Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఆరోగ్యశ్రీలో.. అవయవ మార్పిడి

-లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్స ఉచితం
-వివిధ రకాల క్యాన్సర్‌ చికిత్సలకు కూడా
-దీర్ఘకాలిక రోగులకు పాలియేటివ్‌ కేర్‌ సెంటర్లు
-త్వరలో ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు
-వైద్యారోగ్యశాఖలో ఆర్నెళ్లకోసారి ఖాళీల భర్తీ
-మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు

కరోనా దెబ్బకు ప్రైవేటు దవాఖానలు తలుపులు మూసుకున్నా.. సర్కారు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రజల ప్రాణాలు కాపాడిన తెలంగాణ ప్రభుత్వం.. మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద ఖరీదైన వైద్యాన్ని అందిస్తూ పేదలకు బాసటగా నిలిచిన ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయానికి తెరతీసింది. మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చింది. రూ.30 లక్షలు ఖర్చయ్యే ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. లక్షలు ఖర్చయ్యే క్యాన్సర్‌ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించాలని తీర్మానించింది. కరోనాకు వ్యాక్సిన్‌ వస్తే ముందుగా పేదలకే ఇవ్వాలని నిర్ణయించింది. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నాయకత్వంలో భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నది. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో గురువారం జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కే తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కూడా పాల్గొన్నారు. సమావేశం వివరాలను మంత్రి ఈటల రాజేందర్‌ మీడియాకు వివరించారు. వివిధ పథకాలు, విధానాల అమలుతోపాటు మెరుగైన వైద్యాన్ని అందించడంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉన్నదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్యారోగ్య శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కరోనా విజృంభించగానే ప్రైవేటు దవాఖానలు మూసుకుంటే.. ప్రభుత్వ దవాఖానలు ప్రజల పాలిట సంజీవనిగా నిలిచాయని చెప్పారు. కొవిడ్‌పై పోరాటం లో ముందునిలిచిన వైద్యులు, అన్నిరకాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మెడికల్‌ కాలేజీల వరకు అమలుచేయాల్సిన సంస్కరణలు, సిబ్బంది నియామకం, వైద్య పరికరాల విషయమై సమగ్రంగా చర్చించామన్నారు. వీటన్నింటిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

తగ్గిన ప్రసూతి మరణాలు
తెలంగాణ ఏర్పడేనాటికి ప్రసూతి మరణాల రేటు 92%ఉంటే, ప్రస్తుతం 63 శాతానికి తగ్గిందని మంత్రి ఈటల చెప్పారు. బాలింతల మరణాల రేటు దేశంతో పోలిస్తే రాష్ట్రంలోనే అతి తక్కువగా నమోదవుతుండగా, శిశు మరణాలు ప్రతి వెయ్యిలో 39 నుంచి 26కు తగ్గినట్లు వివరించారు. ఈ తగ్గింపులో కేసీఆర్‌ కిట్‌ పాత్ర గణనీయమైదని చెప్పారు. ‘ప్రభుత్వ దవాఖానల్లో చేస్తున్న అవయవ మార్పిడి చికిత్సలను వైద్య కళాశాలలకు విస్తరించి ఆరోగ్యశ్రీలో చేర్చనున్నాం. కిడ్నీ, హార్ట్‌, లివర్‌ మార్పిడి శస్త్రచికిత్సకు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుంది. వివిధరకాల క్యాన్సర్‌ చికిత్సలకు కూడా లక్షల్లో ఖర్చవుతున్నది. వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కింద చేర్చాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఎంఎన్‌జే క్యాన్సర్‌ దవాఖానను అభివృద్ధి చేయనున్నాం. ఇప్పటికే కొత్త భవనం కోసం రూ.40 కోట్లు కేటాయించాం. పెట్‌స్కాన్‌ ఏర్పాటు చేశాం’ అని వివరించారు.

ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ప్రొఫైల్‌
సీఎం గ్రామమైన చింతమడకలో ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేయడం పూర్తయిందని మంత్రి ఈటల వెల్లడించారు. ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. దీనివల్ల సకాలంలో సరైన వైద్యం అందుతుందని చెప్పారు.

108 వాహనాల సంఖ్య పెంపు
రాష్ట్రంలో 108, 104, 102 వాహనాలు పూర్తిస్థాయిలో ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయని మంత్రి ఈటల తెలిపారు. ‘గతంలో మండలానికి ఒక 108 ఉండేది. ఇప్పుడు కొత్త మండలాలకు కూడా అందించనున్నాం. హైదరాబాద్‌, వరంగల్‌ జనాభాకు అనుగుణంగా ప్రతి దవాఖానలో ఒక అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. మంత్రి కేటీఆర్‌ చొరవతో గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కింద కొత్తగా 118 వాహనాలు వచ్చాయి. వంద వాహనాలు కొనుగోలుచేయగా, 20 వాహనాలు సీఎస్‌ఆర్‌ కింద వచ్చాయి. మొత్తంగా 238 కొత్త వాహనాలు సేవలందించబోతున్నాయి’ అని ఈటల వివరించారు.

పాలియేటివ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు
‘దీర్ఘకాలిక రోగాల బారినపడి ఎంతోమంది మంచానికే పరిమితమయ్యారు. వారికి చికిత్స అందించేందుకు పాలియేటివ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని మంత్రి ఈటల ప్రకటించారు. ‘ఇప్పటికే 8 కేంద్రాలున్నాయి. మరో 2 కేంద్రాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని నిర్ణయించాం’ అని తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం ద్వారా ప్రతి ఏడాది రూ.1200 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఈటల చెప్పారు. ‘సీఎంఆర్‌ఎఫ్‌ కింద వందల కోట్లు ఇస్తున్నాం. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే వందరెట్లు మంచి సేవలు అందించేలా ఆరోగ్యశ్రీలో మరిన్ని వైద్య చికిత్సలను చేర్చబోతున్నాం’ అన్నారు.

తక్కువ ధరకు నాణ్యమైన మందులు
అతిత్వరలో ప్రభుత్వపరంగా మెడికల్‌ షాప్‌లు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులను అందించేందుకు ఆలోచన చేస్తున్నామని మంత్రి ఈటల చెప్పారు. ‘వైద్యారోగ్యశాఖలో 12వేల పోస్టుల భర్తీపై ఉన్న కోర్టు వివాదాలు తొలిగిపోయాయి. ప్రతి ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి ఖాళీలను భర్తీ చేసుకునే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. వైద్యుల కొరత ఉండకుండా చూసుకోబోతున్నాం’ అని మంత్రి వివరించారు.

మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బలోపేతం కావాలి
‘గత ఆరు నెలలు మాత్రమే కాదు ఆరేండ్లుగా వైద్యారోగ్యశాఖ అద్భుతమైన పనితీరును కనబరిచి అద్భు విజయాలను సాధించింది. ప్రజల్లో భరోసా నింపే విధంగా పనిచేస్తూ కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్నది. ప్రస్తుతమున్న మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం కొవిడ్‌ సందర్భంగా ఏర్పడింది. ఈసారి సీజనల్‌ వ్యాధులు తగ్గాయి. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, వైద్యారోగ్యశాఖలు కలిసి పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. రోగాలు, వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇతర రాష్ర్టాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతుంటే.. మన రాష్ట్రంలో అదుపులో ఉంది. ఇది ముమ్మాటికీ వైద్యారోగ్యశాఖ కృషి ఫలితమే’మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌

300కు చేరనున్న బస్తీ దవాఖానలు
ప్రస్తుతం 198 బస్తీ దవాఖానలు సేవలందిస్తున్నాయని, ఈ నెలాఖరుకు మరో 26 ప్రారంభమవుతాయని మంత్రి ఈటల చెప్పారు. ‘మొత్తంగా 300 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం. బస్తీ దవాఖానల్లో 60కిపైగా పరీక్షలు చేస్తున్నారు. భవిష్యత్‌లో వీటి సంఖ్యను మరింత పెంచుతాం. ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరీక్షలు చేయబోతున్నాం. ఇవే కాకుండా ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల నిర్ధారణ పరీక్షలు జరిపేలా చర్యలు తీసుకొని ప్రజలపై ఆర్థికభారం తగ్గిస్తాం’ అని తెలిపారు.

ఉపసంఘం నిర్ణయాలు
-మండల కేంద్రాల్లోని వెల్‌నెస్‌ సెంటర్లను మరింత బలోపేతం చేసేందుకు ఏర్పాట్లు
-పీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, మెడికల్‌ కాలేజీ దవాఖానల్లో వాటి సామర్థ్యాన్ని బట్టి మౌలిక వసతుల కల్పన. వైద్య పరికరాల ఏర్పాటు.
-కిడ్నీ, గుండె, లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాలంటే రూ.30 లక్షల ఖర్చు అవుతున్నది. ప్రస్తుతం నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో చేస్తున్న ఈ చికిత్సలను మెడికల్‌ కాలేజీలకు విస్తరించి, ఆరోగ్యశ్రీ కింద చేర్చడం.
-వివిధరకాల క్యాన్సర్‌ చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతున్నది. ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ కిందకు చేర్చి, ఉచితంగా అందించాలి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.