక్కుల్లో తప్పులను సవరించి బ్యాంకర్లు తక్షణం కొత్త చెక్కులు జారీచేసేలా చర్యలు చేపట్టారు. చెక్కులు అందుకున్న రైతులు మూడు నెలలోపు తమ ఖాతాల్లో జమ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మూడునెలలు గడిస్తే.. సమీప మండల కార్యాలయాలకు వెళ్లి తదుపరి తేదీలతో కొత్త చెక్కులు పొందే అవకాశం ఉంది. రైతులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా 58.33 లక్షలమంది రైతులకు చెందిన 1,43,270 ఎకరాల భూమికిగాను రూ.5,730 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయాల్సి ఉండగా శుక్రవారం నాటికి 43,74,746 చెక్కులు పంపిణీచేశారు. మిగిలిన చెక్కులను నెలపాటు స్థానిక మండల కార్యాలయాల్లో తీసుకోవచ్చని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.