రాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు – చెరువుల పునరుద్ధరణకు వచ్చేనెలలో టెండర్లు – భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

వృద్ధులకు పెద్ద కొడుకుగా, వితంతువులకు, వికలాంగులకు అన్నగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై రూ.4 వేల కోట్ల భారం పడుతుందని తెలిసినా వారికి అండగా నిలవాలనే ఈ ఆసరా పథకం ద్వారా వారిని ఆదుకునున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో ఆసరా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ సమీపంలోని రామప్ప చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుకు గురైందని, అంతా కష్టం చేసుకునే నిరుపేదలే ఉన్నారని, అలాంటి వారిని ఆదుకోవడానికే ఈ ఆసరా పథకమన్నారు. వచ్చే నెల నుంచి ఆహార భద్రత కార్డుల ద్వారా ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యం అందివ్వనున్నట్లు పేర్కొన్నారు. పింఛన్లు, ఆహార భద్రత కార్డులు రాని వారు ఆధైర్య పడవద్దని, మళ్లీ దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా వస్తాయని వివరించారు. కేంద్రం నుంచి త్రిపుల్‌ఆర్ ద్వారావచ్చే రూ.వెయ్యి కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మిషన్ కాకతీయ పేరుతో కాకతీయులు తవ్వించిన చెరువులు, కుంటలకు పుర్వా వైభవం తీసుకురావడానికి చర్యలు చేపట్టామన్నారు.
ఇందుకోసం వచ్చే నెల నాటికి రూ.5 వేల కోట్ల టెండర్లు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జపనీస్ బ్యాంకు జైకా ద్వారా కూడా నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జ తదితరులు పాల్గొన్నారు.