-పసుపు రైతులకు చేసిందేమీ లేదు
-హైస్పీడ్ అబద్ధాలతో నెట్టుకొస్తున్న
-బీజేపీ ఎంపీ అధర్మపురి అర్వింద్
-మోదీ వద్ద మోకరిల్లుతావో, మోకాలి యాత్ర చేస్తావో నీ ఇష్టం
-పసుపుబోర్డు తేకపోతే నిలదీస్తాం
-నిజామాబాద్ ఎంపీకి కవిత హెచ్చరిక
-రాహుల్ సంఘర్షణ సభగా పేరు
-పెట్టుకోవాలని కాంగ్రెస్‌కు హితవు

మూడేండ్ల పదవీకాలంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అసత్యాలు వల్లిస్తూ ప్రజలను మభ్య పెట్టడం తప్పితే చేసిందేమీ లేదని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు. అబద్ధాలు చెబుతూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు. ‘మూడేండ్ల సమయం ఇచ్చాం. మోదీ వద్ద మోకరిల్లుతావో, మోకాలి యాత్ర చేస్తావో నీ ఇష్టం. పసుపుబోర్డు తేకపోతే ఇక నుంచి అడుగడుగునా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం’ అని హెచ్చరించారు. బుధవారం నిజామాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాయలంలో ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, టీఆర్‌ఎస్ నేతలతో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు. అర్వింద్‌కు వ్యతిరేకంగా తొలిసారిగా మీడియా సమావేశం పెట్టిన ఆమె ఎంపీ తీరును ఎండగట్టారు. ‘ప్రజా సంగ్రామ యాత్రలో రాయ్‌చూర్ రైతులు వచ్చి బండి సంజయ్‌ని తెలంగాణ స్కీములు అమలు చేయాలని అడిగితే తెల్లముఖం ఏసిండు. ఏమీ అర్థం కాక, ఏమి చెప్పాలో తెలియక బీజేపీ అధ్యక్షుడు తోక ముడిచిండు’ అంటూ కవిత ఎద్దేవా చేశారు. వీళ్లవి పేరుకే సంగ్రామ యాత్రలని, ఎప్పటికైనా తెలంగాణకు సంరక్షణగా ఉండేది గులాబీ పార్టీయేనని స్పష్టం చేశారు.
వ్యవసాయ జిల్లా నిజామాబాద్‌లో రాజకీయ రంగు పులిమి అనేక అబద్ధాలు చెప్పి ఫాల్స్ ప్రామిస్‌తో గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని కవిత పేర్కొన్నారు. మూడేండ్లు పూర్తవుతున్నా అనేక అసత్యాలు వల్లిస్తూ ప్రజలను మభ్య పెట్టడం తప్పితే సాధించింది ఏమీ లేదు. ఈ సమయంలో వాస్తవాలు వెల్లడించేందుకు ముందుకు వచ్చానని చెప్పారు. తెలంగాణ ధాన్యం కొనాలని పార్లమెంట్‌లో కొట్లాడుతుంటే నైతిక మద్దతు ఇవ్వని వ్యక్తి రాహుల్‌గాంధీ అని కవిత మండిపడ్డారు. రైతుల పక్షాన నోరు విప్పని వ్యక్తి వరంగల్‌లో రైతు సంఘర్షణ పేరుతో సభ పెట్టడం విడ్డూరమన్నారు. వరంగల్ సభకు రాహుల్ సంఘర్షణ సభగా పేరు పెట్టుకోవాలని కవిత సూచించారు.
ఎంపీగా నేను చేసిందిదీ..
పసుపుబోర్డు కోసం ఎంపీగా తాను ఎంతో చేశానని కవిత వివరించారు. ఎవరెవరిని కలిసిందీ, ఎవరెవరికి లేఖలు రాసింది వివరించారు. నిజామాబాద్ ఎమ్మెల్యేలతో కలిసి 25 ఆగస్టు 2016న ప్రధాని నరేంద్ర మోదీని మొదటిసారి కలిసినట్టు చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం 2017లో తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపిన లేఖను కవిత మీడియా ప్రతినిధులకు చూపించారు.