Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఆరోగ్యంగా ఉన్న.. మరో పదేండ్లు నేనే సీఎం

-ఎవరూ.. ఆగమాగం మాట్లాడొద్దు.. అట్లా మాట్లాడితే ఇక కుదరదు!!
-రాష్ట్రం తెచ్చాక గాంధీలాగ ఉందామనుకున్న
-సీఎం పదవి తీసుకోకుంటే అలాగే ఉండేవాణ్ని
-తెలంగాణ ఆగం కావొద్దనే ఆ బాధ్యత చేపట్టిన
-ఆరోగ్యంగా ఉన్న.. మరో పదేండ్లు నేనే: కేసీఆర్‌
-సీఎం పదవి నాకు గడ్డిపోచతో సమానం
-రాష్ట్రం తెచ్చిన పేరుకంటే అది ఎక్కువ కాదు
-ఈ నేల కోసమే ఎన్నో తిట్లు తిన్న.. తింటున్న
-ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. ఓపికగా ఉండండి
-గీత దాటి ఎవరు మాట్లాడినా వేటు తప్పదు
-పూర్తిగా చెడిపోయినోళ్లను సస్పెండ్‌ చేస్త
-ప్రజల్ని ఇబ్బంది పెడితే సహించే సమస్యే లేదు
-ఎమ్మెల్యేనే ఫైనల్‌.. సిట్టింగులకు టికెట్లు
-పార్టీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి

మరో 3 నెలల్లో 20 ఏండ్లు పూర్తి చేసుకోబోతున్న ఉద్యమ పార్టీ, తెలంగాణ అస్తిత్వ ప్రతీక టీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. గతం, వర్తమానం ప్రాతిపదికగా పార్టీ భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండాలన్నదానిపై పూర్తి స్పష్టత ఇచ్చారు. నేతలు, శ్రేణులు నడుచుకోవాల్సిన రీతి, పాటించాల్సిన నీతిపై కార్యవర్గ సమావేశంలో హితబోధ చేశారు.

పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమం తర్వాత సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రం ఆగమైపోవద్దనే తాను సీఎం పదవిని చేపట్టానని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. రాష్ట్రం వచ్చాక గాంధీజీలాగా ఉండాలని భావించానని.. కానీ.. కష్టపడి తెచ్చుకొన్న రాష్ర్టాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా సీఎంగా కొనసాగుతున్నానని గుర్తుచేశారు. తనకు సీఎం పదవి తృణప్రాయమని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్సే శ్రీరామరక్ష అన్న సీఎం కేసీఆర్‌.. అనేక త్యాగాల ఫలితంగా సాధించుకొన్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉన్నదని పేర్కొన్నారు. నాయకులు క్రమశిక్షణగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఎట్ల పడితే అట్ల మాట్లాడితే కుదరదని స్పష్టంచేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, ఓపికగా ఉండాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజల కష్టసుఖాలను పూర్తిగా దూరం చేయటమే టీఆర్‌ఎస్‌ కర్తవ్యంగా అందరూ భావించాలని ఉపదేశించారు. ‘ఎవరు ఏమిటన్నది ప్రజలకు బాగా తెలుసు. మంచిచేస్తే మంచిగా స్పందిస్తరు. పిచ్చిపిచ్చి చేస్తే ఈడ్చి బండకు కొడ్తరు’ అని హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో సుదీర్ఘంగా జరిగిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకులకు, క్యాడర్‌కు ఆయన విస్పష్టంగా దిశానిర్దేశంచేశారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

ముఖ్యమంత్రిగా నేనే ఉంటా
ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ పనికిరాడా? ఏం.. దిగిపొమ్మంటరా? నాకేమైంది? నేనేమైనా రిజైన్‌ చేస్తా అని చెప్పిన్నా? నేను మంచిగనే ఉన్న కదా? ఎందుకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నరు? రాజీనామా చెయ్యాల్నా.. చెప్పండి. ఇక్కడే చేస్తా. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదు. కర్రుకాల్చి వాత పెట్టాల్సి ఉంటది. పార్టీ లైన్‌ తెలుసుకోకుండా మాట్లాడితే ఏ స్థాయి వారైనా ఊరుకొనేది లేదు. అయినా నేను ముందే చెప్పిన కదా? అసెంబ్లీలో స్పీకర్‌గారికే చెప్పిన. నాకేమైంది.. దుక్కిలెక్క ఉన్న.. ఇంకో పదేండ్లు ఉంటా అని చెప్పిన కదా? ఏదైనా ఉంటే మీతో చెప్పనా? అనవసర విషయాల గురించి ఎక్కువ మాట్లాడకండి. మన మాటల ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు? పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకొంటే బాజాప్తాగానే ఉంటుంది. కేసీఆర్‌ పదవులకోసం పాకులాడే వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమంలో నాతో కలిసి నడిచిన నా ప్రజలకు ఈ విషయం తెలియనిది కాదు. ఎన్నో పదవులను కాదనుకున్నవాడిని, రాష్ట్రం కోసమే కొట్లాడినవాడిని. నాకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి పదవి తృణప్రాయం. మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష.. ప్రత్యేక రాష్ట్రం. దాన్ని సాధించిన తృప్తి ముందు.. పదవులు లెక్కకాదు. నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోకపోయి ఉంటే గాంధీ పక్కన చేరేవాడిని. ముఖ్యమంత్రి పదవి తీసుకోవడంతో ఎందరో తిట్టుకుంటున్నరు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎందరో తిట్టేది. అన్నీ అనుభవించిన. కానీ, సాధించుకున్న రాష్ర్టాన్ని నిలబెట్టుదామన్న ఆలోచనతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన. రాష్ట్రం ఏర్పడేనాటికే కుట్రలు మొదలు పెట్టిన విషయం తెలిసిందే కదా? చంద్రబాబునాయుడు ఆనాడు బెర్లిన్‌ గోడనే కూలింది.. ఈ విభజన ఎంత?.. ఆర్నెళ్లలో మళ్లీ సమైక్య రాష్ట్రం చేస్తామని అనడం తెలియదా? ఆనాడు జరిగిన కుట్రల నుంచి కొత్త రాష్ర్టాన్ని సంరక్షించుకుందామని తాపత్రయపడ్డం. రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా మనం అనుకున్నవి, ప్రజల ఆకాంక్షల అమలు నా బాధ్యతగా భావించిన. అందుకే పదవి తీసుకోవాల్సి వచ్చింది. నాకు ఈ పదవిపై ఎప్పుడూ వ్యామోహంలేదు. మనం సాధించుకున్న రాష్ట్రంపై మనకు ఉండే సోయి బయటోనికి ఉండదు. తెలంగాణకు టీఆర్‌ఎస్‌ పార్టీనే శ్రీరామరక్ష. ప్రజలు కూడా మనను ఆమోదించారు. రెండు దఫాలు అధికారంలో కూర్చోపెట్టారు. మనం మన ముందు పెట్టుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించుకుందాం. బంగారు తెలంగాణగా మలుచుకుందాం. రాష్ర్టాన్ని సాధించుకున్న క్రమంలో అనేక ఒడిదుడుకులను చూశాం. అన్నింటినీ తట్టుకొని నిలబడ్డవాళ్లం. మనకు కష్టాలంటే ఏమిటో తెలుసు. రాష్ట్ర ప్రజల ఆశలన్నీ మనపైనే ఉన్నాయి. వారి ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చడం మన బాధ్యత. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సివస్తే మీకు చెప్పే.. మీకు తెలిసే జరుగుతుంది. మీకు తెలియకుండా ఏ నిర్ణయం ఉండదు. కొందరు నాయకులు పెద్ద పెద్ద పొజిషన్లలోకి వచ్చినా.. వారి పొజిషన్‌ విలువేందో తెలుసుకోలేక నోటికి వచ్చింది మాట్లాడుతున్నరు. ఈ పద్ధతి సరికాదు. పార్టీ నాయకత్వానికి జిమ్మేదారి ఉంటుంది. ఏం మాట్లాడినా జిమ్మేదారితో మాట్లాడాలి.

పార్టీ పెట్టడం ఈజీ కాదు
రాజకీయ పార్టీని పెట్టడం, నడపడమంటే ఆషామాషీ కాదు. పాన్‌ డబ్బాపెట్టినంత ఈజీకాదు. నేను టీడీపీలో ఉన్నపుడు నాతోపాటు మా జిల్లాలో ఇంకొకాయన కూడా ఉండె. ఇద్దరికీ మొదటిసారే ఎన్నికలు. ఇద్దరం గెల్చినం. తర్వాత గిట్లనే ఒకాయన పార్టీ పెడుతున్న అంటే పోయి చేరిండు. కొత్తగ పార్టీ పెట్టినాయన, నాతోపాటు గెల్చినాయన ఇద్దరూ ఆగమైండ్రు. టీఆర్‌ఎస్‌ పార్టీని నేను పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు తెలంగాణలో 20 పార్టీలు కొత్తగా పుట్టుకొచ్చినయ్‌. తెలంగాణ సాధనసమితి అని, ప్రజారాజ్యమని, జైసమైక్యాంధ్రపార్టీ, ప్రజాపార్టీ.. ఇట్ల అనేక పార్టీలు వచ్చినయి. కోదండరాం కూడా పార్టీ పెట్టిండు. కానీ, ఏమైంది? ఏమవుతున్నదో అందరికీ తెలిసిందే. చెన్నారెడ్డి ఉద్ధండ నాయకుడు. మీడియా ఏమీ లేనప్పుడే.. ఆయన పార్టీ పెట్టిండు. కానీ.. దాన్ని నడపడం సాధ్యం కాలేదు. ప్రాంతీయ పార్టీల్లో టీఆర్‌ఎస్‌, టీడీపీ మాత్రమే మనుగడలో ఉన్నయి. రాజకీయపార్టీ పెట్టుడువరకు మంచిగనే ఉంటది.. దాన్ని నడిపించడమంటే అంత ఈజీకాదు. ఓర్పు, సహనం, నిబద్ధత.. అన్నీ ఉండాలి. అప్పుడే అది ప్రజల అభిమానం పొందగలుగుతుంది. కార్యకర్తల కృషి, నాయకత్వ నిర్ణయాలపైనే పార్టీ ఎదుగుతుంది. టీఆర్‌ఎస్‌, పార్టీ కార్యకర్తల చిత్తశుద్ధిని, నిబద్ధతను ఎవ్వరూ శంకించలేరు. మనం పోరాటాల్లోనుంచి పుట్టినం. ఈ రాష్ట్ర శ్రేయస్సును కాంక్షించేవాళ్లం, రాష్ట్ర సాధనకోసం పుట్టి.. రాష్ట్ర అభివృద్ధికోసం పనిచేస్తున్నవాళ్లం. మన ముందున్న లక్ష్యం రాష్ర్టాన్ని సుభిక్షంగా ఉంచుకోవడం. దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా మలుచుకోవడం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌.

ఎమ్మెల్యేలే ఫైనల్‌
నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు అందరినీ సమన్వయం చేసుకోవాలి. జడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, ఇంకా ఎవరైనా కీలక నాయకులుంటే వాళ్లతో కలిసి మాట్లాడాలి. శత్రు భావనతో ఉండవద్దు. పార్టీలోని ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలి, పుచ్చుకోవాలి. పరస్పరం గౌరవించుకోలేని పరిస్థితులు ఉండవద్దు. ఎమ్మెల్యేలను ఎవరూ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టవద్దు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరి పరిధిలో వారు పనిచేసుకోవాలి. ఒకరి నియోజకవర్గంలో ఇంకొకరు జోక్యం చేసుకోవడం మానేయాలి. పార్టీ సభ్యత్వ నమోదు బాధ్యత కూడా ఎమ్మెల్యేలదే. సభ్యత్వ నమోదుకు కమిటీలను వాళ్లే వేసుకోవాలి.

అందరి చేతుల్లో ‘కోటి వృక్షార్చన’
సమావేశానికి హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో కోటి వృక్షార్చన బ్రోచర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందులో పొందుపరిచిన వివరాలను ఆసక్తిగా పరిశీలించారు. కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ రూపకర్త, ఎంపీ సంతోష్‌కుమార్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

గీత దాటితే వేటు తప్పదు
పార్టీ పట్ల విధేయతతో లేనివాళ్లను, ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవాళ్లను ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదు. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్త. పార్టీకి క్రమశిక్షణ ఉన్నది. నియోజకవర్గాల్లో మీకు ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించుకోవాలి. దీనికోసం రచ్చ చేసుకోవద్దు. రచ్చచేసుకోవడం ఎవ్వరికీ క్షేమకరం కాదు. మనకు ఇప్పటికే అనేక సమస్యలున్నయి. ఇంకా కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు. ఒక స్థాయిలో ఉన్నవాళ్లు కూడా నోటికి వచ్చినట్టు, తోచినట్టు అర్థంపర్థం లేకుండా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నరు. ఇలాంటి వాళ్లే కొత్త కొత్త సమస్యలను సృష్టిస్తున్నరు. దీన్ని ఉపేక్షించలేం. కరోనా రావడంతో అనేక సమస్యలు వచ్చాయి. ప్రపంచం స్తంభించింది. దాని ప్రభావం ప్రతి ఒక్కరిపై ఏదో ఒకవిధంగా పడింది. పార్టీకి, ప్రభుత్వానికి కూడా సవాలుగానే నిలిచింది. దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇదంతా పట్టించుకోకుండా వ్యవహరించేవారి పట్ల కఠినంగానే వ్యవహరించాల్సి వస్తుంది.

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
ఆ కోణంలోనే కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రయోజనాలే ప్రాధాన్యంగా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర సంబంధాలు కొనసాగుతాయని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వంతో మన వైఖరి ఎలా ఉండాలన్నదానిపై అనేక చర్చలు బయట జరుగుతున్నాయి. తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్రంతో మన సంబంధాలుంటాయి. దీనిపై ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే ఎంపీలు, మంత్రులు, ఇతర ముఖ్య నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఏ నిర్ణయం తీసుకున్నా మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’ అని స్పష్టంచేశారు.

ఆరు లక్షల మందితో భారీ సభ!
టీఆర్‌ఎస్‌ ఆవిర్భంచి రెండు దశాబ్దాలు అవుతున్న సందర్భంగా భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహించుకొనే సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏప్రిల్‌ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా సంస్థాగత నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత ఆరు లక్షల మందితో భారీ బహిరంగసభను నిర్వహిస్తామని చెప్పారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆలోచన చేసి, అప్పటి పరిస్థితులకనుగుణంగా ప్రకటిస్తామని తెలిపారు.

జిల్లాల పర్యటన షురూ..
ఈ నెల 10న హాలియాలో బహిరంగసభ తర్వాత, జిల్లాలవారీగా పర్యటనలు చేపడతానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారు. కార్యకర్తల సమస్యలు, ఇతర అంశాలను అక్కడిక్కడ పరిష్కరించేలా పర్యటన కొనసాగుతుందని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, శ్రేణులందరూ కలిసికట్టుగా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.

అందరికీ ఆత్మీయ భోజనాలు
ప్రజాప్రతినిధులు ఎక్కడిక్కడ పార్టీ శ్రేణులతో, ప్రజలతో మమేకం కావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. దీనికోసం క్షేత్రస్థాయిలో పర్యటించి.. ప్రతి సందర్భంలోనూ ఆత్మీయ భోజనాలు చేయాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు.. ఇలా ఎవరికివారు వారిస్థాయిల్లో ఒకవైపు పార్టీ కార్యకర్తలను మరోవైపు ప్రజలను కలుపుకొని పోవాలన్నారు. ఒక కుటుంబంగా భావించి ముందుకెళ్లాలని చెప్పారు.

మే 4 తర్వాత ఢిల్లీలో పార్టీ ఆఫీస్‌కు శంకుస్థాపన
20 ఏండ్ల క్రితం జలదృశ్యంలో ప్రారంభమైన టీఆర్‌ఎస్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రత్యేక రాష్ట్రం సాధించుకొన్నది. ఇప్పుడు మరో కీలకమైన ముందడుగు వేస్తున్నం. ఢిల్లీలో మనం పార్టీ ఆఫీసును నిర్మించుకోబోతున్నం. మే 4 తర్వాత దానికి మనం శంకుస్థాపన చేసుకుందం. మన పార్టీ చరిత్రలో ఇదో కీలకఘట్టం కానున్నది.

మళ్లీ మీకే టిక్కెట్లు.. కష్టపడి పనిచేయండి
తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పుడు కూడా మళ్లీ మీకే టిక్కెట్లు ఇస్తానని చెప్పిన.. ఇచ్చిన. ఇప్పుడు కూడా చెప్తున్న మళ్లీ మీకే టిక్కెట్లు ఇస్త, కష్టపడి పనిచేయండి, పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. ప్రజల మధ్యనే ఉండండి. వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయండి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఎమ్మెల్యేలుండాలి. మీకే మళ్లీ టిక్కెట్లు ఇస్తా.. గెలిపించుకుంట. ఆ బాధ్యత నాది.

ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వండి..
ప్రతిపక్షాల వాళ్లు మాట్లాడితే వాళ్లకు సమర్థంగా సమాధానాలు ఇవ్వండి. సోషల్‌ మీడియా ను కూడా ఉపయోగించండి. పార్టీ క్యాడర్‌తో సమన్వయంచేసుకోండి.

ఉపేక్షించం..
కొందరు నాయకులు పెద్ద పెద్ద పొజిషన్లలోకి వచ్చినా.. వారి పొజిషన్‌ విలువేందో తెలుసుకోలేక నోటికి వచ్చింది మాట్లాడుతున్నరు. ఒక స్థాయిలో ఉన్న వాళ్లు కూడా అర్థం, పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నరు. ఇలాంటి వాళ్లే కొత్త కొత్త సమస్యలను సృష్టిస్తున్నరు. ఈ పద్ధతి సరికాదు. దీన్ని ఉపేక్షించలేం.

పార్టీ కన్నతల్లి..
పార్టీ కన్నతల్లి లాంటిది. కార్యకర్తల కృషి, నాయకత్వ నిర్ణయాల వల్ల పార్టీ ఎదుగుతుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ, కార్యకర్తల చిత్తశుద్ధిని, నిబద్ధతను ఎవ్వరూ శంకించలేరు.రాష్ట్ర ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చడం మన బాధ్యత. ఏ నిర్ణయమైనా బాజాప్తా మీకు చెప్పే.. మీకు తెలిసే జరుగుతుంది. మీకు తెలియకుండా ఏ నిర్ణయం ఉండదు. మనం పోరాటాల్లో నుంచి పుట్టినం. రాష్ట్ర సాధన కోసం పుట్టి.. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నవాళ్లం. అనేక ఒడిదుడుకులను చూశాం. అన్నింటినీ తట్టుకొని నిలబడ్డవాళ్లం. మనకు కష్టాలంటే ఏమిటో తెలుసు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌. రాష్ట్ర ప్రజల ఆశలన్నీ మనపైనే ఉన్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.