Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఆర్నెల్లలో అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్

-దానితోనే పారిశ్రామిక రంగానికి పరిపుష్ఠి -50 రోజుల్లోనే దేశ విదేశీ కంపెనీల రాక సాధ్యమైంది -కళాశాలల్లోనే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అమలు -అక్టోబరుకల్లా అందుబాటులోకి వై-ఫై -ఫిక్కీ సదస్సులో ఐటీ మంత్రి కేటీ రామారావు

KTR ఆరు నెలల్లో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే పారిశ్రామిక విధి విధానాల అమలుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లోనే ఏరోస్పేస్, వైద్యం, సర్వీసెస్, హోటల్, ఉత్పాదకరంగాల్లో అనేక ప్రాజెక్టులను చేపట్టేందుకు దేశ, విదేశీ కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు.

హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బుధవారం ఫిక్కీ(ఎఫ్‌ఎల్‌వో), ఫిక్కీ(వైఎఫ్‌ఎల్‌వో) సంయుక్తంగా విజన్ ఫర్ తెలంగాణ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ రంగంలో బెంగళూరు తర్వాతే హైదరాబాద్. అక్కడ ఏటా 23 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాగుతున్నాయి. ఇక్కడేమో 8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలుస్తోంది. ఈ తేడాకు కారణాలను అధ్యయనం చేశాం.

టెక్నో ఎకో సిస్టం లేకపోవడం, వృత్తి నైపుణ్యం లోపించడం, ఉద్యోగాలు చేయగల సమర్థత ఇప్పటికిప్పుడు లేకపోవడం కారణాలుగా తేలాయి. దీనికి ఏకైక మార్గం ఇంక్యుబేషన్ సదుపాయం. అందుకే ఆరు నెలల్లోనే దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తాం. దాంతో ఐటీతోపాటు పారిశ్రామికరంగం పరిపుష్ఠిని సాధిస్తుంది అని చెప్పారు. ఐటీ, ఫార్మా, బయో టెక్నాలజీల్లో తెలంగాణ అతి పెద్ద భాగస్వామ్యం కలిగి ఉందని అన్నారు. ఐఐఐటీ, ఐఎస్‌బీ, నల్సార్ వర్సిటీల సహకారంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి, ఐటీ సెక్టార్‌ను మరింత బలోపేతం చేస్తామన్నారు. జాతీయస్థాయిలో ఎన్‌ఎస్‌డీసీ మాదిరిగానే రాష్ట్రంలోనూ అమలవుతుందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు హెల్త్, మీడియా, లైఫ్ స్టయిల్ ఈవెంట్స్ రంగాలు అనుకూలంగా ఉంటాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

హైదరాబాద్‌లో రక్షణకు చర్యలు పురాతన పోలీసు విధానాలను మార్చేస్తున్నాం. లండన్, న్యూయార్క్ తరహా విధానాలను అమలు చేసే ప్రక్రియలు మొదలుపెట్టాం. రూ.450 కోట్లతో ఆధునిక వాహనాలు, ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయనున్నాం అని కేటీఆర్ తెలిపారు. ఐటీ కారిడార్‌తోపాటు అన్ని ప్రాంతాల్లో మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. అడుగడుగునా నిఘా కెమెరాలు పనిచేస్తాయని హామీ ఇచ్చారు. సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి సూచనలు స్వీకరిస్తున్నామని తెలిపారు. మహిళా పోలీసు స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏదైనా సంఘటన జరిగితే కేవలం 10 నిమిషాల్లోనే పోలీసులు చేరుకునే వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ఐదేళ్లల్లో పవర్ సర్‌ప్లస్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఇబ్బందులకు పరిష్కార దిశలో ఇప్పటికే అడుగులేస్తున్నామని మంత్రి చెప్పారు. ఐదేళ్లల్లో మిగులు విద్యుత్ ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జెన్‌కోకు సొంత పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపేయడంవల్ల 450 మెగావాట్ల లోయర్ సీలేరు హైడల్ ప్రాజెక్టును కోల్పోతున్నామని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఐతే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేసేందుకు గ్రిడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో 1000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు చెప్పారు. పవన విద్యుత్ ప్రాజెక్టులు, వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులను చేపట్టేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చినట్లు తెలిపారు. విద్యుత్తు లోటును ఎలా అధిగమిస్తారని ఎఫ్‌ఎల్‌వో చైర్‌పర్సన్ మోనికా అగర్వాల్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు.

అందరితోనూ సత్సంబంధాలుంటాయ్ పొరుగు రాష్ర్టాల సీఎంలు సిద్ధరామయ్య, పృథ్వీరాజ్ చవాన్, రమణ్‌సింగ్‌తోపాటు చంద్రబాబునాయుడుతోనూ సత్సంబంధాలను కోరుకుంటున్నామని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం సానుకూలంగానే వ్యవహరిస్తామని ఫిక్కీ ప్రతినిధి కమల అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రమేర్పడగానే ఏదో జరిగిపోతుందని కొందరు ప్రచారం చేశారని, ఏదైనా జరిగిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలు సాధారణంగానే జీవనం కొనసాగిస్తున్నారని, అలాగే రాష్ర్టాల మధ్య సంబంధాలు ఉంటాయని చెప్పారు.

మురికివాడల్లేని నగరంగా తీర్చిదిద్దుతాం ఐదేళ్లల్లో హైదరాబాద్ నగరాన్ని ఏం చేస్తారని ఆర్కిటెక్ట్ సోయా జెఠ్మలానీ అడిగినప్పుడు.. మురికివాడల్లేని నగరంగా చేస్తామని, పౌర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. గ్లోబల్ సేఫ్టీ సిస్టమ్స్‌ను అమలుచేసి, సేఫ్, సెక్యురిటీ నగరంగా, స్మార్ట్ సిటీగా రూపొందిస్తామన్నారు. అవినీతిరహిత పాలన అందిస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో రాజకీయ అవినీతి కారణంగానే అభివృద్ధి కుంటుపడిందని మంత్రి అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో ఫిక్కీ ప్రతినిధులు రేఖా లహోటీ, రుయా, రాజ్యలక్ష్మి, కవితారెడ్డి, పల్లవి, అనురాధారెడ్డి, శకుంతల తదితరులు పారిశ్రామిక విధానం, ఐటీ విస్తరణ, హైదరాబాద్ అభివృద్ధి, మహిళా రక్షణ, పోలీసు విధానాలపై ప్రశ్నలు అడిగారు. కార్యక్రమంలో ఫిక్కీ ఎఫ్‌ఎల్‌వో చైర్‌పర్సన్ మోనికా అగర్వాల్, వైఎఫ్‌ఎల్‌వో శకుంతలదేవి ఫిక్కీ కార్యకలాపాల గురించి వివరించారు. సదస్సులో ప్రభుత్వకార్యక్రమాల గురించి మంత్రి కేటీఆర్ వివరించారు.

ప్రభుత్వం అమలు చేయనున్న ప్రాజెక్టులు -మూడో సంవత్సరం చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థుల్లో స్కిల్స్ డెవలప్‌మెంటు కోసం ప్రసిద్ధిగాంచిన మైక్రోసాఫ్ట్‌వంటి కంపెనీల భాగస్వామ్యంతో కార్యక్రమం. -ఫిక్కీ, సీఐఐ, నాస్కాం, అసోచాంవంటి సంస్థలతో కలిసి పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన చర్యలను తీసుకోవడం. -హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రణకు, పాదచారుల రక్షణకు వివిధ ప్రాంతాల్లో 166 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం. -అక్టోబరు ఒకటిన హైదరాబాద్‌లో పోలీసు విధానంపై అంతర్జాతీయ సదస్సు జరుగుతున్నది. దానికి 60 దేశాల నుంచి 2 వేల మంది వరకు ప్రతినిధులు హాజరు కానున్నారు. అప్పట్లోగానే పాక్షిక ప్రాంతాల్లో వై-ఫై సదుపాయాన్ని కల్పించనున్నారు. దీని కోసం రిలయన్స్, ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలు పని చేస్తున్నాయి. 4 జీ సేవలు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.