-కంటివెలుగు దేశానికే ఆదర్శం -రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం -సామాజిక సేవలో దవాఖానలు, కంపెనీలు భాగస్వామ్యం కావాలి -సిరిసిల్ల శాసనసభ్యుడు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -సిరిసిల్లలో ఎల్వీ ప్రసాద్ వైద్యశాలకు భూమిపూజ

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎల్వీప్రసాద్ కంటి హాస్పిటల్, హెటిరో కంపెనీ ప్రతినిధులు కూడా ఉన్నారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం (హెల్త్ ప్రొఫైల్) రూపొందించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు తెలిపారు. సామాజికసేవలో దవాఖానలు, స్వచ్ఛందసంస్థలు, కంపెనీలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కంటి వెలుగు శిబిరాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో కంటి వైద్యం అందించేందుకు, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన నిర్మిస్తున్నట్లు చెప్పారు.
మంగళవారం సాయంత్రం ఆయన సిరిసిల్లలో పర్యటించారు. వేములవాడ నుంచి హైదరాబాద్ మీదుగా తిరుపతికి ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సు సర్వీసును కొత్త బస్టాండ్‌లో ప్రారభించారు. తర్వాత ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్మించ తలపెట్టిన ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆరోగ్య సమాచారం సేకరించడం ద్వారా అత్యవసర పరిస్థితిలో ఎక్కడికి వెళ్లినా వారికి తక్షణ వైద్యసేవలందించే అవకాశం ఉంటుందని చెప్పారు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకున్న సీఎం కేసీఆర్ కంటివెలుగు పథకాన్ని ప్రవేశపెట్టి, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా పరీక్షలు చేయించారన్నారు.

ఏడాదిలోగా వైద్యశాల ప్రారంభిస్తాం ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన సేవలను కేటీఆర్ కొనియాడారు. అమెరికాలో ఉన్న దవాఖాన చైర్మన్ నాగేశ్వర్‌రావు దేశ ప్రజలకు సేవలందించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్‌ను 30 ఏండ్ల కిందట ఏర్పాటుచేసినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఐదు లక్షల మంది పేద ప్రజలకు ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ మెరుగైన సేవలందించాలని కోరగానే, సానుకూలంగా స్పందించిన నాగేశ్వర్‌రావుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్ భవనాన్ని ఏడాదిలో పూర్తిచేసి ప్రారంభిస్తామని తెలిపారు. మొత్తం 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ దవాఖాన నిర్మాణం జరుగబోతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. భవన నిర్మాణంకోసం హెటిరో సంస్థ రూ.50 లక్షల విరాళాన్ని కేటీఆర్ చేతుల మీదుగా దవాఖాన నిర్వహకులకు అందజేసింది.

ఇక వేములవాడ టు తిరుపతి తిరుపతికి ఏర్పాటుచేసిన బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ కోరారు. తిరుపతికి బస్సు సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందులను చాలామంది చెప్పారని, వారి కోరిక మేరకు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.